ABN Radhakrishna Vs Jagadishwar Reddy : ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా అత్యయిక పరిస్థితిని విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఆమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శించాయి. మీడియాపరంగా ఇండియన్ ఎక్స్ ప్రెస్ అధినేత రామ్ నాథ్ గోయంకా ప్రధానమంత్రి నిర్ణయాన్ని తప్పుపట్టారు.. అలాగని పత్రిక భాషలోనే ఆమె తీసుకున్న నిర్ణయం దేశం మీద ఎలా ప్రభావం చూపిస్తుందో ఆయన పత్రికలో రాయించారు. అంతేతప్ప వ్యక్తిగత ఏజెండాతో.. వ్యక్తిగత లక్ష్యంతో వార్తలు రాయించలేదు.. ఇప్పటికీ రామ్ నాథ్ గురించి పాత్రికేయులు చెప్పుకుంటున్నారంటే ఆయన కాపాడుకున్న విలువలు.. కొనసాగించిన విధానాలే దానికి నిదర్శనం.
పాత్రికేయం అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం. వ్యక్తిగత లక్ష్యాలకు తావు లేకుండా ప్రజల కోణాన్ని ఆవిష్కరించడం. ప్రభుత్వ పరంగా మంచి జరిగితే మంచిని చూపించడం.. చెడు జరిగితే చెడును బహిర్గతం చేయడమే మీడియా లక్ష్యం కావాలి. అంతేతప్ప సొంత ఏజెండాను ఎట్టి పరిస్థితిలో ప్రదర్శించకూడదు. వ్యక్తిగత లక్ష్యాలను బహిర్గతం చేయకూడదు.. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు మీడియాలో ముఖ్యంగా మీడియా అధినేతలు తమ లక్ష్యాలను ప్రదర్శించడమే పనిగా పెట్టుకున్నారు. కండువాలు మెడలో వేసుకోకుండానే.. రాజకీయ పార్టీల ప్రతినిధులుగా చెలామణి అవుతున్నారు. దీనివల్ల సమాజానికి ఎంత లాభమో.. ఎంతటి ప్రయోజనమో వారే గుర్తుంచుకోవాలి.. తెలుగులో పార్టీలకు.. వర్గాలకు, వర్ణాలకు కొమ్ముకాసే వ్యవస్థగా మీడియా మారిపోయి చాలా సంవత్సరాలు దాటిపోయింది. అందువల్లే మీడియా అంటే నమ్మని పరిస్థితి నెలకొంది. ఇదే క్రమంలో పత్రికలు పెట్టుబడిదారుల విష పుత్రికలు అని వెనుకటికి శ్రీశ్రీ చెప్పిన మాటలు పదేపదే వల్లె వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
ఇటీవల తన ఆంధ్రజ్యోతి పత్రికలో వేమూరి రాధాకృష్ణ భారత రాష్ట్ర సమితి పై విమర్శలు చేశారు. దీనికి కారణం లేకపోలేదు.. ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు పై అధమ స్థాయిలో థంబ్ నెయిల్స్ ఏర్పాటు చేసింది. అది సహజంగానే గులాబీ పార్టీ నాయకులకు ఆగ్రహాన్ని కలిగించింది. దీంతో వారు ఆ న్యూస్ ఛానల్ కార్యాలయం పై దాడి చేశారు. ఇదే సమయంలో భారత రాష్ట్రపతి నాయకులు తమ రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా ప్రాంతీయ విభేదాలను సృష్టించే ప్రయత్నం చేశారు. రాజకీయ నాయకులు కాబట్టి వారు అలానే మాట్లాడుతారు. కాకపోతే ఈ విషయాన్ని వేమూరి రాధాకృష్ణ కాస్త సీరియస్ గా తీసుకున్నాడు. సహజంగానే ఆయన గెలుక్కునే రకం కాబట్టి.. భారత రాష్ట్ర సమితి నాయకులపై విరుచుకుపడ్డారు. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేను జగదీశ్వర్ రెడ్డిని మరగుజ్జు అని సంబోధించారు. అంతేకాదు భారత రాష్ట్ర సమితి అధినేతపై వేమూరి రాధాకృష్ణ లైన్ దాటి విమర్శలు చేశారు. వాస్తవానికి ఒక రాజకీయ నాయకుడికి నోటిమీద విచక్షణ ఉండదు. కానీ ఒక పాత్రికేయుడు విచక్షణ కోల్పోకూడదు. రాజకీయ నాయకుడికి తన హితం మాత్రమే కావాలి. పాత్రికేయుడికి సమాజ హితమే పరమావధి కావాలి. కానీ ఈ విషయాన్ని రాధాకృష్ణ మర్చిపోయినట్టున్నారు. అందువల్లే పక్కా పొలిటికల్ లైన్ లో విమర్శలు చేశారు.
రాధాకృష్ణ చేసిన విమర్శలు సహజంగానే భారత రాష్ట్ర సమితి నాయకులకు ఆగ్రహాన్ని కలిగించాయి. రాధాకృష్ణ రాసిన వ్యాసం తర్వాత కొద్ది రోజులకు జగదీశ్వర్ రెడ్డి స్పందించారు. ఆయన శైలిలో కౌంటర్లు ఇచ్చారు.. దీంతో వివాదం సమసి పోయింది. ఇంతలోనే జగదీశ్వర్ రెడ్డి పుట్టినరోజు వచ్చింది. సహజంగానే రాజకీయ నాయకుడి పుట్టినరోజు అంటే పత్రికలకు యాడ్స్ వస్తుంటాయి కాబట్టి పండగ చేసుకుంటే.. గతంలో జగదీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఆంధ్రజ్యోతికి బీభత్సంగా ప్రకటనలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు రాధాకృష్ణ రాసిన వ్యాసంతో జగదీశ్వర్ రెడ్డికి కోపం వచ్చింది. దీంతో ఈసారి ఆయన తన పుట్టినరోజుకు ఆంధ్రజ్యోతి పత్రిక ప్రకటనలు ఇవ్వలేదు. ఆయన మాత్రమే కాదు అనుచరులతో కూడా ప్రకటనలు ఇప్పించలేదు. అయితే తన పుట్టినరోజు వేడుకలకు ఆంధ్రజ్యోతి ఉద్యోగులపై మాత్రం జగదీశ్వర్ రెడ్డి పక్షపాతం చూపించలేదు. వారిని కూడా ఆహ్వానించాడు. ఆయనకు తగ్గ స్థాయిలో మర్యాద చేశాడు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులపై ప్రేమ పూర్వక స్పందననే ప్రదర్శించాడు..” మీ యాజమాన్యంతోనే నాకు వివాదం. మీరు ఉద్యోగులు.. మీపై నాకు ఎటువంటి కోపం ఉండదు. కోపం పెంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను ఎక్కడ తేల్చుకోవాలో అక్కడే మాట్లాడతాను” అంటూ జగదీశ్వర్ రెడ్డి ఆంధ్రజ్యోతి ఉద్యోగులతో వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఆ పత్రికలో పనిచేసే ఓ పెద్ద వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రకటనల కోసం వాకబు చేయగా.. ఆయనకు ఊహించని పరాభవం ఎదురైందని తెలుస్తోంది.