Nagababu : మెగా బ్రదర్ గా, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొణిదెల నాగబాబు కి ఎంత మంచి పాపులారిటీ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. త్వరలోనే ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ లో మంత్రిగా కూడా ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు. సినిమాల్లో హీరోగా సక్సెస్ కాకపోయినా, క్యారక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు నాగబాబు. అంతే కాకుండా మెగా హీరోలకు, అభిమానులకు మధ్య వారధిగా వ్యవహరిస్తూ నాగబాబు చేసిన కార్యక్రమాలను మెగా అభిమానులు అంత తేలికగా మర్చిపోలేరు. కేవలం సినిమాల్లోనే కాకుండా బుల్లితెర ఆడియన్స్ కి కూడా ఆయన పలు సీరియల్స్, ఎంటర్టైన్మెంట్ షోస్ ద్వారా ఎంతో దగ్గరయ్యాడు. ముక్కుసూటిగా మనసులో ఉన్న మాటలను నిర్మొహమాటంగా మాట్లాడే అలవాటు ఉన్న నాగబాబు, ఎంతో ఎమోషనల్ అవుతూ కాసేపటి క్రితమే ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారింది.
14 ఏళ్ళ నుండి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్క చనిపోవడం తో నాగ బాబు కన్నీటి పర్యంతం అయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రియమైన ఫ్లాష్..14 సంవత్సరాల నుండి నీతో మాకు ఉన్న అనుబంధం వెలకట్టలేనిది. నువ్వు చూపించిన ప్రేమ, చేసిన అల్లరిని మేము ఎప్పటికీ మరచిపోలేము. ఇక ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో. నీతో గడిపిన మధుర క్షణాలను మేము మా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాము. నీవు లేని లోటు ఎవ్వరూ పూడ్చలేనిది. ఒక జంతువుగా కాదు, మా కుటుంబంలో ఒక మనిషిలాగా నిల్చిపోయావు. ముఖ్యంగా నా కూతురు నిహారిక కి నువ్వు ఎంతో నమ్మకస్తుడివి. ఆమె దినచర్య నీతోనే మొదలు అవుతుంది. అలాంటిది ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటో నాకు కూడా అర్థం కావడం లేదు. ఇదే నీకు మా చివరి వీడ్కోలు. స్వర్గం లో ప్రశాంతంగా ఆడుకో, మేమంతా నిన్ను ఎంత మిస్ అవుతున్నామో మాటల్లో వర్ణించలేం’ అంటూ నాగబాబు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
నాగబాబు సాధారణంగా ఎమోషనల్ వ్యక్తి కాదు. ఎలాంటి పరిస్థితులను అయినా తట్టుకోగల శక్తి ఆయనకు ఉంటుంది. అలాంటి నాగబాబు ఇంతలా ఎమోషనల్ అవుతూ మాట్లాడడం ఇప్పటి వరకు ఎవ్వరూ చూడలేదు. ఆ పోస్ట్ చూసిన తర్వాత అభిమానులు కూడా ఎమోషనల్ అయిపోయారు. కామెంట్స్ ద్వారా నాగబాబు కి ధైర్యం చెప్తూ, ఫ్లాష్ కి ‘రెస్ట్ ఇన్ పీస్’ ట్వీట్స్ వేస్తున్నారు. ఇకపోతే నాగబాబు ప్రస్తుతం సినిమాలకు దూరంగా, రాజకీయ కార్యక్రమాల్లోనే ఎక్కువగా పాల్గొంటున్నాడు. రీసెంట్ గానే ఆయన పుంగనూరులో ‘జనంలోకి జనసేన’ అనే కార్యక్రమంలో పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే. త్వరలోనే ఆయన క్యాబినెట్ లోకి అడుగుపెట్టబోతున్న ఈ నేపథ్యంలో జనాల్లోకి బలంగా వెళ్లేందుకు ఇప్పటి నుండే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు సీఎం చంద్రబాబు ఏ మంత్రి పదవి ఇవ్వబోతున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.