KTR Kavitha Explosive Letter: భారత రాష్ట్ర సమితి లో ముఖ్యంగా కల్వకుంట్ల తారక రామారావు ఆమె సోదరీ కల్వకుంట్ల కవిత మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇటీవల కాలంలో పరోక్షంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న క్రమంలో.. ఆ పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయ్. తాజాగా నల్లగనుల్లో భారత రాష్ట్ర సమితికి సంబంధించిన కార్మిక విభాగానికి గౌరవ అధ్యక్ష స్థానంలో జాగృతి అధినేత్రిని తొలగించి.. కొప్పుల ఈశ్వర్ ను నియమించిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు ఈ నిర్ణయం తీసుకున్నారు. అధినేత ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు. కొప్పుల ఈశ్వర్ నియామకాన్ని కల్వకుంట్ల కవిత స్వాగతించారు. కల్వకుంట్ల కవిత అమెరికా వెళ్లిన రెండు రోజుల తర్వాత కొప్పుల ఈశ్వర్ కు అధికారికంగా గౌరవ అధ్యక్ష బాధ్యతను కల్వకుంట్ల తారక రామారావు అప్పగించారు.
Also Read: కేటీఆర్ స్కెచ్.. కవిత నుంచి చేజారిన సింగరేణి.. జాగృతి అధినేత్రి ఏం చేస్తారు?
కల్వకుంట్ల తారక రామారావు బుధవారం కొప్పుల ఈశ్వర్ కు ఈ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో కల్వకుంట్ల కవిత స్పందించారు. ఆమె ప్రస్తుతం తన కుమారుడి ఉన్నత విద్య కోసం అమెరికాలో ఉన్నారు. అమెరికా నుంచి ఆమె ఒక సంచలన లేఖను విడుదల చేశారు. ఈ లేఖ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో భారీ కుదుపులకు కారణం అవుతున్నది. ఈ లేఖలో ఆమె భారత రాష్ట్ర సమితి నాయకత్వాన్ని ప్రశ్నించారు. అంతేకాదు గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు అందులో ఆమె ఉటంకించారు. దీంతో అన్నాచెల్లి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయని అర్థమవుతోంది.
“రాజకీయ కారణాలతోనే నన్ను కార్మిక సంఘ గౌరవ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కార్మికుల తరఫున పోరాడుతున్నాను. కానీ కొందరు నాపై కుట్రలు చేస్తున్నారు. గతంలో నేను విదేశీ పర్యటనలో ఉన్నప్పుడే గులాబీ పార్టీ అధినేతకు రాసిన లేఖను బయటకు విడుదల చేశారు. ఇప్పుడు కార్మికుల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతుంటే తట్టుకోలేకపోతున్నారు. సొంత పార్టీ నేతలు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. కార్మిక చట్టాలను పక్కనపెట్టి.. ఆ చట్టాలకు వ్యతిరేకంగా కొత్తగా గౌరవ అధ్యక్షుడుని ఎన్నుకున్నారు. ఆ కుట్ర దారులు నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. మానసికంగా వేధిస్తున్నారు. రాజకీయ ఎదుగుదల లేకుండా చేస్తున్నారని” కవిత కార్మికులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
Also Read: ఫామ్ హౌస్ కు కవిత వచ్చినవేళ హరీష్ రావు, కేటీఆర్ ప్రత్యక్షం.. ఏం జరిగిందంటే?
కొప్పుల ఈశ్వర్ నియామకాన్ని భారత రాష్ట్ర సమితి అధినేత నిర్ణయం ప్రకారమే తీసుకున్నామని ఇటీవల తారకరామారావు వెల్లడించారు. వాస్తవానికి ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పటికిప్పుడు కొప్పుల ఈశ్వర్ ను ఎందుకు నియమించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ” జాగృతి అధినేత్రి అంటే గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడికి పడడం లేదు. ఆమె పొలిటికల్ అడుగులను ఆయన అడుగడుగునా అడ్డుకుంటున్నారు. అందువల్లే జాగృతి అధినేత్రి ఫైర్ అవుతున్నారు. తన మనసులో ఉన్న ఆవేదన మొత్తాన్ని బయటపెడుతున్నారు. అయితే ఇది ఎంతవరకు దారి తీస్తుంది.. ఎక్కడి వరకు వెళ్తుంది అనేది” కాలం గడిస్తే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే గతంలో విదేశీ పర్యటనలో ఉన్నప్పుడే కవిత లేఖలు బయటికి వచ్చాయి. ఇప్పుడు కూడా కవిత వెళ్లిన తర్వాతే కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షుడిని నియమించారు. ఇప్పుడు కూడా కవిత తన ఆగ్రహాన్ని లేఖ రూపంలో బయట పెట్టడం విశేషం.