Telangana Politics: సాధారణంగా ఆయనకు సామ్యుడు అనే పేరు ఉంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. తన పేరుకు ముందు తెలంగాణ అనే పదాన్ని చేర్చుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కీలక మంత్రిగా వ్యవహరిస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గానికి పక్కనే ఉన్న ఓ జిల్లాకు ఇన్ ఛార్జ్ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సొంత జిల్లాలో నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రం పనులపై ఓ పత్రిక వార్త రాసింది. గత ప్రభుత్వం.. ఆ ప్రాంతంలో నాలుగువేల మెగావాట్ల సామర్థ్యంతో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఎప్పుడో మొదలైన ఆ పనులు అనేక అడ్డంకులు దాటుకొని ఇప్పుడు పూర్తికావడానికి వచ్చాయి. మార్చిలో విద్యుత్ తయారీ ప్లాంట్లను ప్రారంభిస్తారనే వార్తలు వినిపించాయి. అయితే ఈలోపు ప్రభుత్వం మారడంతో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
4000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఆ విద్యుత్ ప్రాజెక్టు సంబంధించి 2000 కోట్ల బిల్లులు పెండింగ్లో పడ్డాయని ఇటీవల ఓ పత్రిక కథనం ప్రచురించింది. అయితే ఈ వార్త కథనం ఆ మంత్రికి వ్యతిరేక కోణంలో ఉంది. పైగా ఆయన అనుచరులు కాంట్రాక్టర్లను డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అనే తీరుగా ఆ పత్రిక కథనాన్ని ప్రచురించింది. పైగా ఆ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో రాజకీయ క్రీనీడ నెలకొందని రాయడంతో అటు కాంగ్రెస్ పార్టీలో.. ఇటు ఆ మంత్రికి కోపం తెప్పించింది. ఆ పత్రిక ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉన్నప్పటికీ.. తనకు వ్యతిరేకంగా రాయడాన్ని ఆ మంత్రి జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆ మంత్రి పత్రికా ప్రతినిధులకు ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది. ” నేను గాని, నాకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా డబ్బులు తీసుకున్నారా? పోనీ డబ్బులు డిమాండ్ చేశారా? ఎలాంటి ఆధారాలు లేకుండా అలా ఎలా వార్తలు రాస్తారు? కాంట్రాక్టు సంస్థలకు మేము డబ్బులు చెల్లిస్తూనే ఉన్నాం కదా? ఎవరో కాంట్రాక్టు సంస్థ ప్రతినిధి మీకు చెప్పగానే అభూత కల్పనలతో వార్తలు ఎలా రాస్తారు అంటూ” ఆ మంత్రి ఫైర్ అయినట్టు తెలుస్తోంది. అంతే కాదు తాను నిర్వహించే సమావేశాలకు రావద్దని ఆ పత్రిక ప్రతినిధులకు హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాకముందే ఇలా ప్రభుత్వంపై నిందలు వేయడం ఏంటని ఆ పత్రికా ప్రతినిధులను కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.