BRS: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా పురుడు పోసుకున్న పార్టీ భారత రాష్ట్ర సమితి అలియాస్ తెలంగాణ రాష్ట్ర సమితి. అనేక పోరాటాలు, లాబీయింగ్‌ల తర్వాత లక్ష్యాన్ని చేరుకుంది. స్వరాష్ట్రం సాధించింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టింది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపింది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంలో నీటి సమస్య పరిష్కరించింది. నిధులు నీళ్లలా ఖర్చు చేసి ధనిక రాష్ట్రం తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చింది. నియామకాలను విస్మరించింది. దీంతో పదేళ్ల తర్వాత 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించారు ప్రజలు. కానీ, అప్పటికే అనేక ఆరోపణలు ఎర్కొన్న ఆ పార్టీకి అధికారం కోల్పోయాక ఇబ్బందులు మొదలయ్యాయి. కాళేశ్వరంలో కీలకమైన మేడిగడ్డ కుంగింది. సుందిళ్లకు బుంగ పడింది, ఫోన్ ట్యాపింగ్ కేసు మెడకు చుట్టుకుంది. అనేక విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా బీఆర్‌ఎస్‌కు విలీనం అంశం పెద్ద తలనొప్పిగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్‌ను విలీనం అంశం ఆధారంగా ఆటాడుకుంటోంది. త్వరలోనే బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం అవుతుందని, కేసీఆర్ గవర్నర్ అవుతాడని, కేటీఆర్ కేంద్ర మంత్రి అవుతాడని, కవిత రాజ్యసభ ఎంపీ అవుతుందని ఆరోపిస్తున్నారు.
తిప్పి కొడుతున్నా ఆగని ప్రచారం..
బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి దాదాపు ఐదు నెలలుగా తిహార్ జైల్లో ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తరచూ ఢిల్లీ వెళ్లున్నారు. న్యాయవాదులతో, న్యాయ నిపుణులతో సమావేశం జరుపుతున్నారు. ఇదే అదనుగా కాంగ్రెస్ నాయకులు విలీనం అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చెల్లిని విడిపించుకోవడానికి పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి యత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే తాము బీజేపీలో విలీనం కోసం ఢిల్లీ వెళ్లడం లేదని, 23 ఏళ్లుగా పార్టీని బలంగా తీర్చిదిద్దామని, విలీనం ముచ్చటే లేదని కేటీఆర్, హరీశ్‌రావు ఖండిస్తున్నారు. అయినా ప్రచారం మాత్రం ఆగడం లేదు.
కాంగ్రెస్ ఎత్తుగడ ఇదీ..
భారతీయ జనతా పార్టీ బీఆర్‌ఎస్ నిస్సహాయతను ఆసరాగా చేసుకుని ఆ పార్టీ తరపున ఎవరికీ రాజకీయ భవిష్యత్ లేకుండా చేసి.. చివరికి ఆ పార్టీని విలీనం చేయాలనుకునే ప్లాన్ వేస్తోందని కాంగ్రెస్ అంటోంది. అందులో భాగంగానే జరుగుతున్న ప్రతీ విషయంపై లీకుల్ని ఇస్తోందని ఆరోపిస్తోంది. కానీ దాన్ని ఖండించే పరిస్థితి బీఆర్‌ఎస్‌కు లేకుండా పోతోంది. ఖండించలేని దుర్భరమైన స్థితిలో బీఆర్‌ఎస్ బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనంపై రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య చర్చల ప్రతిపాదనల్లో ఉన్న అంశాలను బయట పెట్టారు. ఇవి ఊహాగానాలు కాదని మీడియా ప్రతినిధులందరికీ తెలుసు. ఢిల్లీలో బీజేపీ, బీఆర్‌ఎస్ సుదీర్ఘ చర్చలు జరిగాయి. అందులో ఓ ఫార్ములా కూడా రెడీ అయిందని రేవంత్ బయట పెట్టారు. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత .. రేవంత్ అలా మాట్లాడారని మీడియా రిపోర్టు చేశాక కేటీఆర్ అత్యంత బలహీనమైన స్పందన వ్యక్తం చేశారు. రేవంత అమెరికా అధ్యక్షుడు అవుతాడని అంటే నమ్మేస్తారా అని పేలవరమైన సెటైర్ వేశారు. అక్కడే ఆయన ఎంత బలహీన స్థితిలో ఉన్నారో క్లారిటీ వస్తుంది. ఇక విలీనంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. పసలేని వాదన చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డిని తప్పు పట్టారు. బీఆర్‌ఎస్ పార్టీకి అంత సీన్ లేదని చెప్పేలా కామెంట్స్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైతే అంత ప్రాధాన్యం ఇస్తారా అన్నట్లుగా కౌంటర్ విమర్శలు చేశారు. చివరికి కేసీఆర్, కేటీఆర్‌కు సైతం ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోయినా విలీనం చేయకతప్పని పరిస్థితిని వ్యూహాత్మకంగా కల్పిస్తున్నరన్న అభిప్రాయం వినిపిస్తోంది.