Agitation Of These Farmers In CM Revanth: వికారాబాద్ జిల్లాలో లగచర్ల ఒక్కసారి వార్తల్లో నిలిచింది. లగచర్లలో అభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులపై గ్రామస్తులు ఒక్కసారిగా దాడులకు పాల్పడడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కలెక్టర్‌తోపాటు అధికారులపై దాడులు చేశారు. రైతుల ఆగ్రహాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే కలెక్టర్‌ను, అడిషనల్ కలెక్టర్లను అక్కడి నుంచి పంపించేశారు. కానీ.. కొందరు రైతులు మాత్రం కలెక్టర్ వాహనాన్ని వెంబడించి రాళ్లతో దాడులు చేశారు. దాంతో వాహనం అద్దాలు పగిలిపోయాయి. దీంతో ఆ గ్రామంలో అదనపు బలగాలను దించాల్సి వచ్చింది. ఒక్కసారిగా అక్కడ ఈ పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి..? అధికారులపై దాడి చేయడానికి గల కారణాలేంటి..? ఒకసారి తెలుసుకుందాం.
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి, పులిచెర్లతండా, రోటిబండ తండాల్లో 1,358 ఎకరాల భూమిని సేకరించాలని అనుకుంది. ఇందుకోసం గత ఐదు నెలల క్రితం ముందడుగు వేసింది. ఇందులో 547 ఎకరాలు అసైన్డ్ భూమి, 90 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. మరో 721 ఎకరాల పట్టా భూమి ఉంది. సుమారు 800 మంది రైతులకు చెందిన ఈ భూమి ఇస్తే వారంతా భూములు కోల్పోతారు. అయితే.. వారంతా పేద రైతులే.. అందులోనూ గిరిజనులు. ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటేనే తప్ప వారికి జీవనం లేదని వారు మొదటి నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు భూములు ఇచ్చేందుకు అంగీకరించారని అధికారులు చెప్పినప్పటికీ.. చాలా వరకు వ్యతిరేకిస్తున్నారు. ఫార్మా కంపెనీలను అనుమతించబోమంటూ ఇప్పటికే నిరసనలు తెలిపారు. నిరాహార దీక్షలు సైతం చేస్తున్నారు.
కానీ.. వీరి ఆందోళనలు పట్టించుకోని ప్రభుత్వం భూ సేకరరణపై ముందుకు వెళ్తుండడం అక్కడి రైతులను ఆగ్రహానికి గురిచేసింది. మరోవైపు.. రైతులకు ప్రభుత్వం తరఫున ఇస్తామన్న పరిహారంపై కూడా వివాదం నెలకొంది. భూములు ఇస్తున్నందుకు ప్రభుత్వం తరఫున ఎకరాకు రూ.10 లక్షలు.. ఇంట్లో ఒకరికి ఉద్యోగం.. ఒక్కో ఎకరానికి 125 గజాల ప్లాటుతోపాటు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పింది. అయినప్పటికీ ఆ గిరిజనులు అంగీకరించడం లేదు. సోమవారం భూసేకరణ ప్రక్రియలో భాగంగా గ్రామసభ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. భూములు తీసుకునే లగచర్లలో కాకుండా రెండు కిలోమీటర్ల దూరంలోని దుద్యాల-హకీంపేట్ మార్గం ఈ సభ నిర్వహించారు. దీనిని వ్యతిరేకించిన నిర్వాసితులు తమ గ్రామంలోనే గ్రామ సభ నిర్వహించాలని పట్టుబట్టారు. దీనిపై స్పందించిన కలెక్టర్.. లగచర్లలోనే గ్రామ సభ నిర్వహిద్దామని అక్కడికి బయలుదేరారు. అధికారులు అక్కడికి చేరుకోగానే గ్రామస్తులు భూసేకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని కలెక్టర్, ఇతర అధికారులు సముదాయించేందుకు ప్రయత్నించారు. కానీ కొందరు గ్రామస్తులు వినలేదు. దాంతో ఈ ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. అయితే.. ఇక్కడ 200 మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. లగచర్ల గ్రామానికి అధికారులు వెళ్తున్నప్పుడు వికారాబాద్ డీఎస్పీ మినహా మిగితా పోలీసులెవరూ వెంట వెళ్లలేదు. నిఘా వ్యవస్థ, పోలీసుల వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.