HomeతెలంగాణTelangana BJP: బండి సంజయ్‌ ఎక్కడ? తెలంగాణ బీజేపీలో లోకల్‌ స్టార్‌ క్యాంపెయినరే లేడా?

Telangana BJP: బండి సంజయ్‌ ఎక్కడ? తెలంగాణ బీజేపీలో లోకల్‌ స్టార్‌ క్యాంపెయినరే లేడా?

Telangana BJP: తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం.. డిసెంబర్‌ 3 తర్వాత అధికారంలోకి వచ్చేది తామే.. కేసీఆర్‌ను గద్దె దించే పార్టీ బీజేపీ ఒక్కటే.. ఇవీ రెండేళ్లుగా బీజేపీ చెబుతున్న మాటలు. మునుగోడు ఉప ఎన్నికలు, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు తెలంగాణ ప్రజలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. పల్లె నుంచి పట్నం వరకు అంతా బీజేపీకి జైకొట్టారు. ఇందుకు కారణం.. బండి సంజయ్‌. నాడు పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న సంజయ్‌ తాను బాధ్యతలు చేపట్టిన మూడేళ్లలో బీజేపీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో, విభజిత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నడూ లేనంతగా ఊపు తెచ్చారు. కానీ సడెన్‌గా అధిష్టానం ఆయనను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికలు, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చవిచూసింది. ఈమూడు పరిణామాలతో తెలంగాణలో బీజేపీ ఎంత స్పీడ్‌గా రైజింగ్‌ అయిందో.. అంతే వేగంగా పార్టీ గ్రాఫ్‌ పడిపోతూ వచ్చింది.

ఎన్నికల వేళ అధ్యక్షుడి మార్పు…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు బీజేపీ అధిష్టానం పార్టీలోని కొంతమంది నేతల ఒత్తిడికి తలొగ్గి బండి సంజయ్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది. కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి తిరిగి అధ్యక్ష పగ్గాలు అప్పగించింది. ఈ నిర్ణయం ఆ పార్టీ కార్యకర్తలను డీలా పడేలా చేసింది. అదే సమయంలో అధికార బీఆర్‌ఎస్‌కు ఊపిరి పీల్చుకునేలా చేసింది. మరోవైపు విపక్ష కాంగ్రెస్‌కు ఓ అస్త్రాన్ని అందించింది. బీఆర్‌ఎస్‌ ఒత్తిడితోనే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిని మార్చిందని కాంగ్రెస్‌ విస్తృత ప్రచారం చేసింది. కిషన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ కోవర్టు అని ఆరోపించింది. దీంతో అప్పటివరకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నుంచి బీజేపీ వైపు చూసిన నేతలంతా తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.

ఆగిపోయిన చేరికలు.. తగ్గిన జోష్‌..
తెలంగాణలో ఇప్పుడు బీజేపీ అంటే బండి సంజయ్‌ కాలం.. ఆ తర్వాత అన్నట్లుగా తయారైంది. బండి సంజయ్‌ దూకుడుతో అధికార బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తోపాటు రాజకీయాల్లో స్తబ్ధుగా ఉన్న టీడీపీ నేతలు సైతం బీజేపీలోకి క్యూకట్టారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ను గద్దె దించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని నమ్మారు. క్షేత్రస్థాయిలో కూడా బీజేపీ క్యాడర్‌ బలపడింది. కార్యకర్తల్లో జోష్‌ కనిపించింది. కానీ, సంజయ్‌ను తప్పించిన తర్వాత బీజేపీలో చేరికలు ఆగిపోయాయి. చేరతామని చెప్పిన నేతలు కూడా సంజయ్‌ను తప్పించిన తర్వాత మారకపోవడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చారు. ఇక క్యాడర్‌ను ఉత్సాహపరిచే నాయకుడు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ఉత్సాహం తగ్గింది.

ఎన్నికల వేళ కానరాని స్టార్‌ క్యాంపెయినర్‌..
ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇప్పటికీ బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అంటున్నారు. డిసెంబర్‌ 3 తర్వాత అధికారంలోకి వస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌.సంతోష్‌ ప్రకటించారు. తెలంగాణలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని స్పష్టం చేశారు. మరోవైపు అధికార బీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. బీఆర్‌ఎస్‌ తరఫున సీఎం కేసీఆర్‌తోపాటు ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్, అల్లుడు, మంత్రి హరీశ్‌రావు అన్నీ తామై ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. విపక్షాల ఆరోపణలకు ప్రత్యారోపణలతో సమాధానం చెబుతున్నారు. దీటుగా తిప్పకొడుతున్నారు. ఇక కాంగ్రెస్‌లోనూ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లాంటి నేతలు బీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. బీఆర్‌ఎస్, బీజేపీ చేస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. మరోవైపు రాహుల్, ప్రియాంక బస్సుయాత్రలతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.

బీజేపీలో కానరాని స్టార్‌ క్యాంపెయినర్‌..
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ఎన్నికల రేసులో నువ్వా నేనా అన్నట్లు దూసుకుపోతుంటే.. బీజేపీ మాత్రం జాతీయ నేతల ప్రచారంపైనే ఆధారపడింది. బీఆర్‌ఎస్‌కు కేటీఆర్, హరీశ్‌రావు, కాంగ్రెస్‌కు రేవంత్, ఉత్తమ్, కోమటి రెడ్డి తరహాలో బీజేపీకి బండి సంజయ్‌ ఉన్నప్పటికీ తన స్థాయికి తగినట్లుగా ప్రచారం మొదలు పెట్టలేదు. బీజేపీ అధ్యక్షుడిగా అన్నీ తానై పార్టీకి తెలంగాణలో మంచి ఊపు తెచ్చిన బండి సంజయ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మౌనంగా ఉండడం వెనుక ఆంతర్యం ఎమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. బీజేపీ అధిష్టానం బండి సంజయ్‌ దూకుడు చూసి ఆయనను ఛత్తీస్‌గఢ్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా నియమించింది. తెలంగాణ బాధ్యతలను మాత్రం ఎవరికీ అప్పగించలేదు. ఇప్పటికే 14 మంది అసంతృప్తులతో నియమించి కమిటీలో ఎలాంటి పని చేయడం లేదు. స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడారు. ఆందోళనల కమిటీ చైర్‌పర్సన్‌ విజయశాంతి ఆందోళనలకు దూరంగా ఉన్నారు. డీకే అరుణ కూడా మౌనంగా ఉన్నారు. మేనిఫెస్టో కమిటీ మాత్రమే కాస్త పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular