Balapur Ganesh Laddu: ఏ ముహూర్తాన దేవరకొండ బాలగంగాధర తిలక్ గణపతి ఉత్సవాలను ప్రారంభించారో కానీ.. అవి భారతీయ సనాతన సంప్రదాయంలో ఒక భాగం అయిపోయాయి. కులం, మతం తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఉత్సాహంగా పాల్గొనే వేడుకల్లో గణపతి చవితి ముందు ఉంటుంది. ఉత్తర భారత దేశంలో గణపతి వేడుకలను ఘనంగా జరుపుతారు. దక్షిణ భారతదేశంలో అయితే హైదరాబాదులో వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తారు. గతంలో గణపతి ఉత్సవాలు అంటే ఖైరతాబాద్ గుర్తుకు వచ్చేది. ఉత్సవ కమిటీ సభ్యులు ఏటికేడు భారీ విగ్రహాలను రూపొందిస్తుంటారు. ఈ తొమ్మిది రోజులు అక్కడ ఇసక వేస్తే రాలనంత స్థాయిలో జనం ఉంటారు. వీవీవీఐపీలు కూడా స్వామివారి సేవలో తరిస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఈ స్థాయిలో బాలాపూర్ లో కూడా గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. బాలాపూర్ ప్రాంతం స్థిరాస్తి వ్యాపారంలో భారీగా అభివృద్ధి సాధించింది. ఎక్కడెక్కడ నుంచో వ్యాపారులు ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. స్థానికులతో పాటుగా స్థానికేతరులు కూడా ఇక్కడ ఉన్నారు. స్థిరాస్తి వ్యాపారం భారీగా ఉండటంతో సంపన్నుల సంఖ్య భారీగా పెరిగింది. ఎంతో ఉత్సవ కమిటీ సభ్యుల్లో ఉన్న వారంతా ప్రతిష్టాత్మకంగా బాలాపూర్ గణపతి ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో బాలాపూర్ గణపతి అంటే ప్రత్యేక స్థానం ఏర్పడింది.

లడ్డు అ”ధర”హో
గణపతి వేడుకల్లో నిమజ్జనం రోజున స్వామి వారి లడ్డూను వేలం వేయడం ఆనవాయితీ. అయితే గతంలో ఖైరతాబాద్ లడ్డూను వేలం వేసేవారు. కొన్నేళ్ళ నుంచి ఆ లడ్డును వేలం వేయకుండా భక్తులకు పంపిణీ చేస్తున్నారు. కోవిడ్ ప్రబలిన నేపథ్యంలో 2020లో వేడుకలు నిర్వహించలేదు. అయితే హైదరాబాదులో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగే ప్రాంతాల్లో ఒకటైన బాలాపూర్ లో గణపతి వేడుకలు ఏటా అట్టహాసంగా జరుగుతాయి. ఇక్కడ కమిటీలో ఉన్న సభ్యులు స్థిరాస్తి వ్యాపారంలో బాగా వెనక వేసిన వారు కావడంతో వేడుకలు అంబరాన్ని అంటుతాయి. నవరాత్రి రోజుల్లో రోజూ అన్నదానం నిర్వహిస్తారు. కనీసం 5 వేల మందికి తక్కువ కాకుండా భోజనాలు పెడతారు. ఇదంతా ఒక ఎత్తు అయితే బాలాపూర్ గణపతి లడ్డు వేలం ఇంకొక ఎత్తు. తెలుగు రాష్ట్రాల్లో బాలాపూర్ లడ్డు వేలం ఏటా రికార్డ్ స్థాయిలో ధర పలుకుతుంది.

27 ఏళ్లుగా ప్రత్యేకత
బాలాపూర్ లో గణపతి ఉత్సవాలు 1994 నుంచి ప్రారంభమయ్యాయి. ఏటా స్వామి వారి లడ్డు వేలం ధర అంతకంతకు పెరుగుతోంది. 2020 సంవత్సరాన్ని మినహాయిస్తే మిగతా 27 ఏళ్లుగా ఉత్సవ సమితి లడ్డు వేలం పాటలో ప్రత్యేకత చూపిస్తూ వస్తున్నది. ఈ ఏడాది కూడా ఉత్సవ కమిటీ సభ్యులు లడ్డు వేలం పాటను ఘనంగా నిర్వహించారు. 1994లో 450 రూపాయలతో మొదలైన లడ్డు వేలం పాట ఇప్పటివరకు రికార్డు స్థాయిలో లక్షలు పలుకుతోంది. ప్రతి ఏటా వేలంపాట నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. ఈ ఏడాది కూడా వేలంపాటలో బాలాపూర్ లడ్డు ధర రికార్డు స్థాయిలో దూసుకెళ్లింది.
24.64 లక్షలకు లడ్డు సొంతం
ఏడాది నువ్వా నేనా అన్నట్టుగా సాగిన వేలంపాటలో బాలాపూర్ లడ్డూను 24.64 లక్షలకు లక్ష్మారెడ్డి అనే వ్యాపారవేత్త సొంతం చేసుకున్నారు. గత ఏడాది 18.90 లక్షల మేర ధర పలికింది. ఈ ఏడాది 20 లక్షల దాటుతుందని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను దాటి ఈ ఏడాది రికార్డు స్థాయిలో 24.64 లక్షలకు లడ్డు ధర పలికింది. గత ఏడాదితో పోల్చితే 5.74 లక్షలకు ఎక్కువగా లడ్డు ధర పలికింది. వేలం పాటలో ఆరుగురు స్థానికులు, ముగ్గురు స్థానికేతరులు పోటీపడ్డారు. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన వేలంపాటలో లక్ష్మారెడ్డి బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్నారు. వేలంపాట అనంతరం బాలాపూర్ గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది.
450 రూపాయలతో మొదలైంది
1994లో కొలను మోహన్ రెడ్డి అనే వ్యక్తి 450 రూపాయలకు బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్నారు. 1995 లోనూ మోహన్ రెడ్డి 4,500 కు లడ్డూను దక్కించుకున్నారు. 1996లో కొలను కృష్ణారెడ్డి 18 వేలకు లడ్డూను కైవసం చేసుకున్నారు. 1997లో కొలను కృష్ణారెడ్డి 28 వేలకు లడ్డూను కొనుగోలు చేశారు. 1998లో కొలను మోహన్ రెడ్డి 51 వేలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. 1999లో కళ్లెం ప్రతాపరెడ్డి 65 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. 2000 సంవత్సరంలో కళ్లెం అంజిరెడ్డి 66వేలకు లడ్డూను కైవసం చేసుకున్నారు. 2001లో రఘునందన్ చారి అనే వ్యక్తి 85వేలకు లడ్డూను కొనుగోలు చేశారు. 2002లో కాందాడ మాధవరెడ్డి 1.5 లక్షలకు లడ్డూను వేలం పాటలో కొనుక్కున్నారు. 2003లో బాల్రెడ్డి 1.55 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. 2004లో కొలను మోహన్ రెడ్డి 2.1 లక్షలకు లడ్డూను కొనుగోలు చేశారు. 2005లో ఇబ్రహీం శేఖర్ అనే వ్యక్తి 2.8 లక్షలకు లడ్డూను వేలం బాటలు దక్కించుకున్నారు. 2006లో చిగురింత తిరుపతిరెడ్డి 3 లక్షలకు లడ్డూ కొన్నారు. 2007లో రఘునందన్ చారి 4 లక్షల 15 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. 2008లో కొలను మోహన్ రెడ్డి 5 లక్షల ఏడు వేలకు లడ్డును కొన్నారు. 2009లో సరిత అనే మహిళ 5 లక్షల పదివేలకు లడ్డూను దక్కించుకున్నారు. 2010లో కొడాలి శ్రీధర్ బాబు 5 లక్షల 35 వేలకు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. 2011లో కొలను కుటుంబం 5 లక్షల 45 వేలకు లడ్డూను కొనుగోలు చేసింది. 2012 లో పన్నాల గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి 7 లక్షల 50 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. 2013లో తీగల కృష్ణారెడ్డి 9 లక్షల 26 వేలకు లడ్డూను కొనుగోలు చేశారు. 2014 లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి అనే వ్యక్తి 9 లక్షల 50 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. 2015లో కళ్లెం మదన్ మోహన్ రెడ్డి లడ్డును వేలంలో కొనుగోలు చేశారు. 2016లో స్కైలాబ్ రెడ్డి అనే వ్యక్తి 14 లక్షల 65 వేలకు లడ్డూను పాడుకున్నారు. 2017లో నాగం తిరుపతి రెడ్డి అనే వ్యక్తి 15 లక్షల 60 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. 2018లో పేరేంటి శ్రీనివాస్ గుప్తా అనే వ్యక్తి 16 లక్షల 60 వేలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. 2019లో కొలను రామిరెడ్డి అనే వ్యక్తి 17 లక్షల అరవై వేలకు లడ్డూను వేలంలో కొనుగోలు చేశారు. 2020లో కరోనా కారణంగా వేడుకలను రద్దు చేశారు. 2021 లో కొంతమంది సమూహంగా ఏర్పడి 18.90 లక్షలకు లడ్డూను కొనుగోలు చేశారు.
[…] Also Read: Balapur Ganesh Laddu: బాలాపూర్ గణపతి లడ్డూకు ఎందుక… […]