T News Reporter: ఇటీవల ఖమ్మం జిల్లాలో రిపోర్టర్ సాంబ పై పోలీసులు కేసు నమోదు చేశారు. యూరియా పంపిణీ సంబంధించి ఒక రైతును రెచ్చగొట్టాడని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని సూచించాడని.. అయితే ఆ రైతు దానికి ఒప్పుకోలేదని.. ఆ తర్వాత టీ న్యూస్ రిపోర్టర్ వ్యవహార శైలి పట్ల ఆ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడని.. పోలీసులు క్రైమ్ నెంబర్ 259/2025 ద్వారా కేసు నమోదు చేశారు.. భారత న్యాయ సంహిత చట్టంలో 151, 196, 353(2), రెడ్ విత్ 3(5), రెడ్ విత్ 62 సెక్షన్ల కింద సాంబ మీద కేసు నమోదు చేశారు.
ఈనెల 11న కొణిజర్ల మండలంలో యూరియా పంపిణీ చేశారు. ఆ సమయంలో అక్కడికి ఈ న్యూస్ రిపోర్టర్ సాంబ, వీడియోగ్రాఫర్, మరో వ్యక్తి చేరుకున్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాయిస్ ఇవ్వాలని అక్కడి రైతులను కోరారు. కేవలం కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులకు మాత్రమే యూరియా ఇస్తున్నట్టు చెప్పాలని సూచించారు. ధర్నాలు చేస్తామని చెప్పాలని.. తద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేద్దామని సాంబ అక్కడున్న రైతులతో చెప్పినట్టు తెలిసింది. ఇదే విషయంపై నాగరాజు అనే రైతు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. సాంబ, వీడియో గ్రాఫర్, మరో వ్యక్తి తనను ప్రేరేపించారని నాగరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
సాంబ పై కేసులు నమోదు చేసిన నేపథ్యంలో జర్నలిస్టు సంఘాలు బయటికి వచ్చాయి ప్రభుత్వం నమోదు చేసిన కేసులను వెనక్కి తీసుకోవాలని కోరారు. వాస్తవానికి పాత్రికేయులు పాత్రికేయుల మాదిరిగా ఉండాలి. అలా కాకుండా కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించడం.. కృత్రిమ అలజడులను రేకెత్తించడానికి ప్రేరేపించడం వంటివి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తుంటాయి.. ఇలాంటి సమయంలో శాంతిభద్రతలు అదుపుతప్పితే దానికి బాధ్యత కూడా పాత్రికేయులు తీసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి జరిగిన సంఘటనను యధావిధిగా ప్రజలకు వివరించడం విలేకరి విధి. అలాకాకుండా సంఘటన జగడానికి విలేఖరి కారణం కాకూడదు. వాస్తవానికి ఇక్కడ సాంబ చేసింది తప్పు అని ఓకే తెలుగు చెప్పడం లేదు. ఒక పాత్రికేయుడిని విమర్శించడం ఓకే తెలుగు విధానం కూడా కాదు.. కాకపోతే అక్కడ ఆ సంఘటన జరగడానికి సాంబ కారణమని కొణిజర్ల పోలీసులు నమోదు చేసిన కేసు ద్వారా తెలుస్తోంది. ఇటీవల సాంబను పరామర్శించడానికి జర్నలిస్ట్ సంఘాల నాయకులు, గులాబీ పార్టీ నాయకులు వెళ్లారు. ఏ సమయంలో కూడా సాంబ అందులో కనిపించడం లేదు. అయితే పోలీసులు నమోదు చేసిన కేసుల దృష్ట్యా సాంబ అజ్ఞాతంలోకి వెళ్ళాడని ప్రచారం జరుగుతోంది.