Raj Pakala: రాజ్ పాకాల కేసు ఎలా ఉన్నా.. కేటీఆర్ దూకుడుకు స్పీడ్ బ్రేక్.. రేవంత్ రెడ్డికి చాలా రిలీఫ్..

ఏహే.. మీరు అనుకుంటున్నట్టుగా అక్కడ మాదకద్రవ్యాలు లేవు. ఏవో విదేశాల నుంచి మందు సీసాలు తెప్పించారు. ఫ్యామిలీ పార్టీ చేసుకుంటున్నారు. దానికోసమే ఇంత రాద్ధాంతం చేస్తారా.. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్..

Written By: Anabothula Bhaskar, Updated On : October 27, 2024 5:08 pm

Raj Pakala(1)

Follow us on

Raj Pakala: మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యవసాయ క్షేత్రంలో జరిగిన పార్టీకి సంబంధించి భారత రాష్ట్ర సమితి నాయకులు ఇస్తున్న వివరణ, చేస్తున్న ప్రతి విమర్శ ఇది. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఈ పార్టీ నిర్వహించారని.. పోలీసులు రాగానే వెనుక గోడ నుంచి దూకి పారిపోయాడని.. ఇందులో విజయ్ అనే వ్యక్తి శరీరం నుంచి నమూనాలు తీసుకుంటే.. అందులో మాదకద్రవ్యాల ఆనవాళ్లు లభించాయని పోలీసులు చెబుతున్నారు. ఇదే సమయంలో భారత రాష్ట్రపతి నాయకులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్న ఫోటోల్లో.. పోలీసుల పంచనామా పత్రం కనిపిస్తోంది. అందులో మాదకద్రవ్యాల ప్రస్తావనలేదని వారు అంటున్నారు. ఒకవేళ మాదకద్రవ్యాలు వాడకుండా ఉండి ఉంటే రాజ్ వెనుక గోడ నుంచి దూకి పారిపోవాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.. మాదకద్రవ్యాలతో పాటు, విదేశాల నుంచి పరిమితికి మించి దిగుమతి చేసుకున్న మద్యం, క్యాసినో పరికరాలు అక్కడ ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. పోలీసులు పక్కా సమాచారంతోనే అక్కడికి వెళ్లారని.. ఇంకా భారత రాష్ట్రసమితి నాయకులు బుకాయించడం దేనికని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. కేటీఆర్ కుటుంబంపై వచ్చే ప్రతి విమర్శను సమర్థవంతంగా తిప్పికొట్టే నమస్తే తెలంగాణ.. ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉంది అంటేనే “దాల్ మే కుచ్ కాలా హై” అనే సామెత గుర్తుకు వస్తోందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.. వాస్తవానికి అక్కడ విపరీతమైన శబ్దాలతో పార్టీ చేసుకుంటున్నారని.. చుట్టుపక్కల వాళ్లకు ఇబ్బంది కలగడం వల్లే పోలీసులకు ఫిర్యాదు చేశారని.. అందువల్లే పోలీసులు దాడులు చేసి పార్టీలో పాల్గొన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

రేవంత్ రెడ్డికి ఉపశమనం

గత కొద్దిరోజులుగా తెలంగాణలో వరుస సంఘటనలు జరుగుతున్నాయి. హైడ్రా కూల్చివేతలు కొద్ది రోజులు హడావిడి సృష్టించగా.. ఆ తర్వాత రైతుల రుణమాఫీ.. గురుకులాలకు తాళం.. బెటాలియన్ పోలీసుల ధర్నా.. ఇలాంటి వివాదాలతో అధికార కాంగ్రెస్ పార్టీకి భారత రాష్ట్ర సమితి ఇబ్బంది కలిగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక రూపంలో నిరసన చేపడుతోంది. దీనికి కేటీఆర్ నాయకత్వం వహిస్తున్నారు. తనకున్న బలమైన సోషల్ మీడియా విభాగం ద్వారా కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెడుతున్నారు. ఇది సహజంగానే అధికార పార్టీకి ఇబ్బందిగా మారింది. అయితే ఇలాంటి సమయంలో కేటీఆర్ బావమరిది రాజ్ వ్యవహారం తెరపైకి రావడంతో అధికార పార్టీకి కాస్త ఉపశమనం లభించింది. దీంతో ఉదయం నుంచి సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతోంది. అటు కాంగ్రెస్, ఇటు భారత రాష్ట్ర సమితి పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. అయితే ఈ వివాదంలో ఇప్పటివరకు నమస్తే తెలంగాణ ఒక్క వార్త కూడా ప్రచురించకపోవడం.. వెబ్ సైట్ లోనూ స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదే సమయంలో భారత రాష్ట్ర సమితికి అనుకూలంగా వ్యవహరించే కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులు, ట్విట్టర్ హ్యాండ్లర్స్ మాత్రం కేటీఆర్ బావమరిదికి అనుకూలంగా మాట్లాడడం విశేషం.