Revanth Reddy Vs Malla Reddy: రాజకీయమంటే అవసరాలు మాత్రమే ఉంటాయి. కానీ అప్పుడప్పుడు పగలు ప్రతీకారాలుంటాయి. వెనుకటికి ఈ సంస్కృతి తమిళనాడు రాష్ట్రంలో కనిపించేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇది ఇక్కడ కూడా వ్యాప్తిలోకి వచ్చింది.. రాజకీయంగా తమకంటే బలంగా ఉన్నవారిని తొక్కడం గత పది సంవత్సరాల నుంచి తెలంగాణలో ప్రారంభమైంది. అంతకు ముందు ఈ వ్యవహారం లేదా? అంటే.. ఉంది కానీ… జైళ్ళకు పంపించడం.. అర్ధరాత్రి బెడ్ రూమ్ తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేయించడం.. వంటి పరిణామాలు అప్పట్లో జరగలేదు. సరే 10 సంవత్సరాల పాటు అలాంటి వ్యవహారాలు దర్జాగా సాగిపోయాయి. ఇప్పుడు అధికారం మారింది. ఒకప్పుడు ఇబ్బంది పెట్టినవారు.. అధికారాన్ని కోల్పోయారు. ఒకప్పుడు ఇబ్బంది పడ్డవారు అధికారంలోకి వచ్చారు. మరి ఇబ్బంది పడ్డవారు ఇబ్బంది పెట్టిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ చర్చ జరుగుతుండగానే కార్మిక శాఖ మాజీ మంత్రి మల్లారెడ్డి ఒక సంచలన ప్రకటన చేశారు. త్వరలో తాను రేవంత్ రెడ్డిని కలుస్తానని ప్రకటించారు.
వాస్తవానికి మల్లారెడ్డికి, రేవంత్ రెడ్డికి ఎప్పటినుంచో వివాదం ఉంది. వారిద్దరూ టిడిపిలో ఉన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి పొసగకపోయేది. అప్పట్లో మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానంలో పోటీ చేయాలని రేవంత్ రెడ్డి భావించారు. కానీ ఆ స్థానం చంద్రబాబు నాయుడు మల్లారెడ్డి కి కేటాయించారు. ఎందుకంటే మల్లారెడ్డికి అక్కడ విద్యాసంస్థలు ఉండటం.. ఆర్థికంగా మల్లారెడ్డి బలంగా ఉండడంతో ఆయన వైపు మొగ్గు చూపించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మల్లారెడ్డి విజయం సాధించారు. కాలక్రమేణ మల్లారెడ్డి టిడిపి నుంచి భారత రాష్ట్ర సమితిలోకి వెళ్లిపోయారు. రేవంత్ రెడ్డి టిడిపి నుంచి కాంగ్రెస్ లో చేరారు. అదే మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానంలో రేవంత్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. అటు మల్లారెడ్డి ఇటు రేవంత్ రెడ్డి రాజకీయంగా వేరువేరు పార్టీలలో చేరి ప్రయాణం సాగిస్తున్నప్పటికీ ఇద్దరి మధ్య వివాదాలు తగ్గలేదు.. మల్లారెడ్డి భూ వ్యవహారాలను రేవంత్ రెడ్డి వెలుగులోకి తీసుకొస్తే.. రేవంత్ రెడ్డి పై తొడగొట్టి మల్లారెడ్డి బహిరంగంగా సవాల్ విసిరారు. అయితే అప్పట్లో మల్లారెడ్డి రేవంత్ రెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఆ తర్వాత ఆ కేసు ఏమైందో తెలియదు కానీ.. ఈ లోగానే మల్లారెడ్డి మంత్రిగా ఉన్న భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం.. అధికారాన్ని కోల్పోయింది.
అధికారాన్ని కోల్పోయిన తర్వాత సహజంగానే ఆ పార్టీలో ఉన్న నాయకులు ఒకింత అణుకువతో ఉంటారు. మల్లారెడ్డి అటువంటి ధోరణి ప్రదర్శిస్తున్నప్పటికీ.. ఆయన తో ఉన్న భూ వివాదాల నేపథ్యంలో కొంతమంది తెరపైకి వస్తున్నారు. ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఎలాగూ మల్లారెడ్డి తో గతంలో రేవంత్ రెడ్డికి వివాదాలున్న నేపథ్యంలో.. మల్లారెడ్డి భూ బాధితులు తమకు ముఖ్యమంత్రి న్యాయం చేస్తారని నమ్ముతున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ రేవంత్ రెడ్డి మల్లారెడ్డి వివాదాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. పలువురు బాధితులు ఆయనను ఆశ్రయిస్తున్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మల్లారెడ్డి పై చర్యలు తీసుకుంటారా.. లేకుంటే ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయం.. మిగతా సమయంలో మిత్రుత్వం.. అనే ధోరణి ప్రదర్శిస్తారా.. ఏమో దీనికి కాలమే సమాధానం చెప్పాలి.