https://oktelugu.com/

BRS : బీఆర్ఎస్ ఎందుకు ఫెయిల్ అయ్యింది.. ఆ లోపాన్ని ఇప్పటికైనా గుర్తించిందా?

ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు బీఆర్ఎస్ పార్టీలో చాలా వరకు పదవులు అనుభవించారు. అలా చాలా వరకు బీఆర్ఎస్ పార్టీపై అపవాదులు కూడా వచ్చాయి. పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారనే విమర్శలూ వచ్చాయి. ఉద్యమకారులను వదిలి పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి ఎందుకు పెద్దపీట వేస్తున్నారంటూ చాలా వరకు నిలదీతలు ఎదుర్కొన్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : September 27, 2024 / 03:21 PM IST

    BRS

    Follow us on

    BRS : తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం పాటు తిరుగులేని శక్తిగా ఎదిగింది బీఆర్ఎస్ పార్టీ. మరే పార్టీ ఎదగకుండా.. కేవలం గులాబీ పార్టీనే ఆధిపత్యం కొనసాగించింది. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు వచ్చారు. పెద్ద పెద్ద నేతలు, సీనియర్ లీడర్లు కూడా బీఆర్ఎస్ పక్షాన చేరారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా చాలా మంది పార్టీలో చేరారు. మరోవైపు.. ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ హవానే కనిపించింది. ఎన్నిక ఏదయినా గులాబీ జెండాలే ఎగరాయి. ఒకవిధంగా రాష్ట్రంలో ఇతర పార్టీల జెండాలే కనిపించలేదని చెప్పాలి. ఉద్యమ నేతగా కేసీఆర్ ఏ పిలుపునిచ్చినా గులాబీ శ్రేణులు సక్సెస్ చేశాయి.

    అయితే.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు బీఆర్ఎస్ పార్టీలో చాలా వరకు పదవులు అనుభవించారు. అలా చాలా వరకు బీఆర్ఎస్ పార్టీపై అపవాదులు కూడా వచ్చాయి. పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారనే విమర్శలూ వచ్చాయి. ఉద్యమకారులను వదిలి పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి ఎందుకు పెద్దపీట వేస్తున్నారంటూ చాలా వరకు నిలదీతలు ఎదుర్కొన్నారు. పదేళ్లు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ పార్టీ ఓవర్ ఫుల్ కావడంతో ఎవరికి పదవులు ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో కూడా అర్థం కాని పరిస్థితి ఉండేది. చివరకు పదేళ్ల పాటు ప్రభుత్వం పదవులు అనుభవించిన ఏనాడూ పార్టీ మీద వ్యతిరేకత చూపించలేదు. ఎక్కడా పార్టీ పట్ల వ్యతిరేకంగా మాట్లాడిందీ లేదు. కానీ.. ఇప్పుడు ఆ నేతలంతా పక్కచూపు చూస్తున్నారు.

    దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉన్న సమయంలో కిందిస్థాయి కేడర్‌ను కానీ, సెకండ్ లీడర్లను కానీ పెద్దగా పట్టించుకోలేదనే అపవాదు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో ఉంది. నామినేటెడ్ పదవుల్లోనూ అన్యాయం జరిగిందనే అభిప్రాయం ఉండేది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి.. మంత్రులు, ఎమ్మెల్యేల వరకూ కేడర్‌ను పెద్దగా లెక్క చేయలేదనే విమర్శ ఉంది. ఇప్పటికీ అదే భావన ఇంకా కార్యకర్తల్లో కనిపిస్తోంది. పైస్థాయిలో ఉన్న నేతలంతా ఎంతసేపూ పెద్ద పెద్ద తలకాయలనే పట్టించుకున్నారని అంటుంటారు. పదేళ్ల పాటు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ మొన్నటి ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. అప్పటి నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌజ్‌ను వదిలి రావడం లేదు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి చేదు ఫలితాలు వచ్చినా.. పార్టీ కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేయలేదు. ఓటమిపై కనీసం సమీక్షలు నిర్వహించింది కూడా లేదు. ఫలితంగా కేడర్‌లో ఆ అసంతృప్తి కాస్త మరింత పెరిగింది.

    రెండు ప్రధాన ఎన్నికల్లోనూ పార్టీకి ఊహించని ఫలితాలు వచ్చినప్పటికీ పెద్ద లీడర్లు స్పందించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదిలాఉంటే.. మరికొద్ది రోజుల్లో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో పార్టీ కేడర్‌ను సిద్ధం చేసేందుకు బీఆర్ఎస్ జిల్లాల వారీగా వరుసగా సమీక్షలు నిర్వహిస్తోంది. ఈ సమావేశాలకు కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కేటీఆర్ కనుసన్నల్లోనే ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అధికారంలో ఉన్నన్ని రోజులు తమను పట్టించుకోలేదని.. ఇప్పుడు సమావేశాలకు ఎలా వస్తామని బహిరంగంగానే బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారం శాశ్వతం కాదని.. నాయకులే పార్టీకి ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుతున్నారు. ఇటీవల హన్మకొండ జిల్లా నేతలతో సమావేశమైన కేటీఆర్ సైతం ఇలాంటి కీలక వ్యాఖ్యలే చేశారు. పదేళ్లలో కార్యకర్తలను పట్టించుకోని అంశం వాస్తవమేనని, అలాంటి తప్పు రిపీట్ కాకుండా చూసుకుందామని చెప్పారు. ఫైనల్లీ పార్టీలోని సెకండ్ కేడర్‌లో అసంతృప్తిని తొలగించి పార్టీకి మునుపటి ఊపు తీసుకురావాలని కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు స్థానిక ఎన్నికల్లో ఫలిస్తాయో లేదో చూడాలి మరి..!!