Jubilee Hills by-election: ఏ రంగంలోనైనా పోటీ చేస్తున్నప్పుడు విశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. అలాకాకుండా అతి విశ్వాసాన్ని ప్రదర్శించి.. అడ్డగోలుగా ప్రవర్తిస్తే మొదటికే మోసం వస్తుంది. తర్వాత దానికి ఎన్ని మినహాయింపులు ఇచ్చినప్పటికీ ఉపయోగముండదు. పోటీ ఎలాంటిదైనా సరే.. గెలవడానికి నూటికి నూరు శాతం శ్రమించాలి. అలాకాకుండా అడ్డదారులు తొక్కితే.. అడ్డగోలుగా వ్యవహరిస్తే ఆ తర్వాత అనుకోవడానికి ఏమీ ఉండదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రస్తుతం ప్రధాన ప్రత్యక్షమైన భారత రాష్ట్ర సమితి పరిస్థితి అలాగే ఉంది.
భారత రాష్ట్ర సమితికి సోషల్ మీడియాలో విపరీతమైన బలం ఉంది. ఆ పార్టీకి యూట్యూబ్ నుంచి మొదలుపెడితే ట్విట్టర్ వరకు కొన్ని వందలకొద్దీ హ్యాండిల్స్ ఉన్నాయి.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈ హ్యాండిల్స్ మొత్తం విపరీతంగా పని చేశాయి. గులాబీ పార్టీదే గెలుపు అని.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకోలేదని.. రేవంత్ పనితీరుకు ఇది గీటు రాయి అని.. ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ గులాబీ పార్టీకి కంచుకోట అని ప్రచారం చేశాయి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతిపనిని భూతద్దంలో పెట్టి చూపించి విపరీతమైన నెగిటివిటీని స్ప్రెడ్ చేశాయి. ఇక సొంత మీడియాలో అయితే కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన విషాన్ని చిమ్మాయి. సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి కచ్చితంగా జూబ్లీహిల్స్ లో గులాబీ పార్టీ గెలుస్తుందని అనిపించింది. అంతేకాదు కేటీఆర్ కూడా వరుసగా అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఒక రకంగా శాసనసభ ఎన్నికల మాదిరిగా చేసేశారు. గులాబీ పార్టీ ప్రచార బాధ్యతను.. మాగంటి సునీతను గెలిపించే బాధ్యతను కూడా కేటీఆర్ తన భుజాల మీదకి వేసుకున్నారు. అందువల్లే సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు.
కేటీఆర్ మాట్లాడిన ప్రతి సభలోను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను రేవంత్ రెడ్డి పరిపాలనకు రెఫరెండం అని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ లో తాము గెలిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. దీనిని అత్యంత సవాల్గా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలైన గేమ్ ప్లాన్ మొదలుపెట్టారు. పోల్ మేనేజ్మెంట్లో తమకంటే తోపు ఎవరూ లేరు అని విర్రవీగే భారత రాష్ట్ర సమితికి చుక్కలు చూపించారు. 2014 నుంచి 2023 వరకు గులాబీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. దుబ్బాక, హుజూరాబాద్ నియోజవర్గాలలో జరిగిన ఉప ఎన్నికలు మినహాయిస్తే.. వచ్చిన ప్రతి ఉప ఎన్నికలోనూ గులాబీ పార్టీ విజయం సాధించింది. పోల్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి చుక్కలు చూపించింది.. అప్పుడు అధికారంలో ఉండడంతో అన్ని వ్యవస్థలను కూడా తనకు అనుకూలంగా వాడుకుంది.
Also Read: వైఎస్ జగన్ సంచలన నిర్ణయం!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీ మీద పై చేయి సాధించడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసింది. చాలావరకు విజయం సాధించింది.. ఇప్పుడైతే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కేటీఆర్ విమర్శలు చేశారో.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను రెఫరండం అని అన్నారో.. అప్పుడే పరిస్థితి మారిపోయింది.. అప్పటిదాకా నిస్తేజంగా ఉన్న పార్టీ కార్యకర్తలను.. ఎమ్మెల్యేలు, మంత్రులకు ముఖ్యమంత్రి టార్గెట్ విధించారు.. దీంతో అందరు కూడా క్షేత్రస్థాయిలో పనిచేశారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ కి తిరుగులేకుండా పోయింది.. పోల్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితికి చుక్కలు చూపించింది.. దీంతో గులాబీ పార్టీ ఇబ్బంది పడక తప్పలేదు. మరోవైపు ఎన్నికల చివరి మూడు రోజులు గులాబీ పార్టీ ఎందుకు కాడి విడిచేసినట్టు కనిపించింది. దీనిని కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంది. అందువల్లే అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని.. నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అవుతారని చెప్పాయి. బహుశా అందువల్లే గులాబీ పార్టీ పోలింగ్ జరుగుతున్నప్పుడే మాగంటి సునీతతో ప్రెస్ మీట్ పెట్టించాయి. ఓటమిని ముందే ఒప్పుకుని కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించాయి.