Guvala Balaraju vs KTR : రాజకీయాలలో శాశ్వతమైన స్థానాలు ఎవరికీ ఉండవు. అప్పటిదాకా ఆ పార్టీలో ఉన్నవారు వేరే పార్టీలోకి వెళ్లొచ్చు. వేరే పార్టీలో ఉన్నవాళ్లు ఇతర పార్టీలోకి వెళ్లొచ్చు. అదేదో సినిమాలో చెప్పినట్టు రాజకీయాలు అనేవి మయసభ లాంటివి. స్థానాలు శాశ్వతం కాదు. వ్యక్తులకు పదవులు స్థిరం కాదు.
రాజకీయాలు శాశ్వతమైనవి.. పార్టీలలో స్థానాలు తాత్కాలికమైనవని మరోసారి నిరుపితమైంది. తెలంగాణ రాష్ట్రంలో గతంలో అచ్చంపేట స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు గువ్వల బాలరాజు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఫామ్హౌస్ వ్యవహారంలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే కీలకంగా ఉన్నారు. ఆ వ్యవహారం జరనన్ని రోజులు గువ్వల బాలరాజు ప్రగతి భవన్ కు పరిమితమయ్యారు. అప్పట్లో ఆ వ్యవహారం మొత్తం కేసీఆర్ నడిపిన డ్రామా అని.. తనకు సంతోష్ అంటే ఎవరో తెలియదని.. బాలరాజు ఇటీవల కుండబద్దలు కొట్టారు. అంతేకాదు తనతో పాటు చాలామంది కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. దానికి తగ్గట్టుగానే బాలరాజు ఆదివారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు సమక్షంలో బిజెపిలో చేరారు.
బిజెపిలో చేరిన తర్వాత బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తనను ఇటీవల ఉద్దేశించి భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు బచ్చాగాడు అని చేసిన వ్యాఖ్యలపై బాలరాజు స్పందించారు..” నేను ఆకలి కేకలను వినిపించడం మొదలుపెడితే కల్వకుంట్ల తారక రామారావు గ్రామాలలో తిరగలేడు. నాకంటే ఆయన పెద్దోడు కాదు. ఆయన ఎదిగిన సామాజిక వర్గం నుంచి వచ్చారు. అమెరికాలో చదువుకున్నారు. ఆయనకున్న నైపుణ్యాలు నాకు లేకపోవచ్చు. ఆయనలాగా ఆకట్టుకునే విధంగా నేను ప్రసంగాలు చేయలేకపోవచ్చు. కానీ నేను చూసిన ఆకలి మంటలు ఆయన చూడలేదు. నా అంత అనుభవం ఆయనకు లేదు. ఆయన తొలిసారి ఎన్నికల్లో గెలిచినప్పుడు 300 ఓట్ల మెజారిటీ మాత్రమే సాధించారు. అలా అయితే ఆయనే బచ్చాగాడు కదా.. ఆ మాత్రం దానికి ఆయనకేదో విపరీతమైన అనుభవం ఉన్నట్టు మాట్లాడితే ఎలా కుదురుతుందని” బాలరాజు విమర్శించారు..
గులాబీ దళపతిని ఉద్దేశించి కూడా బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు..” కెసిఆర్ రెండుసార్లు ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం నేనే. మేము వేసిన బిచ్చంతోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఆరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతుందని చెప్పారు. నేను నిన్ను నమ్మాను.. అందువల్ల ఈ టాస్క్ ఇస్తున్నానని నాతో అన్నారు. దానికి నేను సరే అన్నాను. ఫామ్ హౌస్ ఎపిసోడ్ గురించి చెబితే సరే అన్నాను. ఆ తర్వాత కేసీఆర్ చెప్పినట్టు చేశానని” బాలరాజు పేర్కొన్నారు.