KTR Delhi Tour: హస్తిన ప్రోగ్రాం పెట్టుకున్న కేటీఆర్ కేంద్ర మంత్రులను వరుసగా కలుస్తున్నారు. ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి ని కేటీఆర్ కలిశారు. జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించి వినతిపత్రం అందించారు. గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు పంపిన ప్రతిపాదనల గురించి వివరించారు.. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులను మరింతగా పొడిగించాలని కోరారు. సూర్యపేట నుంచి సిరిసిల్ల వరకు జాతీయ రహదారి 368 – బీ నిర్మిస్తున్న నేపథ్యంలో.. దానిని వేములవాడ నుంచి కోరుట్ల వరకు విస్తరించాలని గడ్కరి ని కేటీఆర్ కోరారు.. ఈ రహదారి వెంట ఉన్న వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాలు మరింత అభివృద్ధి చెందితయని ఆయన పేర్కొన్నారు.. మానేరు నదిపై రోడ్, బ్రిడ్జి నిర్మించాలని కోరారు. ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఉన్న కాలంలోనే ఈ ప్రతిపాదనలు పంపించామని.. వాటిని పరిశీలించాలని కోరారు. కేటీఆర్ వెంట సబితా ఇంద్రారెడ్డి, పార్లమెంటు మాజీ సభ్యుడు వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు.
ఇటీవల కాలంలో కేటీఆర్ పై రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టింది. ఫార్ములా – ఇ కేసులో అవకతవకలు జరిగాయని ఏసీబీ అధికారులు కేటీఆర్ ను విచారణకు పిలిపించారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా కేటీఆర్ ను విచారించారు.. ఈ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఆ తర్వాత విలేకరుల సమావేశంలో ధాటిగా మాట్లాడారు. తానే దర్యాప్తు సంస్థల అధికారులను తిరిగి ప్రశ్నించానని కేటీఆర్ చెప్పుకున్నారు. అయితే కేంద్ర మంత్రుల ప్రాపకం వల్లే కేటీఆర్ తన మీద కేసులు రాకుండా చూసుకున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించడం మొదలుపెట్టారు.. ఇప్పుడు కూడా కేటీఆర్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లారు. ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు.. బడ్జెట్ కు కేంద్రం ప్రపోజల్స్ తీసుకున్నప్పుడు కేటీఆర్ ఢిల్లీ వెళ్లలేదు. తెలంగాణకు వరాలు ప్రకటించాలని కోరలేదు. భారత రాష్ట్ర సమితి తరపున ఎటువంటి వినతి పత్రాలు కేంద్రానికి అందించలేదు. కానీ ఇప్పుడు కేటీఆర్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లడం అనేక సంచలనాలకు కారణమవుతోంది. మరోవైపు సిఎల్పీ భేటీ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. కులగణన నివేదికను రాహుల్ గాంధీకి అందించనున్నారు. ఆ తర్వాత వివిధ విషయాలపై కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడనున్నారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు కీలక నాయకులు ఢిల్లీ వెళ్లడం.. సంచలనంగా మారింది. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఫార్ములా ఈ కేసులో చలనం ఉంటుందని.. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో తదుపరి అడుగులను బలంగా వేస్తుందని తెలుస్తోంది. అందువల్లే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని.. కేంద్ర మంత్రులను కలిశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.