cheteshwar pujara : బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా ఇటీవల ఆస్ట్రేలియాలో భారత్ పర్యటించింది. పెర్త్ టెస్టులో విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా ఓటములు ఎదుర్కొంది. సిరీస్ ను కోల్పోయింది. వాస్తవానికి రెండో టెస్ట్ నుంచి చివరి టెస్ట్ వరకు భారత్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంది. ఈ సమయంలో భారత్ విజయం సాధించాలంటే కచ్చితంగా పూజార రావాల్సిందేనని.. పూజారకు చోటిస్తేనే భారత్ గెలుస్తుందని.. సోషల్ మీడియాలో ఒక ఉద్యమం నడిచింది. దాదాపు ఆ సిరీస్ జరిగినన్నీ రోజులూ ఈ ఉద్యమం సాగింది అంటే పూజారకు ఉన్న రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు..
పూజార అద్భుతమైన ఆటగాడు. టెస్ట్ క్రికెట్ ఎలా ఆడాలో.. ప్రత్యర్థి బౌలర్లకు ఎలా చుక్కలు చూపించాలో తెలిసినవాడు.. ఉదాహరణకు 2018 -19 కాలంలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతడు మూడు సెంచరీలు చేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ టెస్ట్ సిరీస్ లో 928 బంతులు ఎదుర్కొన్నాడు. బ్రిస్ బెన్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఏకంగా 211 బంతులు ఎదుర్కొన్నాడు. చేసింది 56 పరుగులు మాత్రమే అయినప్పటికీ అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీనిని బట్టి అతడు టెస్ట్ క్రికెట్లో ఎటువంటి ప్రమాణాలు నెలకొల్పాడో అర్థం చేసుకోవచ్చు.
జట్టు కోసం సుదీర్ఘకాలంగా ఆడటం.. మూడో స్థానంలో తిరుగులేని స్థాయిని అందుకోవడంలో పూజార విజయవంతం అయ్యాడు. అటువంటి ఆటగాడిని మరో దేశమైతే అద్భుతంగా కీర్తించేది. అపరిమిత అవకాశాలు ఇచ్చేది. సుదీర్ఘ క్రికెట్ ఆడే సమయంలో గాయాల బారిన పడటంతో పూజార కెరియర్ ప్రశ్నార్థకంగా మారింది. అప్పట్లో రాహుల్ ద్రావిడ్ ఉన్నప్పుడు పూజారకు విరివిగా అవకాశాలు వచ్చేవి. ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. గంభీర్ శిక్షకుడిగా వచ్చిన తర్వాత టీమ్ ఇండియాలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. చివరికి జట్టులో స్థానం లభించకపోవడంతో.. పూజారకు కూడా ఏం జరుగుతుందో అర్థమైంది. వేచి చూస్తే లాభం లేదని.. అవకాశాలు వస్తాయని ఎదురు చూడడంలో ఉపయోగం లేదని భావించి.. క్రికెట్ కు శాశ్వత వీడ్కోలు పలికాడు. అయితే తదుపరి అతని ప్రయాణం ఎలా సాగుతుంది? అనే ప్రశ్నకు సమాధానం లభించాల్సి ఉంది. ప్రస్తుతం అయితే అతడు వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు. ఒకవేళ దీనినే కొనసాగిస్తాడా.. ఇంకా వేరే మార్గం వైపు ప్రయాణిస్తాడా అనేది.. చూడాల్సి ఉంది.