Congress BC Reservations: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కుల గణన చేపట్టింది. ఎస్సీ వర్గీకరణ చేసింది. ఇక రాజకీయాల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. దీనిపై ఇప్పటికే అసెంబ్లీలో బిల్లు పెట్టి గవర్నర్‌కు కూడా పంపింది రేవంత్ సర్కార్. అయితే గవర్నర్ దానిని రాష్ట్రపతికి పంపించారు. బిల్లు ఆమోద పొందే అవకాశం లేకపోవడంతో దాని ఆధారంగా కేంద్రాన్ని బద్నాం చేసే వ్యూహం రచిస్తోంది. హామీల అమలులో విఫలమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లే తమకు శ్రీరామ రక్ష అని భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓట్లు కురిపిస్తుందని భావిస్తోంది.
Also Read: పెళ్లై, కూతురున్నా ప్రియుడితో వెళ్లింది.. చివరకు ఇలా అయ్యింది
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 2023 ఎన్నికల ముందు ’కామారెడ్డి డిక్లరేషన్’లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని హామీ ఇచ్చింది. ఈ హామీని నెరవేర్చేందుకు, 2024 నవంబర్–డిసెంబర్ మధ్య నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వే ఫలితాలు బీసీలు రాష్ట్ర జనాభాలో 56.33% ఉన్నారని వెల్లడించాయి. ఈ డేటా ఆధారంగా, 2025 మార్చిలో రాష్ట్ర శాసనసభ రెండు కీలక బిల్లులను ఆమోదించింది: ఒకటి విద్య, ఉపాధిలో 42% బీసీ రిజర్వేషన్ కోసం, మరొకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% కోటా కోసం. అయితే, ఈ బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి. గవర్నర్ ఆర్డినెన్స్‌కు సానుకూలంగా స్పందించలేదు.
50 శాతం పరిమితితో చిక్కులు..
సుప్రీంకోర్టు 1992లో ఇంద్రా సాహ్నీ కేసులో నిర్దేశించిన 50% రిజర్వేషన్ పరిమితి తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ప్రధాన అడ్డంకిగా ఉంది. బీసీలకు 42%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% కోటాతో మొత్తం రిజర్వేషన్ 67%కి చేరుతుంది, ఇది సుప్రీంకోర్టు పరిమితిని మీరుతుంది. బీహార్‌లో 2023లో 65% రిజర్వేషన్ ప్రతిపాదనను పాట్నా హైకోర్టు రద్దు చేసింది, ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం తమ బిల్లులను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని కోరుతోంది. ఇది న్యాయ సమీక్ష నుంచి కొంత రక్షణ కల్పిస్తుందని భావిస్తోంది. అయితే, 2006లో ఐఆర్ కొయ్‌ల్హో కేసులో సుప్రీంకోర్టు తొమ్మిదో షెడ్యూల్‌లోని చట్టాలు కూడా ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తే సమీక్షించబడతాయని స్పష్టం చేసింది.
న్యాయపరమైన సంప్రదింపులు..
ఆటంకాలు ఉంటాయని తెలిసినా బీసీ రిజర్వేషన్‌పై ముందుకే వెళ్లాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. రిజర్వేషన్ అమలులో న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో సంప్రదింపులు జరిపారు, రాష్ట్రపతి ఆమోదం లేకుండా లేదా ఆర్డినెన్స్ లేకుండా రిజర్వేషన్‌ను అమలు చేయడం సాధ్యమేనా అని చర్చించారు. సింఘ్వీ సానుకూల సలహాలు ఇచ్చినట్లు భట్టి తెలిపారు, బీసీలను వ్యతిరేకించే వారు మాత్రమే కోర్టులకు వెళతారని, అటువంటి సవాళ్లను రాజకీయంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. అదనంగా, న్యాయ నిపుణులైన జస్టిస్ సుదర్శన్‌రెడ్డితో సహా నలుగురు మంత్రుల కమిటీ ఈ అంశంపై నివేదిక సమర్పించేందుకు సిద్ధంగా ఉంది.
స్థానిక ఎన్నికల కోసమే..
తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 30 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో, ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్‌ను అమలు చేయడానికి తీవ్రంగా కసర్తు చేస్తోంది. ఈ కోటాను పంచాయతీలు, మున్సిపాలిటీలలో అమలు చేయాలని నిర్ణయించారు. భట్టి విక్రమార్క ఆగస్టు 30న మరోసారి సమావేశమై ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం ద్వారా బీసీ, ఎస్సీలతో కూడిన 70% ఓటర్ల సమీకరణను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్‌ను అమలు చేయాలన్న సంకల్పంతో ఉంది. ఇది సామాజిక న్యాయానికి చిహ్నంగా భావిస్తోంది. అయితే ఇవి ఎంతవరకు కాంగ్రెస్‌కు ఓట్లు కురిపిస్తాయన్నది మాత్రం ప్రశ్నార్థకమే!