YSRTP: తెలంగాణలో వైఎస్సార్ పాలన తీసుకువస్తానని దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి తనయ వైఎస్.షర్మిల పార్టీ స్థాపించారు. రెండేళ్లయినా ఆశించిన మేరకు ప్రజాదరణ రావడం లేదు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం సుమారు 3,800 కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేశారు. అధికార పార్టీ టార్గెట్‌గా విమర్శలు చేశారు. జాతీయ పార్టీల అయిన బీజేపీ, కాంగ్రెస్ చేయలేని విధంగా కేసీఆర్‌తోపాటు, ఎమ్మెల్యేలు, మంత్రులపై విమర్శలుచేశారు. కానీ పార్టీ పుంజుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
ఆంధ్రా నేతలగానే చూస్తున్నారు..
షర్మిలను తెలంగాణ సమాజం ఇప్పటికీ ఆంధ్రా నేతగానే చూస్తోంది. తాను తెలంగాణ కోడల్ని అని చెబుతున్నా.. ప్రజలు అంగీకరించడం లేదు. మరోవైపు వైఎస్.జగన్ పదవి ఇవ్వకపోవడంతోనే ఆమె పార్టీ పెట్టారన్న అభిప్రాయం ఉంది. దీంతో వైఎస్సార్‌టీపీని పెద్దగా పట్టించుకోవడం లేదు. రాజన్న బిడ్డ వచ్చిందని వైఎస్సార్‌పై ఉన్న అభిమానంతో ఆమెను చూస్తున్నారు. రాజకీయ నాయకురాలిగా చూడడం లేదు.
విలీన ప్రచారం..
ఈ పరిస్థితిలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని షర్మిల కాంగ్రెస్‌లో విలీనం చేస్తారన్న ప్రచారం మొదలు పెట్టారు. సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారం జరుగుతోంది. దీనిని షర్మిల ఖండించారు. రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలుచేశారు. మరోవైపు షర్మిల విపక్షాలను ఏకం చేసే ప్రయత్నం చేశారు. అది కూడా ఫలించలేదు. బలమైన కాంగ్రెస్, బీజేపీ ఆమెతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. ఈ నేపథ్యంలో పార్టీ విలీనంపైనే షర్మిల దష్టిపెట్టారని ప్రచారం జరుగుతోంది.
మూడు సీట్లపై ఆశ..
తెలంగాణలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మూడుచోట్ల వైఎస్సార్ టీపీ గెలుస్తుందని ఆ పార్టీ నాయకులు నమ్ముతున్నారు. ఒకటి షర్మిల, రెండోది ఏపూరి సోమన్న. మూడోది గట్టు రామచంద్రారెడ్డి కచ్చితంగా గెలుస్తారన్న నమ్మకం పార్టీలో ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే షర్మిల గెలిచినా చాలు అన్నట్లు ఉంది. షర్మిల గెలవక పోతే మాత్రం ఎన్నికల తర్వాత పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకం కావడం ఖాయం. మరోవైపు షర్మిల ఆంధ్రాకు వెళ్లిపోయే అవకాశం కూడా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కుటుంబంలో జరిగిన ఒప్పందం మేరకే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారని మొదటి నుంచి ఉన్న అభిప్రాయం. అన్నకు పోటీ ఇవ్వకూడాదన్న అగ్రిమెంట్ మేరకే షర్మిల తెలంగాణకు వచ్చారు. ఇక్కడ పార్టీ గెలవకపోతే.. తిరిగి వెళ్లిపోవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.