Serial Actor Chandu: మరణంలో కూడా నీకు తోడు ఉంటానని వెళ్ళిపోయాడు చంద్రకాంత్ అలియాస్ చందూ. పవిత్ర జయరాం మరణించి వారం రోజులు గడవక ముందే చందూ సైతం మృత్యువు ఒడిలోకి చేరుకున్నాడు. ఈ సంఘటన బుల్లితెర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే… త్రినయని సీరియల్ లో మెయిన్ విలన్ రోల్ చేస్తున్న పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించింది. మే 12 అర్ధరాత్రి జరిగిన కారు ప్రమాదంలో ఆమె కన్నుమూశారు.
అదే కారులో చందు, పవిత్ర జయరాం కూతురు, మరొక యువతి ఉన్నారు. చందూ ప్రమాదం గురించి మాట్లాడుతూ … నాకు మాత్రమే దెబ్బలు తగిలాయి. రక్తపు మడుగులో ఉన్న నన్ను చూసి పవిత్ర జయరాం షాక్ కి గురైంది. ఆమెకు హార్ట్ అటాక్ వచ్చింది. మేము అంబులెన్స్ కి కాల్ చేశాము. సరైన సమయానికి అది రాలేదు. అంబులెన్స్ అందుబాటులో ఉంటే పవిత్ర జయరాంని కాపాడుకునేవాళ్ళం అని ఆవేదన చెందాడు.
పవిత్ర మరణంతో చందు తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తుంది. డిప్రెషన్ లోకి జారుకున్న చందు మే 17 శుక్రవారం ఆత్మహత్యకు చేసుకున్నారు. మణికొండ లో గల ఓ అపార్ట్మెంట్ లో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. పవిత్రతో ఆయన జీవించిన గదిలోనే చందూ కన్నుమూశాడు. పవిత్ర జయరాం మరణించి వారం గడవక ముందే చందు కూడా కన్నుమూయడం ఊహించని విషాదం.
చందు 2015లో శిల్ప అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడని సమాచారం. వీరికి ఇద్దరు పిల్లలు. చందూకు భార్యతో మనస్పర్థలు తలెత్తాయి. దాంతో శిల్పకు దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది. ఇక గత ఐదేళ్లుగా పవిత్ర జయరాంతో ఆయన సన్నిహితంగా ఉంటున్నారు. వీరికి వివాహం జరిగినట్లు ఆధారాలు లేవు. పవిత్ర జయరాం సైతం కూతురితో ఒంటరిగా ఉంటున్న నేపథ్యంలో ఇద్దరు సహజీవనం చేస్తున్నారనే వాదన ఉంది. చందు పలు తెలుగు సీరియల్స్ లో నటించాడు. ప్రస్తుతం కార్తీక దీపం చేస్తున్నాడు.