Mahaa Vamsi Vs KTR: రాజకీయాలలో నాయకుల మధ్య శత్రుత్వం ఉంటుంది. వెనకటి కాలంలో ప్రత్యర్థితత్వం ఉండేది కాని.. ఇప్పుడు రాజకీయాలు పార్టీలను దాటేసి వ్యక్తిగతంగా మారిపోయాయి కాబట్టి.. నాయకులు రాజకీయాలను వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. ప్రత్యర్థి తత్వాన్ని పక్కనపెట్టి శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు. అందువల్లే రాజకీయాలు అత్యంత కలుషితం అయిపోయాయి.
తెలుగు నాట రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. గతంలో ఇలా ఉండేవి కాదు. ఇటీవల కాలంలోనే ఈ మార్పులు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు వర్సెస్ మీడియా అధినేతలు అన్నట్టుగా తెలుగు నాట పాలిటిక్స్ నడుస్తున్నాయి. రాజకీయ నాయకులకు మీడియాతో సన్నిహిత సంబంధాలు ఉండటం.. కొందరు రాజకీయ నాయకులు మీడియా హౌస్ లను నడిపిస్తున్న నేపథ్యంలో.. రాజకీయాలు పొలిటికల్ లీడర్లు వర్సెస్ మీడియా అధినేతలు అన్నట్టుగా మారిపోయాయి. ఇక తెలుగు నాట మీడియా అధినేతలకు కూడా రాజకీయరంగులు ఉండడం రాజకీయ పార్టీలకు అంట కావడం వంటివి సర్వ సాధారణంగా మారిపోయాయి. తెలుగు నాట ఈ సంస్కృతి ఎక్కువగా ఉంది కాబట్టి రాజకీయాలను మీడియాను వేరుగా చూడలేని పరిస్థితి ఏర్పడింది.
Also Read: అల్లుడికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న మీడియా అధినేత.. ఇంతకీ ఏం జరుగుతోంది?
గతంలో భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఓ వర్గం మీడియా ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉండేది. ఆ పార్టీ నాయకులు చేసిన తప్పులను ప్రముఖంగా ప్రచురించేది. అదే స్థాయిలో ప్రసారం కూడా చేసేది. ఒకరకంగా ఆ వర్గం మీడియా చేసిన ప్రచారం వల్లే భారత రాష్ట్ర సమితి ఓటమిపాలైంది. అందువల్లే భారత రాష్ట్ర సమితి ప్రతిపక్ష పాత్రలోకి మారిపోయిన తర్వాత సోషల్ మీడియాను మరింత బలోపేతం చేసింది. అధికార పార్టీని తీవ్రస్థాయిలో విమర్శించడం మొదలుపెట్టింది. ముందుగానే చెప్పినట్టు భారత రాష్ట్ర సమితి నాయకత్వాన్ని వ్యతిరేకించే మీడియా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతమైన ఆక్టివ్ అయింది. ఇందులో భాగంగానే భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు చోటుచేసుకున్న అవకతవకలను వెలుగులోకి తేవడం మొదలుపెట్టింది. ఇది ఒక పరిధి వరకు ఉంటే బాగానే ఉండేది. ఎలాగూ ప్రభుత్వం అండగా ఉందని ఆ వర్గం మీడియా రెచ్చిపోవడంతో గులాబీ పార్టీ కార్యకర్తలకు మండుకొస్తోంది. అందువల్లే వారు దాడులకు తెగబడ్డారు. ఈ దాడులకు తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అన్నట్టుగా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం మొదలుపెట్టారు.
ఇక గులాబీ పార్టీ కార్యకర్తల చేతిలో దాడులకు గురైంది మహా టీవీ కార్యాలయం. మహా టీవీ టిడిపి అనుకూల ఛానల్ గా ముద్ర పడింది. ఆ టీవీ ఛానల్ అధినేత అధికారికంగానే టిడిపి అనుకూలంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. ఇటీవల కాలంలో టిడిపి అనుకూల వార్తలను ప్రసారం చేయడంలో ఆ ఛానల్ ఒక పరిధి కూడా దాటిపోయింది. అయితే ఇక్కడే కేటీఆర్ ను కూడా ఆ ఛానల్ అధినేత టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. అందువల్లే వివరణతో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా వార్తలను ప్రసారం చేస్తున్నారు. పైగా వాటికి పెట్టే శీర్షికలు కూడా అత్యంత దారుణంగా ఉన్నాయి. వాటిని యూట్యూబ్లో తెగ ప్రమోట్ చేయడంతో.. గులాబీ పార్టీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడులకు కూడా వెనకాడటం లేదు.
బహుశా కేటీఆర్ గతంలో చంద్రబాబు నాయుడు పై చేసిన విమర్శల వల్లే మహా టీవీ అధినేతకు ఆగ్రహం వచ్చి ఉండొచ్చని జర్నలిజం సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. అందువల్లే మహా వంశీ తనకు వీలు చిక్కినప్పుడల్లా కేటీఆర్ పై వ్యతిరేక కథనాలను ప్రసారం చేయిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఇటీవల ఆ చానల్లో కేటీఆర్ కు వ్యతిరేకంగా ప్రసారమైన కథనాలు కూడా ఈ కోవలోనివేనని పాత్రికేయులు వ్యాఖ్యానిస్తున్నారు. వీటిని చూసి జీర్ణించుకోలేక కేటీఆర్ అనుచరులు దాడులకు పాల్పడ్డారని వారు అంటున్నారు.. ఇప్పటికే కేటీఆర్ అంటే విపరీతమైన కోపంతో ఉన్న మహా వంశీ.. ఈ దాడి తర్వాత ఏం చేస్తారు? ఎలాంటి వార్తలను ప్రసారం చేస్తారు? వాటిని గులాబీ నాయకులు ఎలా స్వీకరిస్తారు? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.