RK KothaPaluku : ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణకు అప్పుడప్పుడు ప్రజల ప్రయోజనాలు గుర్తుకొస్తాయి. రాష్ట్రాల బాగోగులు మదిలో మెదులుతాయి. అంతే వెంటనే ఆయన కలం వేగంగా పరుగులు పెడుతుంది. నిప్పు రవ్వల మాదిరిగా అక్షరశరాలు సంధిస్తుంది. అతడిలో ఉన్న అసలు పాత్రికేయుడిని బయటపెడుతుంది. ఆరోజున రాధాకృష్ణకు ఎటువంటి రాజకీయాలు ఉండవు. ఎవరినీ ఉపేక్షించరు. చర్నాకోల్ తో కొట్టినట్టుగా.. ఇదీ మీ సంగతి అంటూ నిజాలు బయటపెడుతుంటారు.
తాజాగా ఆదివారం రాసిన కొత్త పలుకులో తెలుగు రాష్ట్రాల ఆర్థిక స్థితిని బయటపెట్టారు వేమూరి రాధాకృష్ణ. కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందని.. చంద్రబాబు పసుపు కుంకుమ వల్ల ఆర్థికంగా భారం పడిందని.. జగన్మోహన్ రెడ్డి పంచుడు పథకాల వల్ల మరింత దారుణంగా మారిందని.. ఇప్పుడు చంద్రబాబు కూడా ఆదే దారిలో వెళ్తున్నారని.. జగన్ మద్యం ఆదాయాన్ని రకరకాల మార్గాలకు మళ్లిస్తే.. చంద్రబాబు గనుల ఆదాయాన్ని తాకట్టు పెట్టారని.. చివరికి రోడ్లు వేసే పరిస్థితి కూడా లేదని.. ఇలా చెప్పుకుంటూ పోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉందని వేమూరి రాధాకృష్ణ వ్యాఖ్యానించారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అంచనా లేక అడ్డగోలుగా హామీలు ఇస్తే పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని రాధాకృష్ణ వాపోయారు. వాస్తవానికి రాధాకృష్ణ మాట్లాడిన మాటల్లో నిజం ఉంది. అయితే ఇదే రాధాకృష్ణ తన పత్రికలో చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రస్తావించినప్పుడు గొప్పగా రాశారు. రాష్ట్ర పరిస్థితి మారుతుందని.. పేదల జీవితాల్లోకి వెలుగు వస్తుందని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు మాత్రం సూపర్ సిక్స్ పథకాలు, ఆరు గ్యారంటీల గురించి అసలు విషయాన్ని బయటపెట్టారు. రేషన్ కార్డుల గురించి.. ఇతర విషయాల గురించి కూడా రాధాకృష్ణ ఓపెన్ గానే మాట్లాడారు. పథకాల విషయంలో అప్పట్లో ఒకలాగా.. ఇప్పట్లో ఒకలాగా రాధాకృష్ణ మాట్లాడడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఇటీవల కాలంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై రాధాకృష్ణ ఓపెన్ గానే తన అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన పత్రికలో నెగిటివ్ కథనాలను ప్రసారం చేస్తున్నారు. వాస్తవానికి ఈ ధోరణి రాధాకృష్ణ గతంలో లేదు. ఉన్నట్టుండి రాధాకృష్ణ ఇలా ఎందుకు మారిపోయారు.. ఇలా ఎందుకు రాస్తున్నారు.. అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది. ఈ మొత్తం వ్యాసంలో భారతీయ జనతా పార్టీకి రాధాకృష్ణ మినహాయింపు ఇవ్వడం విశేషం.. పంచడు పథకాల గురించి నెగటివ్ ధోరణి లో మాట్లాడిన రాధాకృష్ణ.. తన పత్రిక సర్కులేషన్ పెంచడానికి లక్కీ డ్రా అనే స్కీం ఎందుకు పెడుతున్నట్టు? ఆయన పత్రికలో దమ్మున్న వార్తలే ప్రసారమవుతున్నాయి కదా.. అలాంటప్పుడు పాఠకులు విరగబడి పత్రికను కొంటారు కదా.. ఇదే సూత్రం రాజకీయ పార్టీలకు కూడా వర్తిస్తుంది. ఈ చిన్న లాజిక్ రాధాకృష్ణ ఎలా మిస్ అయ్యారో మరి.