Telangana Municipal Elections Notification: మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరిగాయి. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలను దక్కించుకుంది. ఇప్పుడు ఇదే ఊపులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలకు పచ్చ జెండా ఊపారు. దీంతో ఎన్నికల సంఘం అధికారులు మున్సిపల్ పోరుకు సంబంధించి మంగళవారం కీలక ప్రకటన చేశారు.
ఎన్నికల సంఘం అధికారులు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. బుధవారం నుంచి జనవరి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు. 31న అభ్యర్థుల పరిశీలన ఉంటుందని.. ఫిబ్రవరి 11 నుంచి పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు. 13న కౌంటింగ్.. అదేరోజు ఫలితాలు కూడా వెల్లడిస్తారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52.43 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ పోరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి విదేశాలలో ఉన్నారు. అక్కడి నుంచి ఆదేశాలు రావడంతో ఎన్నికల సంఘం అధికారులు మున్సిపల్ పోరుకు కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అందే మున్సిపాలిటీలు, నగర పాలకాలలో ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. కొన్నిచోట్ల స్వల్ప వివాదాలు చోటు చేసుకున్నాయి. ఇక మున్సిపల్ ఎన్నికలను అటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు.. ఇటు ప్రతిపక్ష గులాబీ పార్టీ.. బిజెపి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఎన్నికలకు సన్నాహకంగా ఇటీవల ముఖ్యమంత్రి దాదాపు చాలావరకు ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అటు ప్రతిపక్ష గులాబీ పార్టీ నేతలు కూడా విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు..
ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో తమ పార్టీ నుంచి కూడా అభ్యర్థులు బరిలో ఉంటారని ఇప్పటికే కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సింహం గుర్తు మీద అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. మార్చిలో ఆమె రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.. స్థానిక ఎన్నికల్లో కవిత పార్టీ తరఫున అభ్యర్థులు పోటీ చేయలేదు. అయితే తన రాజకీయ ఆగమనానికి మునిసిపల్ ఎన్నికలను ఆయుధంగా వాడుకోవాలని కవిత భావిస్తున్నారు. అటు ఎక్కువ స్థానాలు గెలిచి అధికార పార్టీకి సరైన సమాధానం చెప్పాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ఇటు బిజెపి కూడా అదే స్థాయిలో ఆలోచిస్తోంది.