Nalgonda: పాతికేళ్ల వయసులో తాగుడుకు బానిసైన భర్తను కోల్పోతే ఆ భార్యకు ఎంత నష్టం.. ఇద్దరు పిల్లల్ని సాకడం ఎంత కష్టం.. ఇలా ఒకరి కాదు ఇద్దరు కాదు.. వేలాదిమంది ఇలానే బాధపడుతున్నారు. భర్తను కోల్పోయిన భార్యలు.. కొడుకులను కోల్పోయిన తల్లులు.. అల్లుళ్లను నష్టపోయిన అత్తలు.. ఇలా ఎంతోమంది.. అందుకే మా బాధలు ఇంకొకరికి రావద్దు అంటూ.. ఆ కష్టాలు మరొకరు పడొద్దంటూ కదం తొక్కారు. చైతన్యాన్ని కాళ్ల నిండా నింపుకొని ముందుకు కదిలారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మందు అమ్మొద్దు.. సిగరెట్లు విక్రయించవద్దు.. మందు బాబులను పట్టిస్తే 10,000 నజరానా ఇస్తాం.. బెల్ట్ దుకాణం నిర్వహిస్తే లక్ష రూపాయలు జరిమానా విధిస్తాం. తాగి దొరికితే 20,000 వసూలు చేస్తామని ఆ మహిళలు ఒక నిబంధన విధించుకున్నారు. దానికి తగ్గట్టుగానే గ్రామంలో ప్రదర్శన చేశారు. ఆ మహిళల చైతన్యం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కదిలించింది. పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఇటీవల నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఓ యువకుడు మద్యం తాగి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూశాడు. ఈ ఘటన ఏపూరు మహిళలకు దిగ్భ్రాంతిని కలిగించింది. పాతికేళ్ల యువకుడు మద్యానికి బానిసై.. రోడ్డు ప్రమాదంలో గాయపడి.. చనిపోవడం వారికి ఆందోళన కలిగించింది. కుమారుడిని కోల్పోయిన ఆ తల్లి బాధ వారిని కదిలించింది. కన్నీరు పెట్టేలా చేసింది. దీంతో మహిళలు చర్చించుకుని.. మందు మహమ్మారిని ఊరి నుంచి దూరం చేయాలని భావించారు. అందుకే గ్రామంలో ప్రదర్శన చేశారు. పాటలు పాడుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు. అంతేకాదు తాము రూపొందించుకున్న నిబంధనలను వెల్లడించారు. దీంతో ఆ గ్రామంలో బెల్టు షాపులు నిర్వహించేవారు అప్రమత్తమయ్యారు. మందు విక్రయించేవారు ఇకపై ఆ పని చేయకూడదని నిర్ణయించుకున్నారు.
ప్రభుత్వాలకు చెప్పుతో కొట్టినట్టు
తెలుగు రాష్ట్రాలే కాదు, దేశంలో కొన్ని మినహా అన్ని రాష్ట్రాలు మద్యం మీదే ఆధారపడుతున్నాయి. మద్యం విక్రయాలను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నాయి. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయడానికి మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఖర్చు పెడుతున్నాయి. విచ్చలవిడిగా వైన్ షాపులు ఏర్పాటు చేస్తున్నాయి. బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నాయి. అంతకంతకు మద్యంపై ధరలు పెంచుతున్నాయి. మందుబాబుల రక్త మాంసాల మీద వ్యాపారం చేస్తున్నాయి. ప్రభుత్వాలు ధరలు పెంచినప్పటికీ మందుబాబులు ఏమాత్రం నిరసన వ్యక్తం చేయకుండా.. తమ ఆరోగ్యాలను పణంగా పెడుతూ ప్రభుత్వానికి ఆదాయాన్ని అందిస్తున్నారు. చివరికి తమను నమ్ముకున్న కుటుంబాలను ఆగం చేస్తున్నారు. అయితే ఏపూరు మహిళల చైతన్యం దేశవ్యాప్తంగా వస్తే.. మద్యం అనే మాట ఉండదని.. తాగుడు అనే పదం వినిపించదని సామాజికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.