DSP Nalini: డీఎస్పీ నళిని.. తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచింది. క్రియాశీల పాత్ర పోషించింది. తన ఉద్యోగాన్ని సైతం వదులుతుంది. ఉద్యమంలో పాల్గొన్నందుకు నాటి ప్రభుత్వం ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. సస్పెన్షన్ వేటు విధించింది. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకు తెలంగాణ సిద్ధించింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. ఉద్యమ నాయకుడిగా చెప్పుకునే కెసిఆర్ నళిని కి న్యాయం చేయలేకపోయాడు. కనీసం ఆమెను పట్టించుకోలేదు. అప్పటికే ఆమెకు అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తాయి. తట్టుకోలేకపోయింది. భరించలేకపోయింది. పైగా అల్లోపతి మందులు ఆమె వ్యాధిని నయం చేయలేకపోగా.. ఇంకా ఇబ్బంది పెట్టాయి. ఆ మందులను వాడలేక ఆయుర్వేదంలోకి వెళ్లిపోయింది. బాబా రాందేవ్ ఆశ్రమంలో చేరింది. సుదీర్ఘకాలం ఆయుర్వేద మందులు వాడింది. సాంత్వన పొందింది. పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే సన్యాసిని అయిపోయింది.
ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ఆమె ఆశ్రమంలో చేరి కొన్ని పుస్తకాలు రాసింది. దైవచింతనలో ఉంది. 2023లో రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నళిని రేవంత్ రెడ్డిని కలిసింది. సమస్యను చెప్పుకుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులను ఇస్తానని రేవంత్ ఆమెకు మాట ఇచ్చాడు. అంతేకాదు ఆశ్రమం ఏర్పాటుకు సహకరిస్తానని భరోసా కల్పించాడు. కానీ అవేవీ ముందుకు పడలేదు. పైగా నళిని రాసిన లేఖ కూడా బుట్ట దాఖలైంది. దీంతో నళిని తట్టుకోలేకపోయింది. అయినప్పటికీ ప్రభుత్వాల తీరు ఇలానే ఉంటుంది అనుకొని సర్ది చెప్పుకుంది. ఈ లోగానే ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. మందులు కూడా లొంగడం లేదు. ఇప్పుడు నళిని రోజులు లెక్కబెడుతోంది. ఏ క్షణమైనా సరే ఆమెకు మరణం సంభవించవచ్చు.
మరణం చివరి రోజుల్లో తన పరిస్థితి నళినికి అర్థమవుతోంది. అందువల్ల తన బాధను ఒక వాంగ్మూలం రూపంలో సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసింది. తను చనిపోయిన తర్వాత ఏ రాజకీయ పార్టీ నాయకుడు భౌతిక దేహాన్ని సందర్శించవద్దని సూచించింది. నివాళులు అర్పించవద్దని కోరింది. ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇస్తే.. అవి తన ఆశ్రమానికి చేరిపోతాయని నళిని పేర్కొంది. ఒకవేళ ప్రభుత్వం దయ తలచి తన ఆరోగ్యం గురించి పట్టించుకుని.. చికిత్స అందిస్తే.. కోలుకున్న తర్వాత తాను పుస్తకాలు రాస్తానని.. ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తానని పేర్కొంది. కానీ ప్రభుత్వాలు ఆమెకు సహకరిస్తాయా.. తెలంగాణ ఉద్యమ కారుడినని చెప్పుకునే కెసిఆర్ పట్టించుకోలేదు. ప్రత్యామ్నాయంగా ఉన్న రేవంత్ కనికరించలేదు. నిజంగా ఓ తెలంగాణ ఉద్యమ కారురాలికి అన్యాయం జరగడం విషాదం.