YS Sharmila : కమాన్! కాసేపు అసహ్యించుకుందాం!

షర్మిలను కోర్టు తీర్పులు ఉల్లంఘించి మరీ మగ పోలీసులు (తర్వాత ఆడపోలీసులు రాక) అడ్డుకోవడం దేనికి? ఆమె గానీ, ఆమె తల్లిగానీ పోలీసులని కొట్టారనీ, చంప చెల్లుమనిపించారనీ, చేయి చేసుకున్నారనీ న్యూస్ చానెల్స్ హెడ్డింగులతో వార్తలు వండాయి

Written By: NARESH, Updated On : April 27, 2023 10:05 am
Follow us on

YS Sharmila : వైఎస్ షర్మిల మీద.. ఆమె తల్లిమీద రాసిన ప్రతివ్యక్తి ప్రధానంగా ప్రాంతీయత, పార్టీ, జెండర్, వ్యక్తిగత అసమర్థత, సంప్రదాయికత, కులం వంటి విషయాల మీద.. లోపల పేరుకుపోయిన తమలో దాగిన అక్కసును వెళ్లబోసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆమె ఏం చేశారో రాశారే గానీ ఎందువల్ల ఆమె చేశారో ఒక్కరూ రాయలేదు, ఆమె చేసిన ప్రతిస్పందనే చూశారుగానీ, అంతకుముందు స్పందన చూడలేదు.

నిజానికి నిరుద్యోగుల జీవితాలకి సంబంధించిన పరీక్ష పేపరు లీకేజీలో భాగంగా సిట్ కార్యాలయానికి ఆమె కొన్ని డాక్యుమెంట్లు ఇవ్వడానికి ఒంటరిగా బయలుదేరారు. నోటిసులిచ్చినా బయటకు రాని ఆరోపణలు చేసిన నేతలున్న పరిస్తితిలో ఆమె స్వయంగా ఆధారాలు సమర్పించడానికి బయలు దేరారు. నిజానికి పేపర్ లీకేజీ విషయంలో ఆరెస్ ప్రవీణ్‌కుమార్ కూడా ఈ విషయంలో తప్పుగా మాట్లాడారు!

అలాంటి షర్మిలను కోర్టు తీర్పులు ఉల్లంఘించి మరీ మగ పోలీసులు (తర్వాత ఆడపోలీసులు రాక) అడ్డుకోవడం దేనికి? ఆమె గానీ, ఆమె తల్లిగానీ పోలీసులని కొట్టారనీ, చంప చెల్లుమనిపించారనీ, చేయి చేసుకున్నారనీ న్యూస్ చానెల్స్ హెడ్డింగులతో వార్తలు వండాయి. కానీ వాళ్లు ఎక్కడా కొట్టలేదు, తోసుకుని ముందుకు పోయారు, పట్టుకోవడనికి రాకుండా విదిలించికొట్టారు. మరెందుకు అలా ప్రచారం చేయడం?

పక్కరాష్ట్రం వ్యక్తికి ఇక్కడేం పని అనేవాళ్లంతా ఆవుల శ్రీనివాసరావు, యండమూరి వీరేంద్రనాథ్ టైపు. ఈ దేశంలో మేం తన్నించుకుంటాం, మీరెవరు మా విషయాల్లో చెప్పడానికి అని మోడీని వెనకేసుకొచ్చిన సచిన్ టెండూల్కర్ బ్యాచ్ అన్నమాట. అది జాతీయవాదం అయితే ఇది అంతకన్నా మురిగిపోయిన ప్రాంతీయవాదం ఇదీ.

ఇక పార్టీ జనం. వీళ్లలో ప్రాంతీయవాదమూ వుంటుంది. జాగ్రత్తగా గమనిస్తే ఇదే ప్రాంతానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన కేసీయార్ బీఆరెఎస్ నిర్మిస్తే జేజేలు కొట్టి పక్క రాష్ట్రాలలో జైత్రయాత్రకు హారతులిచ్చి పంపి వుంటారు, కానీ తమ ప్రాంతానికి ఇతరులు వచ్చినప్పుడు మాత్రం పరాయి ప్రాంతం, ఇతర ప్రాంత పెత్తనం గుర్తొస్తాయి.

ప్రతి తప్పుకూ రాళ్లతో కొట్టిచంపమని గుంపులో నిలబడి కేకలేసి తమ ఉన్మాదాన్ని, హింసోన్మాదాన్ని సంతృప్తి పరచుకునే వర్గం ప్రతిచోటా కనిపించినట్లు, ఆడది కనిపిస్తే, కొంచెం ధైర్యంగా నిలబడితే చాలు వెంటనే పడగకగదికి తీసుకెళ్లి దుస్తులు లాగేసినట్లు వూహించి సంతృప్తి పడే జనం వుంటారు.

ఇక ఇటుపక్క రాష్ట్రంలో ఆమె సోదరుడు, కొడుకు అధికారంలో వుండడం వల్ల, రాజకీయాలు అనేవి హత్యలు చేసి మరీ సాధించుకోవడానికి అవకాశం లేక అక్షరాల కత్తులు దించాలనుకునే వర్గం కూడా వుంది. దీనికి కులం అదనపు అద్దకం. వీళ్లకు కుటుంబం మొత్తం తుదముట్టించాలనే కసి, కక్ష ఉంది. అందుకే ఈ వివక్షపు రాతలు..

అసలు వీళ్లకు ఎందుకు ఈ వీధిపోరాటాలు అనే బాపతు కూడా వుంది. సంధ్య, పద్మ వంటివారి మీద రోజూ రాసేవాళ్లే ఇలాంటివాళ్లు. కొంపలో కూర్చొనకుండా వీధిలో పడ్డారు వీళ్లు అనుకునే బాపతు. మగవాళ్లే చేయాలి, సంస్కరించినా, అవినీతిచేసినా మగవాళ్లే చేయాలనే పురుష దురహంకారమిది, ఇది పురుషుల్లోనేకాదు, స్త్రీలలోనూ వుంటుంది.

తాము చేయలేని పని మరొకరు చేస్తే ఏర్పడే అసమర్థుల అసూయ. తమకంత సాహసం చేసే ధైర్యం వుండదు, సమయమూ దొరకదు, తమకన్నా ముందుకు పోయేవాళ్ల పట్ల చేతగానివాళ్ల అసూయతనం.

నిజానికి షర్మిలను పోలీసులు అడ్డుకోవాల్సిన అవసరంగానీ, సంఘటనకు అంత ప్రచుర్యం ఇవ్వడం గానీ అవసరం లేదు, కానీ స్వయంగా అధికారపార్టీ అమెని ప్రత్యర్థిగా ఎదగడానికి ప్రయత్నిస్తుందేమో కూడా గమనించలేని అమాయకత్వం కొందరిదైతే, పార్టీ ఎత్తుగడని మోసే అవసర్థత మరికొందరిది!

చిత్రమేమంటే ఎన్నోసార్లు ఉద్యమాల్లో పోలీసులని తిట్టిపోయే జనం, రోడ్డుమీద చలానా రాసినా తిట్టే జనం అదే పోలీసులమీద పెల్లుభికిన జాలి, దయ, ప్రేమ, అభిమానం! తమ ఉద్యోగాలు అమ్ముడుపోయినా, రాసే పరీక్షలు రద్దయినా సరేగానీ వాటికోసం పోరాటం అవసరంలేదనే త్యాగం మరపురానివి.

కొంతమంది హుందాగా కూడా తమలోని ద్వేషాల్ని వెల్గ గక్కారు. సందర్భం లేకుండా భర్త మతప్రచారపు మాటల్ని గుర్తుచేశారు. మరికొందరు ఆమె తండ్రి మీద ఎన్నడూ లేని ప్రేమ వొలకబోసే సాకుతో వీళ్లమీద పైత్యం చూపారు. పక్కరాష్ట్రంలోని సోదరుని వద్దకు వెళ్ళి పోరాడమని సుద్దులు పలికారు. అంతా తామే పాలించాలనే ఆశపోతు తనమని తమ విశాలత్వాన్ని ప్రదర్శించారు.

రాజకీయాలు ఇలాగే చేయాలనే నిబంధనల పుస్తకాల్లో  చదువుకునేవాళ్లు నొసలు చిట్లించారు. చాలమంది రాజకీయాలంటే తప్పుగా అర్థం చేసుకుంటారు. రాజకీయాలు అవసరం, అవి ప్రాజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తాయి. అవి మతం, కులం, ప్రాంతం, ప్రాతిపదికన వుండకపోతే చాలు, ఎవరినైనా చేయవచ్చు. చివరికి హింసతోనైనా ప్రజల్ని కాపాడుకోవచ్చనే ఘనమైనా కమ్యూనిజం చరిత్ర కలిగిన తెలంగాణ గడ్డమీద ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి.

నేరుగా ఎమ్మెల్యేలను కొనుగోలుకు బేరమాడుతూ వీడియో సాక్షిగా దొరికిన వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరిస్తున్నప్పుడు ఒక స్త్రీని ఎందుకు అంగీకరించలేకపోతున్నామో ప్రశ్నించుకోవాలి. ఒక స్త్రీని కోట్ల రూపాయల కుంభకోణంలో విచారణకు పిలిచినప్పుడు ఇది అన్యాయం అరిచిన చోట మరో మహిళ ఎలాంటి అవినీతి, కనీసం ఒక పల్లెలో సర్పంచ్ అధికారం కూడా లేకుండా ప్రజలకోసం ఒంటరిగా ప్రభుత్వ బలం మీద కొట్లాడడం ఆహ్వానించాలి. రాజ్య అధికారమ్మీద తిరగబడితే కాల్చిపారేసే హింసని కూడా ఎన్‌కౌంటర్ అనే మామూలు పదానికి మనల్ని కుదించుకున్న అభ్యుదయం మీదుగా ఆలోచించాలి.

అంగీకరించడానికి కారణాలు అవసరం లేదేమో గానీ ఒక విషయాన్ని, వ్యక్తిని ఎందుకు అంగీకరించలేకున్నామో స్పష్టత వుండితీరాలి. అలా కారణం లేదంటే మనలోనే మనకు తెలియనంత మురికి పేరుకుపోయిందని, దాన్ని కడిగేసుకోవాలని గుర్తించాలి.

పార్టీలవారీగా, మతాల వారీగా, ప్రాంతాలవారీగా, కులాల వారీగా మనుషులు విడిపోవడం అంటే మనుషులుగా మనం మిగలకపోవడం. హేతుబద్దత, అభ్యుదయం మనలో వదిలేసుకుని పశుప్రాయంగా బ్రతకడం.

కమాన్, నాకు ప్రాంతాలూ, మనుషులూ, పార్టీలూ, కులాలూ.. అంటగట్టి బూతులు మొదలుపెట్టండి!

-సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్