TDP And Janasena Alliance: మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన టిడిపి, జనసేన సంయుక్తంగా అభ్యర్థులను ప్రకటించాయి. తొలి విడతలో భాగంగా 118 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, మూడు పార్లమెంటు స్థానాలను కేటాయిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఇక టిడిపి తరఫున 94 మంది అభ్యర్థుల పేర్లను చంద్రబాబు వెల్లడించారు. నిన్నటి వరకు బిజెపి కూడా టిడిపి, జనసేన కూటమిలో కలుస్తుందని అందరూ భావించారు. చివరికి చంద్రబాబునాయుడు కూడా అదే విధమైన సంకేతాలు ఇచ్చారు. అభ్యర్థుల ప్రకటన విషయంలోనూ ఆయన అదే ధోరణి ప్రదర్శించారు. కానీ చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదు గానీ మొత్తానికి ఈ కూటమిలో కమలం ప్రస్తావన కనిపించలేదు.
మొదటి విడతలో సీట్ల కేటాయింపులకు సంబంధించి కమలం పార్టీ ప్రస్తావన లేదు కదా అని విలేకరులు అడిగినప్పుడు “జనసేన పార్టీతో మా పొత్తు ఖరారైంది. అందులో భాగంగానే తొలి విడత సీట్లు ప్రకటించాం. ఒకవేళ మాకూటమిలోకి బిజెపి కలసి వస్తే అప్పుడు వారితో పొత్తు గురించి ఆలోచిస్తాం.. ప్రస్తుతానికయితే తొలి విడత స్థానాలు ప్రకటించాం. అతి త్వరలో రెండవ విడతలో అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తామని” చంద్రబాబు ప్రకటించారు.. మరోవైపు మాకూటమికి బిజెపి ఆశీస్సులు ఉంటాయని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రెండు పార్టీల అధినేతలు బిజెపితో పొత్తుపై విరుద్ధమైన ప్రకటనలు చేసిన నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. పలు విషయాల గురించి చర్చించారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలో పొత్తు గురించి ప్రస్తావన వచ్చింది. అనంతరం సీట్ల విషయంలోనే ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పొత్తు పొడవ లేదని సమాచారం. ఇందులో భాగంగానే శనివారం వెల్లడించిన సీట్ల వివరాలలో బిజెపి ప్రస్తావనలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. ఒకవేళ బిజెపితో పొత్తు అనేది కుదిరి ఉంటే ఈ సీట్ల టైపులో ఆ పార్టీ అభ్యర్థులకు కూడా స్థానం దక్కేదని తెలుస్తోంది..
మరోవైపు టిడిపి ప్రతిపాదించిన సీట్ల కేటాయింపు నచ్చకపోవడం వల్లే బిజెపి ఈ పొత్తుకు దూరంగా ఉందని తెలుస్తోంది. “మొన్నటిదాకా బిజెపి మా కూటమిలో కలుస్తుందని చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యమైన విధంగానే సీట్ల కేటాయింపు జరుగుతుందని చెప్పారు. అమిత్ షా కూడా పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు. కానీ సీట్ల కేటాయింపు విషయానికి వచ్చేసరికి బిజెపి ప్రస్తావన అందులో లేదని” రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కలిసి వస్తే బిజెపితో పొత్తు అంటున్నారంటే..ఇది ముడిపడే వ్యవహారం కాదని తెలుస్తోంది. జనసేన టిడిపి మొదటి విడత అభ్యర్థుల వివరాలు వెల్లడించిన నేపథ్యంలో.. బిజెపి ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.