RS Praveen Kumar: కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద.. తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు.. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ముఖ్యంగా గురుకులాల విషయంలో ప్రవీణ్ తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. వేలకోట్ల కుంభకోణం జరిగిందని.. ఇదంతా రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్ర అని ప్రవీణ్ కుమార్ మండిపడుతున్నారు. రోజుల వ్యవధిలోనే అనేకసార్లు విలేకరుల సమావేశం నిర్వహించి.. ముఖ్యమంత్రిని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా భారతీయ జనతా పార్టీ నుంచి కౌంటర్ వచ్చేసింది. భారతీయ జనతా పార్టీ నాయకుడు గువ్వల బాలరాజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల కార్యదర్శిగా ఉన్నప్పుడు.. గురుకులాల నిర్వహణ.. నిధుల ఖర్చు ఇటువంటి వాటిపై గువ్వల బాలరాజు కీలకమైన ఆధారాలు బయటపెట్టారు. 2013 నుంచి 2021 మధ్యకాలంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా పనిచేసినప్పుడు భారీగా అక్రమాలు జరిగాయని.. దాదాపు పదివేల కోట్ల వరకు ప్రజదనం పక్కదారి పట్టిందని గువ్వల బాలరాజు ఆరోపించారు. ఈ మేరకు తాను ముఖ్యమంత్రికి ఒక లెటర్ రాశారు. టెండర్ ప్రక్రియలు మొత్తం పక్కన పెట్టి.. నిధులను సంతానికి మళ్ళించుకున్నారని బాలరాజు ఆరోపించారు. దీనిపై సమగ్రమైన విచారణ సాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
కేవలం ప్రవీణ్ కుమార్ ను మాత్రమే కాకుండా.. నాటి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావును కూడా బాలరాజు న్యాయపరంగా లక్ష్యంగా చేసుకున్నారు. నాడు జరిగిన అక్రమాలకు కేసీఆర్ మద్దతు ఉందని.. ఆయన సపోర్టుతోనే ఇవన్నీ జరిగాయని బాలరాజు ఆరోపించారు. ఐపీఎస్ కేడర్ స్థాయి అధికారులు నిర్వహించాల్సిన గురుకుల సెక్రటరీ విధులను ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ కు ఏకంగా 10 సంవత్సరాల పాటు అప్పగించడం వెనక ఉన్న నిజాలు ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమంగా ప్రవీణ్ సంపాదించిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు బాలరాజు ముఖ్యమంత్రికి రాసిన లేఖ.. చేసిన విమర్శలపై ప్రవీణ్ కుమార్ కూడా ఆదే స్థాయిలో స్పందించారు. ఇదంతా అబద్ధమని అన్నారు. కేవలం ఎనిమిది వందల కోట్ల వార్షిక బడ్జెట్ ఉన్న గురుకులాలలో వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రవీణ్ ప్రశ్నించారు.. బడ్జెట్ పరిమితులను దృష్టిలో పెట్టుకొని ఆరోపణలు చేయాలని బాలరాజుకు చూపించారు. బాలరాజు చేసిన ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి.. బండి సంజయ్.. బాలరాజు తను లక్ష్యంగా చేస్తున్నారని.. ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఇటువంటి వాటికి తాను భయపడనని ఆయన స్పష్టం చేశారు .
