Fish Venkat remuneration: ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్(Fish Venkat) గత కొంతకాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ , హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ నేడు తన తుదిశ్వాస విడిచిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. సినీ లోకం అంటే ఆయన్ని ఇష్టపడే ప్రేక్షకులు, సినీ ఇండస్ట్రీ నుండి ఒక్క సెలబ్రిటీ కూడా ఫిష్ వెంకట్ మరణం పై సంతాపం వ్యక్తం చేయలేదు. చివరి రోజుల్లో పాపం ఆయన్ని ఇండస్ట్రీ ఒంటరి వాడిని చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినీ పెద్దలు తమ పలుకుబడిని ఉపయోగించి, ఒక్క కిడ్నీ డాతని కూడా పట్ట్టుకోలేకపోయారా?, ఇదే వాళ్ళ కుటుంబ సభ్యులలో సమస్య వస్తే నిమిషాల వ్యవధిలో జరిగిపోతాయి కదా?, ఫిష్ వెంకట్ విషయం లో కూడా పరిశ్రమ శ్రద్ద పెట్టి ఉండుంటే నేడు ఆయన బ్రతికే అవకాశాలు ఉండేవేమో.
ఇక ఫిష్ వెంకట్ సినీ ప్రస్థానం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఈయన కెరీర్ పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రం తో మొదలైంది. ఇతను మాట్లాడే తీరు, హావభావాలు నచ్చి వీవీ వినాయక్ తన ప్రతీ సినిమాలో రౌడీ గ్యాంగ్ లో పెట్టుకునే వాడు. ఆది చిత్రం లో ఎన్టీఆర్ ని రెచ్చగొడుతూ ‘తొడగొట్టు చిన్నా..తొడగొట్టు’ అంటూ ఫిష్ వెంకట్ ఆరోజుల్లో చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది. ఏడాదికి ఎన్ని సినిమాలు విడుదలైతే, అన్ని సినిమాల్లోనూ దాదాపుగా ఫిష్ వెంకట్ ఉండేవాడు. ఆ రేంజ్ లో ఆరోజుల్లో ఆయనకు డిమాండ్ ఉండేది. అవకాశాలు అయితే దండిగా వచ్చేవి కానీ, ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్ మాత్రం ఎవ్వరూ ఆఫర్ చేయలేదు. ఒక్క గబ్బర్ సింగ్ చిత్రం లోనే కాస్త నటించడానికి స్కోప్ దొరికింది. అయితే ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్ చేయలేదు కాబట్టి, రెమ్యూనరేషన్ కూడా ఆశించిన స్థాయిలో ఉండేది కాదు.
ఒక రోజుకి ఆయన 15 వేల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ని అందుకునేవాడట. అలా నెలలో ఎన్ని సినిమాలకు పని చేస్తే అన్ని 15 వేల రూపాయిలు ఆయనకు వచ్చేవి. అలా కెరీర్ మంచి పీక్ రేంజ్ లో కొనసాగుతున్నప్పుడు ఆయనకు షుగర్ కారణంగా కాళ్ళు పూర్తి గా దెబ్బ తినడం, దాంతో పాటు కిడ్నీలు చెడిపోవడం వంటివి జరిగాయి. దీంతో ఆయన సినిమాల్లో అవకాశాలు వస్తున్నప్పటికీ రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనారోగ్యం తో ఉన్నోళ్లు సరైన చికిత్స అందుకొని మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారు కదా, ఫిష్ వెంకట్ పరిస్థితి కూడా అలాగే అవుతుంది లే అని అంతా అనుకున్నారు. కానీ ఆయన పరిస్థితి విషమంగా మారి ఈరోజు తిరిగి రాని లోకాలకు పయనమయ్యాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.