Tollywood: అధికారం కోసం రాజకీయ పార్టీలు ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాయి. ఇలాంటి హామీలైనా ఇస్తాయి. ఎలాంటి అవకాశం లభించినా వెంటనే తమకు అనుకూలంగా మార్చుకుంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి మధ్య ఉప్పు నిప్పులాగా వ్యవహారం ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి నాయకులు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. ప్రతి విమర్శలు చేస్తున్నారు. దీంతో ఎన్నికల కాలంనాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవి ఎంత వరకు దారి తీస్తాయో తెలియదు కాని.. ప్రస్తుతానికైతే పరిస్థితి బాగోలేదు. ఇక ముందు బాగుపడుతుందని అంచనా కూడా లేదు. పుష్ప వివాదంలోకి రాజకీయ పార్టీలు ఎంట్రీ ఇవ్వడంతో.. ఒక్కసారిగా అది జటిలంగా మారింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ కు మద్దతుగా భారత రాష్ట్ర సమితి, వైఎస్ఆర్సిపి రంగంలోకి వచ్చాయి. వాటి సోషల్ మీడియా విభాగాలలో అల్లు అర్జున్ కు సంఘీభావం ప్రకటించాయి. ఈ విషయం గురించి తెలుసో, తెలియదో గాని.. అల్లు అర్జున్ ఆ పార్టీల ట్రాప్ లో పడ్డారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. అందువల్లే ఆయన టార్గెట్ అయిపోయారని.. తన సినీ కెరియర్లో ఎన్నడూ అనుభవించని ఒత్తిడిని చవిచూస్తున్నారని తెలుస్తోంది. పరిస్థితి కూడా ఆయన చేతుల నుంచి దాటిపోయింది. ఆయన భవిష్యత్తు ఏంటో తెలియదు కానీ.. రాజకీయ పార్టీలు ఆయనను వాడుకుంటున్నాయి. తమ ప్రాపకం కోసం అల్లు అర్జున్ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నాయి.
పావుగా టాలీవుడ్
సంధ్య థియేటర్ లో తొక్కిసలాట జరిగిన తర్వాత పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అల్లు అర్జున్ పావుగా వాడుకునేందుకు కొన్ని పార్టీలు రాజకీయం మొదలుపెట్టాయి. టాలీవుడ్ మొత్తం గా కలిసి ప్రభుత్వంపై ఈదురు దాటికి దిగాలని సలహాలిస్తున్నాయి. తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఈ విధమైన ప్రచారం చేస్తున్నాయి. ” మొన్న నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చేశారు. నిన్న ఏదో ఘటన సాకు గా చూపి అల్లు అర్జున్ ను ఇబ్బంది పెడుతున్నారు. రేపటి నాడు జరిగేది మీకే.. అందు గురించే జాగ్రత్తపడండి” అంటూ కొన్ని రాజకీయ పార్టీలు పిలుపునిస్తున్నాయి.. వాస్తవానికి టాలీవుడ్ అనేది రంగుల పరిశ్రమ. అది ఒక అద్దాల మేడ లాంటిది. ఎవరినైనా రెచ్చగొడితే.. వారు అదే కోపంలో రాళ్లు వేస్తే కచ్చితంగా పగిలేది టాలీవుడ్ రంగుల మేడనే. అందువల్లే సినీ ప్రముఖులు నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు.. కానీ రాజకీయ పార్టీలు ఊరుకోవు కదా. టాలీవుడ్ ను రోడ్డుమీద లాగడానికి కొన్ని పార్టీలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన మేళ్లను గుర్తుకు తెచ్చుకొని.. ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం పై ఎదురు దాడికి దిగాలని పిలుపునిస్తున్నాయి. అయితే నాటి ప్రభుత్వ పెద్దలతో అంట కాగిన వారు మొత్తం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎవరైనా నిరసన స్వరం వినిపిస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో వారికి తెలుసు. రేవంత్ రెడ్డి ఏం చేస్తారో కూడా తెలుసు. అందువల్లే తెలుగు చిత్ర పరిశ్రమ నిశ్శబ్దంగా ఉంటున్నది. అటు ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ఒత్తిడి నుంచి.. అధికార పార్టీ కన్నెర్ర నుంచి తట్టుకోలేక.. మౌనంగా ఉండిపోతున్నది.