MLC Kavitha: నిజానికి కవితకు బెయిల్ రావడం అనేది పెద్ద సంచలనం కాదు. దేశోద్ధారక కారణం కాదు. సమాజ్యోద్దారక వ్యవహారం అంతకన్నా కాదు. పోరాడింది, న్యాయం గెలిచింది, ధీరవనిత అనే స్థాయిలో పింక్ మీడియా ప్రొజెక్ట్ దర్జాగా ప్రచారం చేస్తోంది. స్వాతంత్ర్య సమరంలో తన ప్రాణాలకు తెగించి పోరాడిన ఒక మహిళ లాగా గొప్పలు పోతుంది. పిడికిలి బిగించి జై తెలంగాణ అని చేసిన నినాదాలను సోషల్ మీడియాలో రీల్స్ లాగా ప్రసారం చేస్తోంది.. కానీ ఇక్కడ భారత రాష్ట్ర సమితి శిబిరానికి అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి.. కవిత జైలుకు వెళ్ళింది అనైతిక సారా దందా చేసి.. జైలులో నెలల కోద్దీ బంధీగా మారింది. బెయిల్ రాగానే సమర ధీరురాలు అయిపోయింది. ఇక భారత రాష్ట్ర సమితి శిబిరం ఘన స్వాగతం, సత్కారం, భారీ మాలలతో ఊరేగింపులు.. ఇవన్నీ గట్రా చూస్తుంటే తెలంగాణ సమాజంలోకి అవి మరింత వ్యతిరేకంగా వెళ్తున్నాయి. మరింత బద్నాం అయ్యే సంకేతాలు ప్రబలంగా కనిపిస్తున్నాయి.. ఇదే దశలో పులు కడిగిన ముత్యం, ధీరవనిత, ఉక్కు చరిత వంటి వ్యాఖ్యలైతే భారత రాష్ట్ర సమితికి కౌంటర్ ప్రొడక్ట్స్ అవుతున్నాయి..
బెయిల్ కోసం చాలా రోజులు తిరిగారు
కవిత బెయిల్ కోసం చాలా రోజులుగా కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో తిరిగారు. ఒకప్పుడు వీరిద్దరూ మోడీని ఇష్టానుసారంగా విమర్శించారు. హైదరాబాద్ వచ్చినప్పుడు బద్నాం చేశారు. మొయినాబాద్ చిల్లర డ్రామా కూడా నడిపారు. ఏకంగా బిజెపి ముఖ్య కార్యదర్శిని అరెస్టు చేయించేందుకు స్కెచ్ వేశారు. ప్రత్యేక బృందాలను పంపించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. సిట్ ను ఏర్పాటుచేసి, ఏదో హంగామా చేయబోయారు. చివరికి బోల్తా పడ్డారు. భంగపడి తలవంచారు. ఏ నోటితోనైతే బిజెపిని తిట్టారో.. అదే నోటితో మాఫ్ కీజియే అని తల వంచారు. ఇదే సమయంలో బిజెపి ముందు కేసిఆర్ సాష్టాంగ పడిన తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.
ప్రాతిపదిక లేదు
పింక్ పార్టీ నాయకులు ఒప్పుకోక పోవచ్చు గాక.. కాని భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీతో ఒప్పందం కుదుర్చుకుందని.. అందువల్లే కవితకు బెయిల్ వచ్చిందనే వాదనలు లేకపోలేదు. అయితే ఇక్కడ రాజకీయ ఒప్పందాలకు, కోర్టు ద్వారా వచ్చే బెయిల్ కు ప్రాతిపదిక ఏమిటి అనే ప్రశ్న తలెత్తవచ్చు.. మనిష్ సిసోడియాకు కూడా బెయిల్ వచ్చింది కదా అనే వ్యాఖ్య కూడా వినిపించవచ్చు.. ఢిల్లీ ముఖ్యమంత్రి ఇంకా కారాగారంలోనే ఉన్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెత్తి మాసిన వ్యూహాలకు, పసలేని విధానాలకు ఇవి మచ్చుతునకలు. ఉదాహరణకు 2 జీ స్పెక్ట్రమ్ కేసులో కనిమొళిని, రాజాను బయటికి రాకుండా చేయవచ్చు. సనాతన ధర్మాన్ని వాళ్లు విమర్శిస్తున్నప్పటికీ మోడీ అలా క్షమించేస్తూ ఉంటాడు. వీరు మాత్రమే కాదు మమత పై మమతా అనురాగం కురిపిస్తుంటాడు. ఇష్టానుసారంగా మాట్లాడిన చంద్రబాబును క్షమించేశాడు. చివరికి గుండెలకు హత్తుకున్నాడు. ఇలాంటి రాజకీయాలు బిజెపికే కాదు, దాని మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు కూడా అంతు చిక్కడం లేదు. ఈ ఒప్పంద విషయంలో తెలంగాణ బిజెపి నాయకులు కప్పదాట్లకు పాల్పడుతుంటారు. కవితకు బెయిల్ రావడానికి కాంగ్రెస్ లాయర్లు కృషి చేశారని బండి సంజయ్ లాంటి వాళ్ళు అంటుంటారు.. మరోవైపు కేటీఆర్ లాంటి వాళ్ళేమో.. మాటలు జాగ్రత్త అంటూ హెచ్చరిస్తుంటారు.. ఇది వెబ్ సిరీస్ కు మించిన పెద్ద డ్రామా.
రేవంత్ కు అనుకోని అదృష్టం
వాస్తవానికి ఇవన్నీ పరిణామాలు రేవంత్ రెడ్డికి అనుకోని అదృష్టం లాగా పరిణమిస్తున్నాయి. “బిజెపికి గతంలో కంటే ఎక్కువ సీట్లు లభించేలాగా భారత రాష్ట్ర సమితి తెరవెనుక ఒప్పందం కుదుర్చుకుంది. అందువల్లే కొన్ని సీట్లను బిజెపి ఖాతాలో వేయబోతోంది” పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలివి. వాటికి మరింత బూస్ట్ ఇచ్చేలాగా.. భారత రాష్ట్ర సమితి తో భారతీయ జనతా పార్టీ ఒప్పందం కుదుర్చుకోవడం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని రేవంత్ మరింత హై స్పీడ్ లో ప్రచారం చేస్తాడు. తన అనుకూల మీడియా ద్వారా జనంలోకి గట్టిగా వెళ్లేలా చేస్తాడు..
ఇంకా ఆమె నిర్దోషిగా బయటికి రాలేదు
తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి ఒప్పందం భారతీయ జనతా పార్టీకి తీవ్రమైన నష్టం. కాకపోతే ఈ విషయం హై కమాండ్ కు పెద్దగా తెలిసినట్టు లేదు.. ఇలాంటి వ్యవహారం గురించి తెలుసో, తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారో, తెలియదు గాని.. భారతీయ జనతా పార్టీ నాయకులు మాత్రం కవితను, కేటీఆర్ ను ఎట్టి పరిస్థితుల్లో మా పార్టీలోకి రానివ్వమని చెబుతుంటారు.. కానీ ఇవేవీ లేకుండానే కవిత బెయిల్ ద్వారా బయటికి వచ్చింది.. కానీ ఇక్కడ తెల్ల మొహాలు వేయాల్సింది బిజెపి నాయకులే. భారత రాష్ట్ర సమితి నాయకులు చెబుతున్నట్టుగా.. ఈరోజు న్యాయం గెలవలేదు. ఇప్పటికీ ఆమె నిందితురాలే. ఇంకా ఆమె నిర్దోషిగా బయటికి రాలేదు.
రాజకీయ వారసురాలు కవిత ఎన్నటికీ కాదు
ఇక ఇన్ని పరిణామాల మధ్య.. కెసిఆర్ రాజకీయ వారసుడు ఎవరు అనే చర్చ కూడా నడుస్తోంది. జైలు నుంచి బెయిల్ మీద బయటికి వచ్చిన తర్వాత మాత్రాన కవిత కెసిఆర్ రాజకీయ వారసురాలు కాలేదు, కాబోదు. ఆమె భారత జాగృతి, ఇంకా ఏవో కార్యక్రమాలు చేసుకుంటూ తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవాల్సిందే తప్ప.. సమాంతర శక్తిగా ఎదిగే అవకాశం లేదు. ఇక ఈ జాబితాలో హరీష్ రావు కూడా అంతే. మహా అయితే మరో షిండే కాగలడు.. అంతే, అంతకుమించి ఏమీ లేదు.. పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా స్టాలిన్ కొనసాగుతున్నారు. ఆయన రాజకీయ వారసుడిగా ఉదయనిధి స్టాలిన్ మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లోనూ సోదరి కమిమొళి అయ్యేందుకు అవకాశం లేదు, ఆస్కారం అంతకన్నా లేదు.