Homeట్రెండింగ్ న్యూస్What is happening in that Print Media: అప్పుడు బదిలీ.. ఇప్పుడు ఎవరి స్థానంలోకి...

What is happening in that Print Media: అప్పుడు బదిలీ.. ఇప్పుడు ఎవరి స్థానంలోకి వారు.. ఆ పత్రికలో ఏం జరుగుతోంది?

What is happening in that Print Media: మీడియాలో ఫీల్డ్ జర్నలిస్టులే కాకుండా.. నాన్ ఫీల్డ్ జర్నలిస్టులు కూడా ఉంటారు. కాకపోతే నాన్ ఫీల్డ్ జర్నలిస్టులు ఎవరికి పెద్దగా పరిచయం ఉండదు. నిన్న మొన్నటిదాకా ఇలాంటి భావనే జర్నలిస్ట్ సర్కిల్లో వినిపించేది. కానీ ఇప్పుడు ఫీల్డ్ జర్నలిస్టుల కంటే నాన్ ఫీల్డ్ జర్నలిస్టులు ముదిరిపోయారని.. రాజకీయాలు చేయడంలో రెండు ఆకులు ఎక్కువ చదివారని.. చివరికి మేనేజ్మెంట్ ను సైతం తప్పుదారి పట్టించి తమకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నారని ఈ ఉదంతం తెలియజేస్తోంది.

ప్రింట్ మీడియాకు రోజులన్ని ఎదురుతంతున్నాయని అందరికీ తెలుసు కదా. చివరికి నెంబర్ వన్ స్థానంలో ఉన్న పత్రిక సైతం తన ప్రింటింగ్ సామర్థ్యాన్ని తగ్గించుకోవడం.. కాపీల సంఖ్య కుదించడం వంటి వార్తలను మనం వింటూనే ఉన్నాం కదా. కానీ ఓ పత్రిక మాత్రం విచిత్రమైన ప్రయోగాలు చేస్తోంది. ఏకంగా పేజీల సంఖ్య పెంచేసింది. కరోనా వైరస్ ప్రబలిన సమయంలో అడ్డగోలుగా సబ్ ఎడిటర్లను రోడ్డుపాలు చేసిన ఆ సంస్థ.. ఇప్పుడు రిక్రూట్మెంట్లు చేపడుతోంది. అయితే దీని ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. సర్కులేషన్ పెరగలేదని.. వార్తల నాణ్యత (స్టేట్ ఫస్ట్ పేజీ మినహాయిస్తే) బాగోలేదని ఆ సంస్థలో పనిచేస్తున్న వారే చెబుతున్నారు. ఇక ఆ సంస్థలో అంతర్గత రాజకీయాలు సరేసరి. ముఖ్యంగా డెస్క్ లలో పనిచేస్తున్నవారు ఫీల్డ్ జర్నలిస్టుల కంటే ముదిరిపోయారు. ఏకంగా మేనేజ్మెంట్ ను సైతం తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే విధంగా చేస్తున్నారు.

Also Read: Nara Lokesh : లోకేష్ టీం రెడీ.. ఎవరెవరు అంటే?

ఆ పత్రికలో ఒక కీలక జిల్లాకు ఎడిషన్ ఇంచార్జిగా పనిచేస్తున్న వ్యక్తి.. గతంలో కొన్ని ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడు. డెస్క్ సంఘం పేర్లతో డబ్బులు వసూలు చేశాడని.. రాజకీయ నేతలతో అంట కాగుతూ అతడే వార్తలు రాస్తున్నాడని.. చివరికి భారీగా వెనకేశాడని యాజమాన్యానికి ఫిర్యాదులు అందాయి. దీంతో విచారణ చేపట్టిన యాజమాన్యం అవన్నీ నిజమని భావించి.. అతనితోపాటు.. ఆ జిల్లాలో రిపోర్టింగ్ విభాగంలో కీలకంగా ఉన్న వ్యక్తికి స్థానచలనం కలిగించింది. ఆ ఎడిషన్ ఇంచార్జ్ ని వేరే జిల్లాకు బదిలీ చేసింది. ఆ జిల్లాలో పనిచేస్తున్న ఎడిషన్ ఇంచార్జిని ఈయన స్థానంలోకి పంపించింది.

మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయంతో ఇద్దరు ఎడిషన్ ఇంచార్జ్ లకు స్థానచలనం కలిగిన తర్వాత.. ఆ పత్రికలో రకరకాల చర్చలు జరిగాయి. ఇక జన్మలో వారిద్దరు అక్కడ పనిచేయాల్సిందేనని… వారు గతంలో పనిచేసిన జిల్లాలకు వెళ్లడం కుదరదని యాజమాన్యం వైఖరితో అందరికీ స్పష్టమైనది. కానీ ఇంతలోనే కాలం గడిచింది. ఏడాదిన్నర దాటిపోయింది. ఈ లోగానే యాజమాన్యం వైఖరి మారిపోయింది. ఏడాదిన్నర క్రితం ఆ ఎడిషన్ ఇన్చార్జిలో కనిపించిన తప్పులు ఒక్కసారిగా మాఫీ అయిపోయాయి. అంతేకాదు ఆయనను పూర్వ జిల్లాకు పంపిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఎడిషన్ ఇంచార్జి కాలర్ ఎగరేసుకుంటూ తన పాత జిల్లాకు వెళ్లిపోయాడు. ఎన్ని రోజులపాటు ఆయన స్థానంలో పనిచేసిన మరో ఎడిషన్ ఇంచార్జి.. గతంలో తను పనిచేసిన స్థానానికి వచ్చాడు.

Also Read: Pawan Kalyan : అందరూ ప్రశ్నిస్తున్న వేళ.. ఎట్టకేలకు స్పందించిన పవన్ కళ్యాణ్.. సంచలన ఆదేశాలు

సాధారణంగా అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయాలు ఉంటాయని మాత్రమే మనం చదువుతాం. రోజు పేపర్లలో.. న్యూస్ ఛానల్స్ లో వాటి గురించే కథనాలు వస్తుంటే చూస్తుంటాం. కానీ రాజకీయ నేతలకు మించిన రాజకీయాలు పాత్రికేయులు చేస్తుంటారు. ఇక ఇప్పటి ఆధునిక కాలంలో నాలుగు గోడల మధ్య పని చేసే నాన్ ఫీల్డ్ జర్నలిస్టులు అంతకుమించి అనే విధంగా రాజకీయాలు చేస్తున్నారు. అన్నట్టు నెంబర్ వన్ గా ఎదగడానికి ఆ పత్రిక యజమాన్యం రకరకాల ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికే సర్కులేషన్ పెంచడానికి అనుకూలంగా వాతావరణాన్ని సృష్టించింది. పేజీల సంఖ్యను కూడా పెంచింది. పత్రికలో దమ్ము ఉండాలి గాని ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. పనిచేసే సిబ్బందికి ప్రోత్సాహం ఇస్తే చాలు అవన్నీ జరిగిపోతాయి. కానీ ఆల్రెడీ “పనికిమాలిన” సిబ్బంది అని ముద్ర వేసిన వారిని మళ్లీ పూర్వ స్థానాలకు పంపించడమే అసలైన విధి వై చిత్రి. మరి ఈ వ్యవహార సాగడానికి తెరవెనుక చక్రం తిప్పిన ఆ కీలక అధిపతి ఎవరు? ఏడాదిన్నర తర్వాత ఆయన ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అసలు ఇంతటి వ్యవహారం నడుస్తుంటే ఆ పత్రిక అధిపతికి తన సంస్థలో.. ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారా? లేకుంటే తన వ్యవసాయ క్షేత్రానికి పరిమితమవుతున్నారా?!

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version