KTR’s strategy on Moosey: మూసీపై కేటీఆర్ స్ట్రాటజీ ఏంటి? ఏం చేయాలని అనుకుంటున్నారు?

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మూసీ నది చుట్టూనే తిరుగుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందు నుంచి ప్రభుత్వంపై కొట్లాడుతూనే ఉన్నారు. మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తూనే ఉన్నారు.

Written By: Srinivas, Updated On : October 19, 2024 3:00 pm

KTR

Follow us on

KTR’s strategy on Moosey: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మూసీ నది చుట్టూనే తిరుగుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందు నుంచి ప్రభుత్వంపై కొట్లాడుతూనే ఉన్నారు. మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన చాలా వరకు పోరాడుతున్నారు. ఇటు వరుసగా ప్రెస్‌మీట్లు పెడుతూ.. వరుసగా మూసీ బాధితులను కలుస్తూ వస్తున్నారు. మూసీ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని వారికి ధైర్యం ఇస్తున్నారు. మీ తరఫున తాము కొట్లాడుతామని పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు.

మరోవైపు.. మూసీ ప్రాజెక్టుపై ఎవరికి వారుగా అటు ప్రభుత్వం, ఇటు కేటీఆర్ నిత్యం చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు. విలేకరుల సమావేశాలు పెడుతూ ఒకరిపై ఒకరు విరుచుకుపడుతూనే ఉన్నారు. ఎవరికి వారుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తూ వస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ కూడా పెద్దఎత్తున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. గంటన్నరకు పైగా కేవలం మూసీ మీదే మాట్లాడారు. కేటీఆర్ మాత్రం.. మూసీ సుందరీకరణ అంటే తమకూ ఇష్టమేనని చెప్పుకొచ్చారు. అయితే.. తమ ప్రభుత్వం హయాంలో మానవతా దృక్పథంతో ఆపేశామని తెలిపారు. అసెంబ్లీలో చర్చ పెడుదామని, ఈ ప్రాజెక్టు అవసరమో కాదో తేలుద్దామని అన్నారు.

అయితే.. అసెంబ్లీలో గులాబీ పార్టీకి చెప్పుకోదగిన బలమే ఉంది. దాంతో తమ సభ్యుల ద్వారా ముక్తకంఠంతో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు ప్లాన్‌ను అడ్డుకోవచ్చని కేటీఆర్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే.. రేవంత్ కూడా బీఆర్ఎస్‌కు అదే ఆఫర్ ఇచ్చారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ సమావేశానికి వస్తారా అన్న ఒక ప్రశ్న కూడా వినిపిస్తోంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో అసెంబ్లీలో చర్చ పెడితే సస్పెన్షన్లు ఉండేవి. కానీ.. తాము అలాంటి వాటి జోలికి పోమని, పూర్తిస్థాయిలో చర్చిద్దామని ముఖ్యమంత్రి ఆహ్వానిస్తున్నారు. కానీ.. బీఆర్ఎస్ నేతల నుంచి దానిపైనా ఎలాంటి స్పందన రావడంలేదు.

ఇక.. కేటీఆర్ నిన్న కొండా సురేఖపై పరువునష్టం దావా కేసులో కోర్టుకు హాజరుకావాల్సి ఉండే. కానీ.. కేటీఆర్ మాత్రం మూసీ పవర్ ప్రజెంటేషన్ బిజీలో ఉండి అటు అటెండ్ అవ్వలేదు. దాంతో కోర్టు కూడా కాస్త అసహనం వ్యక్తం చేసింది. అయితే.. మూసీకే ఇంతలా ప్రియారిటీ ఇస్తున్న కేటీఆర్.. మూసీపై సరైన స్ట్రాటజీ ప్రకటించడం లేదన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఆ ప్రాజెక్టు వద్దని తాము చెప్పడంలేదని అంటున్నారు.. ఆ ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందని అంటున్నారు.. నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నారని అంటున్నారు.. కానీ ఎక్కడా కూడా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడమా.. ఆపడమా అనేది మాట్లాడడం లేదు. దీంతో అసలు మూసీ విషయంలో కేటీఆర్ స్ట్రాటజీ ఏంటనేది ఎవరికీ అంతుపట్టడంలేదు. ఎంతసేపు లక్షన్నర కోట్లను మూసీ కోసం ఖర్చు పెడుతున్నారనే తప్ప.. రేవంత్ చెప్పినట్లుగా సలహాలు, సూచనలు ఇచ్చేందుకు మాత్రం ముందుకు రావడంలేదు. ఇటు ప్రజల్లోనూ ఎంతసేపు బీఆర్ఎస్ నేతలు చెప్పిందే చెబుతున్నారనే కానీ.. పరిష్కార మార్గాలు కానీ, పరిహారంపై కానీ మాట్లాడడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.