https://oktelugu.com/

MLC Kavitha: కవిత జైల్లోనే ఉండాలనుకుంటున్నారా.. డిఫాల్ట్‌ బెయిల్‌ ఉప సంహరణ ఆంతర్యం ఏమిటి..?

కవిత.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ.. గతేడాది నవంబర్‌ వరకు తెలంగాణలో కీలక నేత. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూతురు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో చిక్కుకున్న కవిత.. ప్రస్తుతం తిహార్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 8, 2024 / 03:51 PM IST

    MLC Kavitha

    Follow us on

    MLC Kavitha: తెలంగాణ మాజీ ముఖ్యమత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మార్చి 15న అరెస్టు అయిన ఆమె ప్రస్తుతం తిహార్‌ జైల్లో ఉన్నారు. అరెస్టు అయిన నాటి నుంచి ఆమె బెయిల్‌ కోసం అనేక ప్రయత్నాలు చేశారు. ప్రత్యేక కోర్టు బెయిల్‌ నిరాకరించడంతో ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బెయిల్‌ రాకపోవడంతో సుప్రీం కోర్టులు ఆశ్రయించాలని కవిత సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్, మరో మాజీ మంత్రి హరీశ్‌రావు ఢిల్లీలో న్యాయ నిపుణులతో మంతనాలు జరిపారు. కానీ, ఇంకా పిటిషన్‌ వేయలేదు. ఈ క్రమంలో రౌస్‌ అవెన్యూ కోర్టులో డీఫాల్ట్‌ పిటిషన్‌ రెండు రోజుల క్రితం విచారణకు వచ్చింది. ఆరోజు కవిత తరఫు న్యాయవాదులు అందుబాటులో లేకపోవడంతో బుధవారానికి కోర్టు వాయిదా వేసింది. ఇంతలో ఏమైందో ఏమో.. పిటిషన్‌ విచారణకు ముందే.. కవిత తరఫు లాయర్లు డిఫాల్ట్‌ పిటిషన్‌ ఉపసంహరించుకున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కోర్టును ఆశ్రయిస్తా మని న్యాయవాదులు తెలిపారు. దీనిపై ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎలాగో బెయిల్‌ రాదని ఉపసంహరించుకున్నారా.. లేక కావాలనే కొన్ని రోజులు జైల్లో ఉండేందుకు ఉప సంహరించుకున్నారా అన్న చర్చ జరుగుతోంది.

    జూలై 6న డీఫాల్ట్‌ పిటిషన్‌..
    ఇదిలా ఉంటే.. సీబీఐ ఛార్జిషీట్‌లో తప్పులున్నాయని పేర్కొంటూ, జులై 6న కవిత డీఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, ఎలాంటి తప్పులు లేవని సీబీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు జులై 22న ప్రత్యేక కోర్టు ప్రకటించింది. ఈనెల 9న దీనిపై విచారణ జరపనుంది. అయతే ఈ పిటిషన్‌ను ఉపసహరించుకోవడంతో ఇక విచారణ క్లోజ్‌ చేసే అవకాశాలున్నాయి..

    మార్చి 15న అరెస్ట్‌..
    ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్‌ కేసులో కవితను ఈడీ మార్చి 15న అరెస్టు చేసింది. ముందుగా తనిఖీలు చేసిన ఈడీ తర్వాత సాయంత్రం 5:30 గంటలకు అరెస్టు చేసినట్లు ప్రకటించింది. అదేరోజు సాయంత్రం విమానంలో ఢిల్లీ తీసుకెళ్లింది. మరుసటి రోజు కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించింది. ఇక విచారణ కొనసాగుతున్న సమయంలో సీబీఐ కూడా రంగంలోకి దిగింది ఏప్రిల్‌ 11న కవితను జైల్లోనే సీబీఐ కూడా అరెస్ట్‌ చేసింది. కస్టడీలోకి తీసుకుని విచారణ చేసింది.

    చార్జిషీట్లు దాఖలు..
    విచారణ పూర్తి కావడంతో సీబీఐ, ఈడీ రెండూ చార్జిషీట్లను ప్రత్యేక కోర్టులో దాఖలు చేశాయి. అయినా బెయిల్‌ మాత్రం రావడం లేదు. బెయిల్‌ ఇవ్వొద్దని దర్యాప్తు సంస్థలు కోర్టును కోరుతన్నాయి. కవిత సామాన్యమైన వ్యక్తి కాదని, బలమైన రాజకీయ నేపథ్య ఉందని, ఆమె బయటకు వస్తే సాక్షాలను తారుమారు చేస్తారని తెలుపుతున్నాయి. గతంలో డిజిటల్‌ ఎవిడెన్స్‌ అయిన ఫోన్లను ధ్వంసం చేశారని కోర్టు దృష్టికి తెస్తున్నాయి. దీంతో కోర్టులు కూడా దర్యాప్తు సంస్థల వాదనతో బెయిల్‌ నిరాకరిస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె తాజాగా డీఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం ఇపుపడు చర్చనీయాంశమైంది.