CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి రెండో విడత ప్రచారం మొదలు పెట్టారు. మొదటి విడత ఏడు సభలు నిర్వహించిన కేసీఆర్.. ఆశించిన స్పందన రాలేదు. సభలు కూడా చప్పగా సాగాయి. పాడిదే పాడరా అన్నట్లు ఉందన్న అభిప్రాయం బీఆర్‌ఎస్‌లోనే వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రెండో విడత ప్రచారంతో జోష్ పెంచాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. మరోవైపు ఎన్నికలకు సమయం దగ్గర పడతుండడంతో నిత్యం రెండు మూడు సభలు నిర్వహించేలా ప్లాన్ చేసింది. గురువారం నుంచి రెండో విడత ప్రచారం మొదలు పెట్టారు గులాబీ బాస్.
తొలిరోజే మూడు సభలు..
రెండో విడత ప్రచారంలో భాగంగా మొదటి రోజు గురువారం అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో కేసీఆర్ ప్రచార సభలు ఏర్పాటు చేశారు. మొదట ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అచ్చంపేట, వనపర్తిలో సభలు నిర్వహించారు. సాయంత్రం మునుగోడు సభలో ప్రచారం చేశారు. మూడు సభల్లోనూ ఆకట్టుకునే ప్రసంగం కనిపించలేదు. మీకు అంతా తెలుసు.. నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు.. నన్ను దమ్ముంటే కొండగల్‌రా.. గాంధీ బొమ్మకాడికి రా అని సవాల్ చేస్తుండ్రు.. నా దమ్మేందో దేశం చూసింది. తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు పిడికెడు మందే ఉన్నటు.. ఇప్పుడు నియోజకవర్గానికో కేసీఆర్ ఉన్నడు.. అంటూ మూడు సభల్లో ఒకేతీరుగా ప్రచారం మొదలు పెట్టారు. ఊకదంపుడు మాటలతో కార్యకర్తల్లో ఎక్కడా ఉత్సాహం కనిపించలేదు.
తన శైలికి భిన్నంగా ప్రసంగం..
ఒకప్పుడు కేసీఆర్ సభ అంటే ప్రజలు ఎంతో ఆసక్తిగా చూసేవారు. ఆయన రాకకోసం ఎంతసేపైనా సభికులు నిరీక్షించే వారు. ఇక ప్రెస్‌మీట్ పెడుతున్నారంటే పార్టీలకు అతీతంగా టీవీలకు అతుక్కుపోయేవారు. గంటల కొద్దీ ప్రెస్‌మీట్‌లో మాట్లాడినా శ్రద్ధగా వినేవారు. ఇక ఎన్నికల ప్రచారం అంటే.. కేసీఆర్ శైలే వేరుగా ఉండేది. 2014, 2018లో ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ తన మాటలతోనే ఓటర్లను మెస్మరైజ్ చేశారు. దీంతో రెండు పర్యాయాలు ఆయనకు ప్రజలు పట్టం కట్టారు. కానీ ప్రస్తుత ప్రచార సభల్లో కేసీఆర్ మాటకారితనం కనిపించడం లేదు. సభికుల్లో ఉత్సాహం కనిపించడం లేదు. ప్రసంగం మధ్యలో కేసీఆర్ వేసే పంచులు పేలడం లేదు. పూర్తిగా చప్పగా సాగుతున్నాయి. మొదటి విడత నిరుత్సాహ పర్చినా రెండో విడత జోరు పెంచుతారనుకున్న క్యాడర్‌కూ నిరాశే ఎదురైంది.
ఓటమి భయం పట్టుకుందా..?
ఇక కేసీఆర్ సభల తీరుపై విశ్లేషకులు మరోలా స్పందిస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌కు కొత్తగా చెప్పడానికి ఎలాంటి మాటలు దొరకడం లేదని, అదే సమయంలో సర్వే రిపోర్టులు, అంతర్గత సర్వేలో బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా వస్తుండడంతో కేసీఆర్ నోట మాట రావడం లేదని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కేసీఆర్ వయసు, మొన్నటి వరకు అనారోగ్యం కూడా ప్రసంగానికి ఆటంకంగా మారాయని అంటున్నారు. ఇదిలా ఉంటే.. అచ్చపేట సభలో కేసీఆర్ మాటలు విన్న అందరూ గులాబీ బాస్‌కు ఓటమి భయం పట్టుకున్నట్లు ఉంది అంటున్నారు. అచ్చంపేట సభలో మాట్లాడుతూ ‘‘ఎన్నికల్లో వ్యక్తిగతంగా మాకు పోయేది ఏం లేదు.. మీరు ఓడగొడితే రెస్టు తీసుకుంటం.. కానీ నష్టపోయేది ప్రజలే.. చెప్పుడు మా బాధ్యత’’ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ మాటలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. పదేళ్లు పాలించావు. ఇక రెస్ట్ తీసుకో కాకా… ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ ఆస్తులు ఎంత.. సీఎం అయ్యాక మీ కుటుంబం ఆస్తులు ఎంత అనే లెక్కలు చెప్పండి.. జైల్లో రెస్ట్ తీసుకుందురు కానీ.. అంతేగా.. అంతేగా.. ఓటమి భయంతోనే కేసీఆర్ సెంటిమెంట్ డైలాగ్స్.. కాక ఫిక్స్ అయినట్లు ఉన్నడు.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Web Title: What will we do if we lose we will take rest has the fear of defeat started in kcr
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com