Midhun Reddy Arrest : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చోటు చేసుకున్న మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం కొద్దిరోజులుగా విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ విచారణలో శనివారం రాత్రి కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు మిధున్ రెడ్డి కి ప్రత్యేక దర్యాప్తు బృందం షాక్ ఇచ్చింది.. దీంతో ఏపీలో రాజకీయ పరిణామాలు మరింత హాట్ హాట్ గా మారిపోయాయి.
మద్యం కుంభకోణంలో ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం 300 పేజీలతో ప్రత్యేకమైన చార్జి షీట్ ఏర్పాటు చేసింది. అంతేకాదు ప్రిలిమినరీ చార్జి షీట్ కూడా దాఖలు చేసింది. చార్జిషీట్లో 100కు పైగా ఆర్ ఎఫ్ ఎస్ ఎల్ నివేదికలు సమర్పించింది. ఈ కేసులో ఇప్పటివరకు 62 కోట్లు సీజ్ చేశామని ప్రత్యేక దర్యాప్తు బృందం వెల్లడించింది. 268 మంది సాక్షులను విచారించింది. మిథున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఐదు గంటల పాటు విచారించారు. డొల్ల కంపెనీల ద్వారా ప్రైమ్ బెనిఫిషర్ కి లబ్ధి చేకూర్చిన విషయంపై ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నలు పంపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో మిథున్ రెడ్డి కీలకమైన వ్యక్తి అని పోలీసులు భావిస్తున్న సమాచారం. అంతేకాదు ఈ కేసు విషయంలో ప్రాథమికంగా చార్జ్ షీట్లను పోలీసులు కోర్టుకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.
ఐదు గంటల పాటు విచారణ జరిగిన తర్వాత.. వైసిపి పార్లమెంట్ సభ్యుడిని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అరెస్ట్ చేశారు. అతని అరెస్ట్ కంటే ముందు నోటీసులు ఇచ్చారు. ఈ విషయంపై కుటుంబ సభ్యులకు సమాచారం కూడా అందించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో మిథున్ రెడ్డిని కోర్టులో హాజరు పరుస్తారని తెలుస్తోంది. మద్యం కుంభకోణం లో ఏ 4 గా మిథున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు పేర్కొన్నారు.. వివిధ కంపెనీల ద్వారా ఒక వ్యక్తికి ముడుపులు చేర్చారని.. అందువల్లే మిథున్ రెడ్డి ఈ కేసులో కీలకమైన నిందితుడిగా ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.. మిథున్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించారు. వైసిపి కార్యకర్తలు ఆందోళనలు చేసే అవకాశం ఉన్నందున ముందుగానే బలగాలను భారీగా మోహరించారు. మిథున్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో మద్యం కుంభకోణంలో ప్రత్యక్ష పాత్ర ఉన్నవారు ఒక్కసారిగా డైలమాలో పడ్డట్టు తెలుస్తోంది.. అయితే ఈ కేసులో అరెస్టులు ఇక్కడితోనే ఆగిపోతాయా.. మునుముందు మరిన్ని చోటుచేసుకుంటాయా అనేది చూడాల్సి ఉంది.
అయితే ఈ కుంభకోణం లో పరోక్షంగా ఉన్న వ్యక్తులు నల్ల డబ్బును వేరే మార్గాల ద్వారా వైట్ మనీ గా మార్చారని.. అందులో కొంత డబ్బును చిత్రపరిశ్రమ లోకి మళ్ళించారని సిట్ అధికారులు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలు రూపొందించినవారు అప్పటి వైసిపికి అత్యంత దగ్గర వ్యక్తులని అధికారులు పేర్కొన్నారు. అయితే ఆ వ్యక్తులను కూడా త్వరలోనే ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ కేసులో ఇంకా వెలికి తీయాల్సిన వాస్తవాలు చాలా ఉన్నాయని.. ప్రత్యేక దర్యాప్తు బృందం ఆ దిశగా విచారణ చేపడుతోందని వార్తలు వస్తున్నాయి. మిథున్ రెడ్డిని అరెస్టు చేసిన నేపథ్యంలో.. తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అరెస్టు చేసేది మాజీ ముఖ్యమంత్రి జగన్ నే అని కూటమి అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇటీవల కూటమి ప్రభుత్వంలోని మంత్రులు అధికారిక కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు.. మద్యం కుంభకోణంలో జగన్ అరెస్ట్ కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఆయన ఆధ్వర్యంలోనే మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపించారు . ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారని .. నాడు మద్యం కుంభకోణం జరిగినప్పుడు హవాలా మార్గాలలో జగన్ దగ్గరికి డబ్బులు వెళ్లాయని.. అందులో మిధున్ రెడ్డికి ప్రత్యక్ష పాత్ర ఉందని కూటమి ప్రభుత్వ మంత్రులు ఆరోపించారు. వారి ఆరోపణలకు తగ్గట్టుగానే ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారణ చేస్తున్నారు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. త్వరలో జగన్ ను కూడా అరెస్ట్ చేస్తారని టిడిపి కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.