Hydra: రెండు నెలల క్రితం ఏర్పాటైన హైడ్రా అక్రమ నిర్మాణాల పట్ల దూకుడుగా వ్యవహరిస్తోంది. ఎక్కడ అక్రమ నిర్మాణాలు ఉంటే అక్కడకు వెళ్లి వాటిని నేలమట్టం చేస్తోంది. దీంతో ఇప్పుడు హైడ్రా అంటేనే అందరికీ హడల్ పుడుతోంది. ముఖ్యంగా చెరువులు, కుంటల పరిధిలో నిర్మించిన వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎప్పుడు ఎవరికి హైడ్రా నుంచి నోటీసులు వస్తాయా..? ఎప్పుడు ఏ అధికారి వచ్చి ఇంటికి మార్కింగ్ చేస్తారా అన్న ఉత్కంఠతో చూస్తున్నారు. హైడ్రా దూకుడుపై కొన్ని ప్రశంసలు వస్తుంటే.. మరికొన్ని విమర్శలు సైతం వస్తున్నాయి.
ఒకప్పుడు పలువురు రియల్టర్లు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో భూములను కబ్జాలు చేసి అధికారుల నుంచి నామమాత్రంగా పర్మిషన్లు తీసుకొని ఇళ్లను నిర్మించారు. వాటిని మధ్య తరగతి కుటుంబాలు కొనుగోలు చేశాయి. తక్కువ ధరలో వస్తున్నాయని కొందరు కొనుగోలు చేయగా.. మరికొందరేమో ప్రైమ్ లొకేషన్ అంటూ కొనుగోలు చేశారు. అయితే.. ఇప్పుడు వాటన్నింటినీ అక్రమ కట్టాలంటూ హైడ్రా కూల్చివేస్తూ వస్తోంది. దాంతో కోట్లు పెట్టి బిల్డింగులు కొన్న వారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. కళ్లముందే జీవిత కష్టార్జితం కూలుతుంటే భరించలేకపోతున్నారు. రోదిస్తూ ఆవేదన చెందుతున్నారు. ఇప్పటివరకు ఎక్కడా తగ్గకుండా.. ప్రభుత్వం ఆదేశాలను పాటిస్తూ ముందుకు సాగిన హైడ్రా ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంది. ఈ రోజు చేపట్టాల్సిన కూల్చివేతలకు బ్రేక్ వేసింది.
తమకు న్యాయం జరిగేలా చూడాలంటే ఇప్పటికే మూసీ నిర్వాసితులు ఆందోళనలు చేస్తున్నారు. తమను నిరాశ్రయులను చేయొద్దంటూ వేడుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆశ్రయించారు. దాంతో హైడ్రా ఉద్యమానికి మరింత ఊపందుకోనుంది. మూసీ పరీవాహక ప్రాంతాన్ని ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. ఈ క్రమంలో అక్కడ పెద్ద పెద్ద భవంతులు నిర్మించాలని నిర్ణయానికి వచ్చింది. అలాగే.. టూరిజం హబ్ గానూ తీర్చిదిద్దాలని భావించింది. దాంతో మూసీ పరిధిలోని కట్టడాలను కూల్చివేయాలని హైడ్రాను ఆదేశించింది. ఇప్పుడు అది కాస్త తీవ్ర రచ్చకు దారితీసింది.
ఇక్కడి ఆక్రమణలను తొలగించేందుకు ఇప్పటికే రెవెన్యూ అధికారులు ఇళ్లకు మార్కింగ్ చేశారు. కూల్చివేతలకు అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. ఈ రోజు నుంచి కూల్చివేతలు ప్రారంభించేందుకు కూడా సిద్ధమయ్యారు. కానీ.. మూసీ నిర్వాసితులు ఆందోళనలు చేపట్టడం, అటు బీఆర్ఎస్ నేతలను కలవడంతో వెనక్కి తగ్గింది. ఇప్పటికే వారు లంగర్ హౌస్ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. తాజాగా తెలంగాణ భవన్‌కు వెళ్లి అక్కడ మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డితో భేటీ అయ్యారు. తమ ఆవేదనను చెప్పుకున్నారు. పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి కన్నీరు పెట్టారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లకు మార్కింగ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అభివృద్ధి అంటే పేదల ఇళ్లు కూల్చడమేనా అని ప్రశ్నించారు.
బాధితుల ఆవేదన బీఆర్ఎస్ స్పందించారు. హరీశ్, సబితా బాధితులతో మాట్లాడారు. వారి తరఫున పోరాడేందుకు సిద్ధమని భరోసా ఇచ్చారు. మూసీలో గోదావరి నీరు పారిస్తానని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గోదావరి నీటికి బదులు పేదల రక్తం, కన్నీరు పారించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని దుయ్యబట్టారు. మూసీ బాధితుల కోసం 24 గంటలూ తెలంగాణ భవన్‌లో అందుబాటులో ఉంటామని, అందరం కలిసి మూసీ నిర్వాసితులకు రక్షణ కవచంలా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజుకి హైడ్రా కూల్చివేతలను నిలిపివేసినప్పటికీ రేపటి నుంచి ఏం జరగనుందా అనే ఉత్కంఠ వాతావరణం కనిపిస్తోంది. అటు బీఆర్ఎస్ నేతలు సైతం హైడ్రా, మూసీ నిర్వాసితుల పట్ల ఎలా స్పందించారో చూడాలి మరి!
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: What will happen to brs for all the victims of hydra
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com