Mahaa TV Attack: మహా టీవీ కార్యాలయం పై భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రులు పరిశీలించారు. ఈ దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని మహా టీవీ అధినేతకు హామీ ఇచ్చారు.
మహా టీవీ కార్యాలయం పై దాడి చేసిన నేపథ్యంలో రకరకాల వీడియోలు సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తున్నాయి. అందులో ఒక వీడియో చర్చకు కారణమవుతోంది. మహా టీవీ కార్యాలయం పై గులాబీ పార్టీ కార్యకర్తలు దాడి చేసిన సందర్భంలో.. ఆ బృందంలోని ఓ వ్యక్తి కార్యాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కార్యాలయాన్ని పర్యవేక్షించే సెక్యూరిటీ సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్న నేపథ్యంలో గులాబీ పార్టీ కార్యకర్త వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. “కేటీఆర్ మీద వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేస్తారా? కనీసం ఆయన వివరణ కూడా తీసుకోరా? కేటీఆర్ మీద ఈ స్థాయిలో విషం కక్కుతుంటే మేము ఎలా చూస్తుంటాం? కచ్చితంగా దాడులు చేస్తాం? ఈ కథనాలను ప్రసారం చేసిన వ్యక్తిని బయటకు పిలవండి? అతడికి మా చేతిలో ఉందంటూ” ఆ వ్యక్తి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మహా టీవీ అధినేతపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన ఆ వ్యక్తి చేతిలో తుపాకీ ఉందని సమాచారం . DBBL కంపెనీకి చెందిన రైఫిల్ ను అతడు తీసుకొచ్చాడని సోషల్ మీడియాలో కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అతడు రైఫిల్ పట్టుకున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..ఆ న్యూస్ కార్యాలయం పై దాడి చేసినప్పుడు అతడి చేతిలో తుపాకీ ఉందని.. ఆ సమయంలో కార్యాలయం లో పని చేసే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. నిరసన తెలుపుతున్నప్పుడు.. చేతిలో ఆయుధాలు ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. ఆయుధాలు చేత పట్టుకొని ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించడానికి వచ్చారని వారు మండిపడుతున్నారు.
ఒకవేళ కేటీఆర్ కు వ్యతిరేకంగా కథనాలు ప్రసారమైనప్పుడు.. దానిని న్యాయపరంగా ఎదుర్కోవాలి. లేదా సహేతుకమైన పద్ధతిలో నిరసన వ్యక్తం చేయాలి. కార్యాలయం ఎదుట శాంతియుతంగా ఆందోళన చేయాలి. అంతేతప్ప ఇలా ఆయుధాలు తీసుకొచ్చి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని మహా టీవీ యాజమాన్యం ప్రశ్నిస్తోంది. మరోవైపు మహా టీవీ కార్యాలయం పై దాడి చేసిన వ్యక్తులలో చాలామంది చేతిలో ఇనుప రాడ్లు ఉన్నాయి. రాళ్లు కూడా ఉన్నాయి. వారు దాడులు చేయడంతో మహా టీవీ కార్యాలయం మొత్తం ధ్వంసం అయింది. విలువైన సామగ్రి పగిలిపోయింది. కార్యాలయానికి సంబంధించిన అద్దాలు మొత్తం ధ్వంసమయ్యాయి..
జరిగిన ఘటనను తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఖండించారు. ఏపీలోని మంత్రులు, కూటమి నాయకులు కూడా విమర్శించారు. వ్యతిరేక కథనాలు మీడియాలో వచ్చినప్పుడు వాటికి కౌంటర్ అదే రూపంలో ఇవ్వాలని.. ఇలా హింసాయుత మార్గంలో దాడులు చేస్తే సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని వారు పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో గులాబీ పార్టీ నాయకులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా కథనాలను ప్రసారం చేస్తే ట్రీట్మెంట్ ఇలానే ఉంటుందని హెచ్చరిస్తున్నారు.