HomeతెలంగాణRevanth Reddy Vs KCR: కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ చేస్తారా?

Revanth Reddy Vs KCR: కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ చేస్తారా?

Revanth Reddy Vs KCR: ‘రాజకీయ ప్రతీకార చర్యలు నాకు తెలియదు. నన్ను అరెస్టు చేయించాడని.. నేను కేసీఆర్‌ను అరెస్టు చేయాలనుకోవడం లేదు. కేసీఆర్‌ ఇప్పటికే ఫాంహౌస్‌లో అరెస్ట్‌ అయ్యాడు. ఇంకా ఆయనను కొత్తగా అరెస్ట్‌ చేసుడెందుకు’ ఇదీ కాళేశ్వరం అక్రమాలపై పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఇచ్చాన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు. కానీ రేవంత్‌రెడ్డి మాటలపై బీఆర్‌ఎస్‌ నాయకులకు నమ్మకం కలగడం లేదు. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు వివాదం కేంద్ర బిందువుగా మారింది. ఈ ప్రాజెక్టులో ఆరోపణలు, జస్టిస్‌ పీసీ.ఘోష్‌ కమిషన్‌ రిపోర్టు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు (కేసీఆర్‌) అరెస్టు అవకాశాలపై జరుగుతున్న చర్చలు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని ఉద్విగ్నంగా మార్చాయి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన ప్రభుత్వం రాజకీయ కక్షలకు పోవడం లేదని, చట్టపరమైన చర్యలు మాత్రమే తీసుకుంటామని చెబుతున్నప్పటికీ, బీఆర్‌ఎస్‌ నేతలు వ్యక్తిగత ప్రతీకారం ఉంటుందని భావిస్తున్నారు.

Also Read: కాలేశ్వరం కేసు.. కేసీఆర్, హరీష్ రావు కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్టు!

కాళేశ్వరం రిపోర్టులో ఏముంది?
కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరచడానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన భారీ ప్రాజెక్టు. అయితే, ఈ ప్రాజెక్టు ప్లానింగ్, నిర్మాణం, నిర్వహణలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని జస్టిస్‌ పీసీ.ఘోష్‌ కమిషన్‌ రిపోర్టు స్పష్టం చేసింది. ఈ రిపోర్టు కేసీఆర్‌తోపాటు మాజీ ఇరిగేషన్‌ మంత్రి టి. హరీశ్‌రావును కూడా లోపాలకు బాధ్యులుగా పేర్కొంది. ప్రాజెక్టు ఖర్చు ప్రారంభంలో రూ. 38,500 కోట్లుగా అంచనా వేయగా, 2022 నాటికి రూ. 1.10 లక్షల కోట్లకు పెరిగిందని, ఈ పెరిగిన ఖర్చులో అవినీతి, నిధుల దుర్వినియోగం జరిగాయని రిపోర్టు ఆరోపించింది. ఈ రిపోర్టు ఆధారంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి, తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. అయితే, కేసీఆర్, హరీశ్‌రావు ఈ రిపోర్టును రాజకీయ కక్షలతో కూడినదిగా అభివర్ణిస్తూ, దాని అమలును నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు ఈ పిటిషన్‌పై తాత్కాలిక స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో, కేసీఆర్‌ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

రాజకీయ ఎత్తుగడలా?
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పదేపదే తాను రాజకీయ ప్రతీకారాలకు దూరంగా ఉన్నానని, కేసీఆర్‌ను అరెస్టు చేయడం తన లక్ష్యం కాదని చెబుతున్నారు. ‘కేసీఆర్‌ ఇప్పటికే తన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో స్వీయ నిర్బంధంలో ఉన్నారు, ఇది జైలుకు భిన్నం కాదు‘ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తనను తాను నిష్పాక్షికంగా చూపించుకోవడానికి రేవంత్‌ చేస్తున్న ప్రయత్నంగా కొందరు భావిస్తున్నారు. అయితే, బీఆర్‌ఎస్‌ నేతలు రేవంత్‌ వ్యాఖ్యలను నమ్మడం లేదు. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వంలో రేవంత్‌ రెడ్డి ఓటుకు నోటు కేసులో అరెస్టై, జైలు శిక్ష అనుభవించారు. ఈ నేపథ్యంలో, కేసీఆర్‌పై వ్యక్తిగత కక్ష కారణంగా రేవంత్‌ రెడ్డి కాళేశ్వరం రిపోర్టును ఆయుధంగా ఉపయోగిస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు అనుమానిస్తున్నారు. రేవంత్‌ రెడ్డి తన ప్రభుత్వం చట్టపరమైన చర్యలు మాత్రమే తీసుకుంటుందని చెప్పినప్పటికీ, అరెస్టు జరిగితే అది ‘చట్టం తన పని తాను చేస్తుంది‘ అనే సాకుతో సమర్థించుకోవచ్చని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

అందుకే న్యాయపరమైన పోరాటం..
బీఆర్‌ఎస్‌ నేతలు కాళేశ్వరం రిపోర్టును రాజకీయ కక్షలతో కూడినదిగా భావిస్తున్నారు. ఈ రిపోర్టును అసెంబ్లీలో చర్చించడం ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా బలహీనపరచాలని చూస్తోందని వారి ఆరోపణ. కేసీఆర్, హరీశ్‌రావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం, సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలను పరిశీలిస్తుండటం అరెస్ట్‌ భయంతోనే అని సమాచారం. అదనంగా, కేసీఆర్‌ అరెస్టు జరిగితే తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని సీనియర్‌ బీఆర్‌ఎస్‌ నేత జీవన్‌రెడ్డి హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ను రాజకీయంగా ఉత్తేజపరచడానికి, సానుభూతి సేకరించడానికి కేసీఆర్‌ అరెస్టు ఒక అవకాశంగా మారవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Read: రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలతో కోమటిరెడ్డి సీక్రెట్ మీటింగ్?

కాళేశ్వరం రిపోర్టు, కేసీఆర్‌ అరెస్టు అవకాశాల చుట్టూ జరుగుతున్న చర్చ రాజకీయ, చట్టపరమైన కోణాల మధ్య సమతుల్యతను ప్రతిబింబిస్తోంది. రేవంత్‌రెడ్డి తన ప్రభుత్వం నీతిని, పారదర్శకతను కాపాడుతుందని చెబుతున్నప్పటికీ, బీఆర్‌ఎస్‌ దీనిని రాజకీయ కక్షలుగా చూస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version