Kavitha Social Media Strategy: రాజకీయాలు ఒకే విధంగా ఉండవు. ఒకే విధంగా ఉంటే వాటిని రాజకీయాలు వారు. సరిగ్గా ఇదే సమయానికి ఏడాది క్రితం కల్వకుంట్ల కవిత, కల్వకుంట్ల తారకరామారావు ఒక మాటగా, ఒక గొంతుకగా ఉండేవారు. కల్వకుంట్ల కవితను ఢిల్లీలో జైల్లో నుంచి బయటకు తీసుకురావడానికి కల్వకుంట్ల తారకరామారావు విశ్వ ప్రయత్నాలు చేశారు. రోజుల తరబడి హస్తినలో తిష్ట వేశారు. చివరికి కల్వకుంట్ల కవితను బయటికి తీసుకొచ్చారు. జైలు నుంచి బయటికి రాగానే కవిత తన సోదరుడికి రాఖీ కట్టారు. తమ ఇద్దరి మధ్య అనుబంధాన్ని చాటుకున్నారు. ఏమైందో తెలియదు.. ఏం జరిగిందో తెలియదు.. ఇద్దరి మధ్య విభేదాలు పెరిగిపోయాయి. అవి ఊహించని స్థాయికి చేరుకున్నాయి. వాస్తవానికి ఇటువంటి మనస్పర్ధలు గతంలో ఎన్నడు కూడా వారిద్దరి మధ్య రాలేదు. వచ్చే అవకాశాన్ని కూడా వారి తండ్రి కల్పించలేదు. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య ఆగాధం మరింత పెరిగిపోయింది. అది పూడ్చలేని స్థాయికి చేరుకుంది.
Also Read: కేటీఆర్ స్కెచ్.. కవిత నుంచి చేజారిన సింగరేణి.. జాగృతి అధినేత్రి ఏం చేస్తారు?
కల్వకుంట్ల కవితకు ఒకప్పుడు గులాబీ పార్టీ అనుకూల మీడియా విపరీతమైన ప్రాధాన్యమిచ్చేది. బీభత్సమైన స్పేస్ కల్పించేది. అప్పట్లో కేంద్ర దర్యాప్తు బృందం కవితను అరెస్ట్ చేసినప్పుడు గులాబీ మీడియా పతాక స్థాయి శీర్షికలతో వార్తలను ప్రచురించింది.. ప్రసారం కూడా చేసింది. అక్కడి దాకా ఎందుకు జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా కవితకు గులాబీ మీడియా విపరీతమైన స్పేస్ ఇచ్చింది. ఎప్పుడైతే తన రాజకీయ అడుగులకు కవిత అడ్డు తగులుతున్నారు అనుకున్నారో.. అప్పటినుంచి ఆమె పాత్ర నామ మాత్రమైపోయింది. ఆమెతో తండ్రి కూడా మాట్లాడటం లేదని తెలుస్తోంది. మరోవైపు గులాబీ మీడియా కూడా కవిత వార్తలకు ప్రయారిటీ ఇవ్వడం లేదు. ఇటీవల కవిత మీద ఓ నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై గులాబీ పార్టీ నాయకులు స్పందించలేదు. చివరికి జాగృతి కార్యకర్తలే రంగంలోకి దిగి బీభత్సం సృష్టించారు. ఇంత జరిగినప్పటికీ గులాబీ మీడియా సింగిల్ కాలం వార్తను కూడా ఆమె కోణంలో ప్రచురించలేదు. ప్రసారం చేయలేదు.
Also Read: అమెరికా నుంచి కల్వకుంట్ల కవిత సంచలన లేఖ!
కవిత ప్రస్తుతం రాజకీయంగా ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆమె కంటూ సొంత మీడియా ఉండాలని.. ఆమె వాదనను, ఆమె వార్తలను సమాజానికి చేరవేయాలంటే ఒక వ్యవస్థ ఉండాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..” గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బలమైన సోషల్ మీడియాను ఏర్పాటు చేసుకున్నారు. మీడియా పరంగా కూడా ఆయనకు సపోర్ట్ ఉంది. ఆయన రాజకీయంగా ఎదగడానికి ఎంతో కొంత స్కోప్ ఉంది. అలాంటప్పుడు కవిత కూడా అటువంటి సోషల్ మీడియాను, మీడియాను ఏర్పరచుకోవాలి. అప్పుడే ఆమె కంటూ ప్రజల్లో మరింత గుర్తింపు లభిస్తుంది. ఇలానే ఆమె గనుక తన శైలి కొనసాగిస్తే ఇబ్బంది పడకతప్పదు. ఎందుకంటే సొంత మీడియా ఉంటేనే రాజకీయాలలో రాణించగలుగుతారు. లేకుంటే ఇబ్బంది పడక తప్పదని” రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత తనకంటూ సొంత మీడియాను ఏర్పాటు చేసుకునే దిశగా కవిత అడుగులు వేయాలని వారు గుర్తు చేస్తున్నారు.