Mahalaya Amavasya 2022: ప్రకృతిలో పూచే పువ్వులను కొలిచే అరుదైన పండుగ బతుకమ్మ. తెలంగాణలో భాద్రపద అమావాస్య లేదా మహాలయ అమావాస్య నాడు ఈ పండుగ ప్రారంభమవుతుంది. తొమ్మిది రోజులపాటు మహిళలు ఎంతో నిష్టగా పువ్వులను పేర్చి, బతుకమ్మకు పూజలు చేసి.. చెరువు గట్ల వద్ద గౌరమ్మ చుట్టూ బతుకమ్మలను ఉంచి పాటలు పాడుతూ సందడి చేస్తారు. అనంతరం వాటిని స్థానికంగా ఉన్న చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. కానీ మహాలయ అమావాస్య లో అమావాస్య ఉన్నప్పటికీ ఎంతో ప్రీతిపాత్రమైనదని పండితులు చెబుతుంటారు. ఈ రోజున తమ పూర్వికులకు లేదా తల్లిదండ్రులకు పితృ దోషాల నుంచి రుణ విమోచనం కలిగించేందుకు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. కుటుంబ సమస్యలు, ఉద్యోగ, సమస్యల నివారణకు, పెళ్లీడుకొచ్చిన పిల్లలకు వివాహ సంబంధాలు కుదరకపోవడం, ఇంట్లో తరచూ ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్యలు రావడం, ఆర్థిక బాధలు, సంతానలేమి లేదా సంతాన సమస్యలు, దాంపత్య సమస్యలు, కోర్టు కేసులు, ఏది చేసినా కలిసి రాకపోవడం.. వంటి వాటి నివారణ కోసం మహాలయ అమావాస్య రోజు పితృదేవతల ఆరాధన చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు. మానవుడు పితృకర్మలను శాస్త్ర విధి విధానాలతో చేయలేని వారికి, ఆచరించని వారికి అవి పితృ కర్మ దోషాలుగా వర్తించి అనేక అనేక సమస్యలను సృష్టిస్తాయని శాస్త్రం చెబుతోంది.

మానవులే కాదు.. దేవతలకు కూడా
మనుషులే కాకుండా దేవుళ్ళు కూడా తమ అభీష్టాల కోసం పితృదేవతలను ఆరాధిస్తారు. శ్రాద్ధ కర్మల చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని తెలుస్తోంది. ఈ మహాలయ అమావాస్యనాడు శ్రాద్ధ కర్మలు వదలటం అత్యంత విశేషం. కొందరు తిధి ప్రకారం చేస్తారు. కానీ మహాలయ అమావాస్య నాడు తర్పణం శ్రాద్ధం చేసి తీరాల్సిందే.
స్వయంపాకంలో ఇవి పాటించాలి
ఎంత శ్రాద్ధ కర్మలు చేసిననూ.. జిహ్వను సంతృప్తి పరచకపోతే పూర్తిస్థాయిలో పుణ్యం దక్కదు. అందుకే పుణ్యం పురుషార్ధం అంటారు. ఈరోజు స్వయంపాకం ఇవ్వాలనుకునేవారు నాణ్యమైన బియ్యం, కూరగాయలు దానంగా ఇవ్వాలి. లేదా స్వయంగా వండి బ్రాహ్మణులకు లేదా నిరుపేదల కడుపు నింపాలి. గోమాతకు నువ్వులు, కలిపి పెట్టాలి. శని దేవుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఆంజనేయ స్వామి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి తమలపాకులతో అభిషేకించాలి. ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే గతించిన కుటుంబ సభ్యులకు ఇష్టమైన ఆహార పదార్థాలను వండి వారికి నైవేద్యం పెట్టాలి. ఆ నైవేద్యాన్ని మిగిలిన కుటుంబ సభ్యులు పూజించాలి.

ముఖ్యంగా వాటిని ఆకలితో అలమటిస్తున్న కడు పేదలకు, అనాధలకు, నిర్భాగ్యులకు పంచిపెడితే పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో శ్రాద్ధ కర్మలు నిర్వహించడం ఆనవాయితీ. ఒక్కోచోట ఒక్కో తిధినాడు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. కానీ తెలంగాణలో మహాలయ అమావాస్య నాడే ఈ కార్యక్రమం చేపడతారు. కొన్నిచోట్ల బ్రాహ్మణులకు లేదా దేవాలయాలకు గోవులను దానంగా ఇస్తారు. ఎంత చేసినా, ఏం చేసినా పూర్వీకుల అంశగా మనం ఉన్నాం కాబట్టి.. వారిని తలచుకోవడం, శ్రాద్ధ కర్మలు నిర్వహించడం మన విధి. అందుకే పున్నామ నరకం నుంచి తల్లిదండ్రులను తప్పించేవాడే పుత్రుడు అనే సామెత పుట్టింది.