https://oktelugu.com/

KCR : కేసీఆర్ కు ఏమైంది? గజ్వేల్ లో యశోద హాస్పిటల్ బృందం ఎందుకు ఎమర్జెన్సీ యూనిట్ నెలకొల్పింది?

కెసిఆర్ ఆసుపత్రిలో చేర్చితే పార్టీ శ్రేణులు గందరగోళానికి గురవుతాయని భావించి.. ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే చికిత్స అందిస్తున్నారు. యశోద ఆసుపత్రి నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం ఆయనను పర్యవేక్షిస్తోంది. కెసిఆర్ కుటుంబ వైద్యుడు డాక్టర్ ఎంవి రావు ఆధ్వర్యంలో వైద్య బృందం ఎప్పటికప్పుడు చికిత్స అందిస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 16, 2024 / 08:26 PM IST

    KCR

    Follow us on

    KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారా? అందువల్ల గజ్వేల్ ప్రాంతంలో యశోద ఆసుపత్రి బృందం గత వారం రోజులుగా ఎమర్జెన్సీ యూనిట్ నెలకొల్పిందా? 24 గంటల పాటు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందా? అత్యధిక వైద్యం అందించేందుకు వీలుగా ఉండే పరికరాలు గత బుధవారం రాత్రి ప్రత్యేక అంబులెన్స్ లో ఆయన వ్యవసాయ క్షేత్రానికి తీసుకొచ్చారా? ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానాలు ఇస్తున్నాయి భారత రాష్ట్ర సమితి శ్రేణులు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు కెసిఆర్ ఒక్కరోజు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన నేరుగా హైదరాబాద్లోని తన ఇంటికి వెళ్ళిపోయారు. కొంతమంది పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం ఇటీవల గజ్వేల్ లోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయారు. అప్పటిదాకా ఆరోగ్యంగానే ఉన్న ఆయన.. ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. ఆయనను ఆసుపత్రిలో చేర్చితే పార్టీ శ్రేణులు గందరగోళానికి గురవుతాయని భావించి.. ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే చికిత్స అందిస్తున్నారు. యశోద ఆసుపత్రి నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం ఆయనను పర్యవేక్షిస్తోంది. కెసిఆర్ కుటుంబ వైద్యుడు డాక్టర్ ఎంవి రావు ఆధ్వర్యంలో వైద్య బృందం ఎప్పటికప్పుడు చికిత్స అందిస్తోంది.

    అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత..

    గత ఏడాది చివర్లో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అధికార భారత రాష్ట్ర సమితి ఓటమిపాలైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో కేసీఆర్ బాత్ రూం లో కాలు జారిపడ్డారు. ఆ సమయంలో ఆయన తుంటి ఎముకకు ఫ్రాక్చర్ అయింది. ఆయనను అప్పుడు యశోద ఆసుపత్రికి తరలించారు. కొద్దిరోజులపాటు ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందారు. అనంతరం నంది హిల్స్ లోని ఇంటికి వెళ్ళిపోయారు. కొద్దిరోజులైన తర్వాత కోల్కున్నారు. అలానే స్టిక్ సహాయంతో నడుచుకుంటూ వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఈలోపు పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో చేతిలో స్టిక్ తో నడుచుకుంటూనే ప్రచారం చేశారు. ప్రత్యేక బస్సులో ప్రయాణించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలలో ప్రచారం చేశారు. అయినప్పటికీ భారత రాష్ట్ర సమితికి ఒక్క సీటు కూడా రాలేదు. ఆయన సొంత జిల్లా అయిన మెదక్ జిల్లా పార్లమెంటు స్థానాన్ని కూడా భారత రాష్ట్ర సమితి గెలుచుకోలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతమంది భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరగా, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మరికొంతమంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.. ఇక కెసిఆర్ సమయం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. ప్రభుత్వం కూలిపోతుందంటూ శాపనార్థాలు పెట్టారు.

    పార్టీ శ్రేణుల్లో ఆందోళన..

    ఇక ప్రస్తుతం కెసిఆర్ తీవ్రమైన అనారోగ్యానికి గురి కావడంతో పార్టీ కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది.. కేటీఆర్ ప్రస్తుతం పార్టీ బాధ్యతలు మొత్తం మోస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇదే క్రమంలో పార్టీలో మరో కీలక నాయకుడు హరీష్ రావు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆయన ఇండోనేషియాలోని బాలిలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కేసీఆర్ అనారోగ్య విషయం తెలిసిన కొందరు నాయకులు ఆయన హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని యశోద ఆసుపత్రి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు. ” కెసిఆర్ గురించి గత కొద్దిరోజులుగా మాకు ఎటువంటి సమాచారం లేదు. ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారని చెబుతున్నారు. ఆ స్థాయిలో అనారోగ్యానికి గురైతే మాకు ఎందుకు చెప్పడం లేదు. యశోద ఆసుపత్రి యాజమాన్యం ఆ స్థాయిలో ఏర్పాటు చేసినప్పటికీ ఒక్క ముక్క కూడా బయటకి చెప్పడం లేదు. కెసిఆర్ అనారోగ్యంపై మాకు అనుమానాలు ఉన్నాయి. వీటిని నివృతి చేయాలని” భారత రాష్ట్ర సమితి నాయకులు డిమాండ్ చేస్తున్నారు.. అయితే కెసిఆర్ కు ఏమైంది? ఆయన ఆ స్థాయిలో ఎందుకు అనారోగ్యానికి గురయ్యారు? అనే విషయాలపై భారత రాష్ట్ర సమితి కీలక నేతలు సమాధానాలు చెప్పడం లేదు. మరోవైపు ఇటీవల కవిత అరెస్టుపై కేసీఆర్ తొలిసారి స్పందించారు. బిడ్డ అరెస్టై జైల్లో ఉంటే బాధ ఉండదా అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. బహుశా ఆయన అనారోగ్యానికి అదే కారణమై ఉంటుందని తెలుస్తోంది.