AP Rain Alert: ఏపీకి( Andhra Pradesh) ఈరోజు భారీ వర్ష సూచన ఉంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు,బాపట్ల, పల్నాడు జిల్లాలో పలుచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ హెచ్చరికలతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సైతం అప్రమత్తమయింది. ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు చెబుతోంది. మరోవైపు అల్లూరి సీతారామరాజు, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు పిడుగులతో కూడిన వర్ష హెచ్చరికలు జారీచేసింది.
* ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..
అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆదివారం ప్రకాశం( Prakasam ), నెల్లూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, కడప అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాలో పిడుగులతో కూడిన వాన పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీవ్యాప్తంగా శనివారం వర్షాలు పడ్డాయి. నంద్యాల జిల్లాలోని ఉయ్యాలవాడ, మహానందిలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలతో కోవెలకుంట్ల జమ్మలమడుగు మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు వంతెన మధ్యలో చిక్కుకు పోయింది. అధికారులు సకాలంలో స్పందించి ప్రయాణికులను కాపాడారు. మహానంది మండలంలో పాలేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
* రాయచోటిలో వర్ష బీభత్సం..
అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా అనంతపురం జిల్లాలో( Ananthapuram district) భారీ వర్షాలు నమోదు అవుతుండటం విశేషం. గత రెండు రోజులుగా రాయచోటిలో భారీ వర్షాలు పడ్డాయి. శుక్రవారం రాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి నలుగురు ప్రాణాలు కూడా కోల్పోయారు. వరదలో కొట్టుకుపోయిన గణేష్, షేక్ ముని, ఇలియాస్, యామిని నలుగురు చనిపోయారు. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించింది. మరోవైపు మంత్రి రాంప్రసాద్ రెడ్డి వ్యక్తిగతంగా లక్ష రూపాయల చొప్పున సహాయం అందజేశారు.