Bigg Boss Telugu 9: ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) నిన్న గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ తో ఘనంగా మొదలైంది. మొత్తం మీద 14 మంది కంటెస్టెంట్స్ లోపలకు అడుగుపెడుతారని అంతా అనుకున్నారు కానీ, చివర్లో ట్విస్ట్ ఇస్తూ 15 మందిని లోపలకు పంపారు. కంటెస్టెంట్స్ అందరూ మంచి ఆటగాళ్లు లెక్కనే ఉన్నారు, బోలెడంత కంటెంట్ ఇచ్చేలాగానే అనిపిస్తున్నారు. అయితే నిన్న భరణి శంకర్(Bharani Shankar) అనే కంటెస్టెంట్ బాగా హైలైట్ అయిన సంగతి తెలిసిందే. చేతిలో ఒక గిఫ్ట్ బాక్స్ పట్టుకొని వచ్చి, దీనిని నాతో పాటు లోపలకు పంపితేనే హౌస్ లోకి వెళ్తాను, లేదంటే ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను అని అంటాడు. అప్పుడు నాగార్జున(Akkineni Nagarjuna) సరే ఇంటికి తిరిగి వెళ్ళిపో అనగానే భరణి వెళ్ళిపోతాడు. ఆడియన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. కానీ కాసేపటి తర్వాత అతన్ని మళ్లీ పిలిచి, లోపలకు ఆ బాక్స్ తో వెళ్లేందుకు అనుమతిని ఇచ్చాడు నాగార్జున.
అయితే హౌస్ లోకి వెళ్లే ముందు తన జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు భరణి. ఎలా పడితే అలా వెళ్తున్న నా జీవితాన్ని కరోనా లాక్ డౌన్ సమయం లో ఒక వ్యక్తి మార్చేశాడని చెప్పుకొచ్చాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, మెగా బ్రదర్ నాగబాబు(Nagababu Konidela). వీళ్లిద్దరు కలిసి గతంలో మహాలక్ష్మి అనే సీరియల్ లో కూడా నటించారు. అప్పటి నుండి వీళ్ళ మధ్య ఏర్పడిన ఆ పరిచయం కాస్త అన్నదమ్ములు లాగా కలిసిపోయేలా చేసింది. ఇప్పుడు భరణి శంకర్ హౌస్ లోపలకు అడుగుపెట్టడం తో తన మద్దతుని తెలియజేస్తూ నాగబాబు పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆయన మాట్లాడుతూ ‘నాకు అత్యంత సన్నిహితుడైన భరణి శంకర్ బిగ్ బాస్ 9 లోకి ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. అతనికి నా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ, విజయం సాధించాలని, ఈ సరికొత్త ప్రయాణం ద్వారా అతను ప్రేక్షకులకు ఇంకా బాగా దగ్గరై మరింత పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు నాగబాబు.
దీంతో మెగా ఫ్యాన్స్ సపోర్ట్ మొత్తం భరణి శంకర్ కి ఉన్నట్టే అనుకోవాలి. హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఇతని ప్రవర్తన కూడా అందరికీ చాలా బాగా నచ్చింది. తన తోటి సెలబ్రిటీ కంటెస్టెంట్స్ తో కలిసిపోతూ, మరోపక్క అగ్నిపరీక్ష సామాన్య కంటెస్టెంట్స్ తో కూడా కలిసిపోయి చాలా కూల్ గా ఉంటున్నాడు. టాస్కు వచ్చినప్పుడు ఎగబడి ఆడేలాగా కూడా కనిపిస్తున్నాడు. హౌస్ లో ఇతను అందరికంటే పెద్ద కాబట్టి, రాబోయే రోజుల్లో ఇతను తన ఆట తీరు ద్వారా మరో శివాజీ లాంటి కంటెస్టెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇతను అంచనాలను అందుకోగలడా లేదా అనేది.