YCP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవిని ఓ టీవీ ఛానల్ అధినేత ఆశించారని వార్తలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం కూడా ఆయనకే కట్టబెడుతుందని మీడియాలో ప్రచారం జరిగింది. హీరోగా తిరుమల లడ్డు వివాదం తెరపైకి రావడంతో ఒక్కసారిగా చైర్మన్ పదవి విషయం పక్కకు వెళ్లిపోయింది. ఇదే క్రమంలో ఆ టీవీ ఛానల్ అధినేత కుమారుడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ టీవీ ఛానల్ అధినేత కుమారుడు గత కొంతకాలంగా మాదకద్రవ్యాల ముఠాతో సంచరిస్తున్నాడట. పలుమార్లు వాళ్లతో సంభాషణలు జరిపాడట. తెలంగాణ నార్కోటిక్స్ బృందం పరిశీలన చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందట. దీంతో ఆ ఛానల్ అధినేత కుమారుడికి తెలంగాణ నార్కోటిక్స్ బృందం నోటీసులు ఇచ్చిందట. హై ప్రొఫైల్ కేస్ కావడంతో ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా తెలంగాణ నార్కోటిక్స్ బృందం వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని వైసిపి అధికారిక సోషల్ మీడియా గురువారం బట్టబయలు చేసింది. “చూశారా పచ్చ మీడియా ఎందుకు తెగించిందో. పచ్చ మీడియా అధినేత కుమారుడు ఎంతటి దుర్మార్గమైన పనులు చేస్తున్నాడో.. ఇటువంటి వ్యక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ రేసు లో ఉన్నారట.. ఇటువంటి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఎలా ఇస్తారు?” అంటూ వ్యాఖ్యానించింది. తను చేసిన ఆరోపణలకు బలమైన ఆధారంగా తెలంగాణ నార్కోటిక్స్ బృందం ఇచ్చిన నోటీసును అందులో పోస్ట్ చేసింది. దానికంటే ముందు బుధవారం నాడు సాక్షి పత్రికలో సదరు మీడియా ఛానల్ అధినేత కుమారుడి మాదకద్రవ్యాల వ్యవహారంపై కథనం ప్రచురితమైంది.
వైసిపి సోషల్ మీడియా బృందం కసరత్తు
కొద్దిరోజులుగా ఈ వ్యవహారంపై వైసీపీ సోషల్ మీడియా బృందం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ అధికారం కోల్పోయిన తర్వాత వైసిపి సోషల్ మీడియా విభాగం పూర్తిగా నిస్తేజమైపోయింది. టిడిపి, దాని అనుబంధ మీడియా ఇస్తున్న షాక్ లకు కోలుకోకుండా అయింది. అయితే ఇన్నాళ్లకు నిద్రమత్తు వీడినట్టుంది. దీంతో డైరెక్ట్ అటాక్ చేసింది. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు సదరు మీడియా ఛానల్ ఇష్టానుసారంగా కథనాలను ప్రసారం చేసింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నేరుగా ప్రశ్నించింది. ఇది ఒక రకంగా జగన్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. నాడు అధికారంలో తాము ఉన్నప్పుడు ఆ ఛానల్ అధినేత వ్యవహరించిన తీరు జగన్ కు సహజంగానే ఆగ్రహం తెప్పించింది. సరిగ్గా ఇన్నాళ్లకు రివెంజ్ తీర్చుకునే అవకాశం వచ్చింది. అందువల్లే ఆ ఛానల్ ఓనర్ కుమారుడి మాదకద్రవ్యాల దందాను వైసిపి అధికారిక సోషల్ మీడియా బయటపెట్టింది. అంతేకాదు ఆ ఛానల్ ఓనర్ టిటిడి చైర్మన్ ఆశలను కూడా అడియాసలు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గొప్పగా చేస్తాం.. మరింతగా అభివృద్ధి చేస్తామని చెబుతున్న చంద్రబాబు.. ఆ చానల్ ఓనర్ కు టిటిడి చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం లేదని టిడిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే మొన్నటిదాకా లడ్డు వ్యవహారం, జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడరని వైసీపీ ఎదుర్కొన్న విషయం తెలిసిందే.