
సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గతంలో అనేక సందర్భాల్లో పేద ప్రజలకు సహాయం చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రజలు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే బాలయ్య ఏదో ఒక రూపంలో వాళ్లకు సాయం చేస్తూ గొప్ప మనస్సును చాటుకుంటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వల్ల లాక్ డౌన్ అమలైన సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలకు భారీ మొత్తంలో బాలయ్య విరాళం ఇచ్చారు.
హిందూపురంలోని కరోనా ఆస్పత్రికి భారీ మొత్తంలో సహాయం చేయడంతో పాటు కరోనా రోగులకు అవసరమైన వాటిని చేకూర్చారు. తాజాగా హైదరాబాద్ వరద బాధితులకు సైతం భారీ మొత్తంలో సాయం ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జంట నగరాల్లో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి రాలేదు.
నగరంలో నిన్న మరోసారి వర్షం కురిసింది. నందమూరి బాలకృష్ణ కోటి 50 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. బసవతారక రామా సేవసమితి ద్వారా బిర్యానీ ప్యాకెట్ల పంపిణీ చేపట్టారు. నగరంలోని పలు కాలనీల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బాలయ్య చేసిన సాయం వల్ల వాళ్లకు ఎంతో ప్రయోజనం కలగనుందనే చెప్పాలి. ఎడతెరపి లేని వర్షాల వల్ల ప్రజలు బాధ పడుతున్న నేపథ్యంలో బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు.
బాలయ్య తీసుకున్న నిర్ణయాన్ని హైదరాబాద్ వాసులు ప్రశంసిస్తున్నారు. ఇతర సెలబ్రిటీలు కూడా ఇదే విధంగా ముందుకు వచ్చి సాయం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో బాలయ్య ఇప్పటికే ఎన్నో గొప్ప కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే.