KCR: ఒకదాని తర్వాత, ఒకటి ఎన్నికలు ముగుస్తున్నప్పటికీ..తెలంగాణ రాజకీయాలు వేడివేడిగానే ఉన్నాయి. త్వరలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో.. భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ నేతల మధ్య మాటలు కాక పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ సమావేశాలను దృష్టిలో పెట్టుకొని భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి వచ్చారు.
తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వైఖరిపై చర్చించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగట్టాలని ఆయన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు..” ప్రభుత్వం ఎంతో చేస్తుందని ఊహించాం. తెలంగాణను మరింత అభివృద్ధి చేస్తుందని భావించాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని అనుకున్నాం. అవన్నీ చేయకపోగా తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేస్తోంది. ప్రజలను ఇబ్బందులు పెడుతోంది. సమస్యలను పరిష్కరించడం లేదు. తాగునీటి కోసం ప్రజలు గోసపడుతున్నారు. విద్యుత్ లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత భారత రాష్ట్ర సమితి మీద ఉంది. అందువల్లే శాసనసభలో ప్రజా సమస్యల పరిష్కారంపై కొట్లాడుదాం. ప్రభుత్వ వ్యవహార శైలిని నిరసిద్దామని” కెసిఆర్ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది..
కెసిఆర్ పై ఫిర్యాదు..
కెసిఆర్ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలంగాణ భవన్లో భేటీ అయిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు ధర్పల్లి రాజశేఖర్ సరికొత్త విషయాన్ని తెరపైకి తెచ్చారు. అసెంబ్లీ సమావేశాలకు కేసిఆర్ రాకపోవడం వల్ల.. ఆయనకు ప్రభుత్వం చెల్లించే జీతభత్యాలను నిలిపివేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు.. కెసిఆర్ శాసనసభకు రావడంలేదని.. అలాంటప్పుడు ఆయన జీతం ఎలా తీసుకుంటారని రాజశేఖర్ తను చేసిన ఫిర్యాదులో ప్రస్తావించారు. “తెలంగాణలో శాసనసభకు కేసీఆర్ ఒక్కసారి మాత్రమే వచ్చారు. చుట్టపు చూపుగా వస్తున్న ఆయనకు ప్రభుత్వం ఎందుకు జీతభత్యాలు చెల్లించాలి. బాధ్యతగల మాజీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి రాని ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు ఇవ్వాలి? గజ్వేల్ ప్రజలు ఆయనను నమ్ముకుని శాసనసభకు పంపించారు. కానీ ఆయన మాత్రం వ్యవసాయ క్షేత్రంలో ఉండిపోతున్నారు. పైగా నేను కొడితే మామూలుగా ఉండదని అంటున్నారు. ఇలాంటి వ్యక్తికి ప్రభుత్వం జీతభత్యాలు ఎందుకు ఇవ్వాలి? వెంటనే ఆయనకు జీతభత్యాలు నిలిపివేయాలని” రాజశేఖర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై మంగళవారం తెలంగాణ భవన్లో కేసీఆర్ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్లో చేరిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు మినహా మిగతా వారంతా హాజరయ్యారు. భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడి హోదాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ భేటీలో భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఇతర భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.