Mahaa News Channel attack : తెలంగాణ రాజకీయాలలో శనివారం అనూహ్య మార్పు చోటుచేసుకుంది.. మహా న్యూస్ ఛానల్ మీద కేటీఆర్ అనుచరులు దాడి చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.. కేటీఆర్ అనుచరులు మూకుమ్మడిగా దాడి చేయడంతో మహా న్యూస్ కార్యాలయం లో విధ్వంసం చోటుచేసుకుంది. కార్యాలయంలో అద్దాలు పగిలిపోయాయి. కార్లు ధ్వంసమయ్యాయి. విలువైన పరికరాలు కూడా దెబ్బతిన్నాయి.
కేటీఆర్ అనుచరులు దాడి చేసిన తర్వాత మహా టీవీ అధినేత వంశీ విలేకరులతో మాట్లాడారు. తాము అడ్డగోలుగా కథనాలను ప్రసారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ప్రజాస్వామ్యయుతంగా నిరసన చేపట్టవచ్చని.. ఇలా దాడులు చేయడం సరైన విధానం కాదని ఆయన మండిపడ్డారు. ఇలా వ్యవహరించడం ఎంతవరకు సరైనదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తాను వెనక్కి తగ్గబోనని .. ఈ దాడికి పాల్పడిన వ్యక్తులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దాడి తర్వాత ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న సమయంలో ఆయన వెంట మహా న్యూస్ ఛానల్ లో పనిచేసే ఉద్యోగులు ఉన్నారు. గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి అనుచరుల దాడిలో ఆ న్యూస్ ఛానల్ కార్యాలయం దారుణంగా ధ్వంసం అయింది. ముఖ్యంగా విలువైన పరికరాలు మొత్తం పగిలిపోయాయి. అయితే మిగతా పరికరాలను ప్యాక్ చేసుకొని మహా న్యూస్ ఉద్యోగులు వెళ్లిపోయారు. వేరే సురక్షితమైన ప్రాంతానికి ఆ పరికరాలను చేర్చారు. అక్కడి నుంచే మహా టీవీ ప్రసారాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.
మహా టీవీ న్యూస్ కార్యాలయం పై కేటీఆర్ అనుచరులు దాడి చేసిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు రంగంలోకి దిగారు. ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే మహా టీవీ కార్యాలయానికి చేరుకున్నారు. వేరువేరుగా సందర్శించారు. మంత్రులు దాడికి గురైన న్యూస్ ఛానల్ కార్యాలయానికి వచ్చినప్పుడు.. ఆ న్యూస్ ఛానల్ ఎండి వంశి వారి వెంట ఉన్నారు. దాడి జరిగిన తీరు.. పరికరాలు ధ్వంసమైన తీరును మంత్రులకు వివరించారు. మంత్రుల వెంట కాంగ్రెస్ నాయకులు చాలామంది ఉన్నారు.. జరిగిన దాడిని వారంతా ఖండించారు. ఈ దాడి వెనుక ఉన్న వారందరినీ కచ్చితంగా గుర్తిస్తామని.. వారిపై చర్యలు తీసుకుంటామని వంశీకి హామీ ఇచ్చారు.
మహా న్యూస్ ఛానెల్ కార్యాలయాన్ని సందర్శించిన భట్టి విక్రమార్క pic.twitter.com/f1J281ydoY
— Telugu Scribe (@TeluguScribe) June 28, 2025
మహా టీవీ కార్యాలయాన్ని కాంగ్రెస్ నాయకులు సందర్శించిన తర్వాత గులాబీ నాయకులు సోషల్ మీడియా వేదికగా వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు. కల్వకుంట్ల తారక రామారావు కు వ్యతిరేకంగా మహాటీవీ వార్తలు ప్రసారం చేసినప్పుడు.. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి వివరణ లేకుండా అడ్డగోలుగా కథనాలను ప్రసారం చేసినప్పుడు ఈ మంత్రులు మొత్తం ఎక్కడికి పోయారని గులాబీ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.. తమకు అనుకూలంగా ఉండే మీడియా ఆఫీస్ పై దాడి జరిగితే ఆగ మేఘాల మీద స్పందిస్తున్నారని.. ప్రజాస్వామ్యం గురించి.. పాత్రికేయం గురించి చెబుతున్నారని.. గులాబీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.. అడ్డగోలుగా కథనాలను ప్రసారం చేస్తే పర్యవసానాలు ఇలాగే ఉంటాయని గులాబీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ నాయకులు కూడా గులాబి నాయకులకు తగ్గట్టుగానే స్పందిస్తున్నారు. వారికి సోషల్ మీడియాలో గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి మహా టీవీ కార్యాలయం పై జరిగిన దాడి తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది.
మహా న్యూస్ కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్
మహా టీవీపై దాడిని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పేర్కొన్న మంత్రి పొన్నం
వ్యక్తిగతంగా, వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని కార్యకర్తలను ఉసిగొల్పి దాడి చేయించడం సరికాదని వెల్లడి
అధికారం కోల్పోయిన తర్వాత ఇలా విచక్షణ… pic.twitter.com/2wydPS3XcR
— BIG TV Breaking News (@bigtvtelugu) June 28, 2025