Telangana HYDRA : హైదరాబాదులో హైడ్రా దూకుడుకు కళ్లెం పడినట్టేనా.. రేవంత్, రంగనాథ్ తదుపరి అడుగులు ఏమిటి?

హైదరాబాదులో ఆక్రమణకు గురైన చెరువులను, ఇతర నీటి కుంటలను కాపాడేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుం బిగించారు. ప్రతి ఏటా వర్షాల వల్ల హైదరాబాద్ నగరం మునిగిపోతోంది. అపారమైన నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఆక్రమణకు గురైన చెరువులకు పూర్వరూపు తీసుకురావాలని ఆయన భావించారు. ఇందులో భాగంగా హైడ్రా వ్యవస్థను తెరపైకి తీసుకువచ్చారు. దీనికి కమిషనర్ గా రంగనాథ్ ను నియమించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 9, 2024 1:59 pm

Telangana HYDRA

Follow us on

Telangana HYDRA : హైడ్రా ఏర్పాటు చేసిన నాటి నుంచి అక్రమార్కులు వణికి పోతున్నారు. చెరువులను చెరబట్టి నిర్మించిన భవనాలు నేలమట్టమవుతున్నాయి. వాణిజ్య సముదాయాలు కూలిపోతున్నాయి. హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి కొత్త కోణాన్ని అందుకుంది. ఇటీవల హైడ్రా నాగార్జున చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను పడగొట్టింది. ఆ విషయంలో ప్రభుత్వాన్ని సమర్థించకపోగా.. నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను పడగొట్టడం తప్పుడు చర్య అన్నట్టుగా పేర్కొంది. ఇక భారత రాష్ట్ర సమితి అనుబంధం మీడియా రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా అనేది తప్పుడు వ్యవస్థ అని తీర్మానించింది. దానివల్ల హైదరాబాద్ రియల్ బిజినెస్ మీద ప్రభావం పడుతుందని అడ్డగోలు వాదనకు దిగింది..

అక్రమార్కుల్లో వణుకు

వాస్తవానికి హైదరాబాదులో హైడ్రా చర్యలు తీసుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి చాలామంది అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. దీంతో ప్రభుత్వ చర్యలకు బ్రేక్ వేసేందుకు తెరపైకి పేదలను తీసుకొస్తున్నారు. తమ ఆక్రమించిన ప్రాంతాలలో పేదలు ఇళ్లు నిర్మించుకున్న జీవిస్తున్నారని.. వారి ఇళ్ళను పడగొడతారా అంటూ వితండవాదానికి దిగడం మొదలుపెట్టారు. దీంతో హైడ్రా ఒక అడుగు వెనక్కి వేయక తప్పలేదు. పైగా సోషల్ మీడియాలో హైడ్రా కూల్చివేతలపై భారత రాష్ట్ర సమితి అనుబంధ సోషల్ మీడియా రకరకాల వ్యాఖ్యలకు దిగడంతో.. హైడ్రా సరికొత్త నిర్ణయం తీసుకుంది.

పాతపాటి జోలికి పోవడం లేదు

కొత్తగా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను తాము పడగొడుతున్నామని.. పాతపాటి జోలికి పోవడం లేదని హైడ్రా అధిపతి రంగనాథ్ స్పష్టం చేశారు. వాస్తవానికి మనదేశంలో పేదలు చెరువులను కబ్జా చేసిన చరిత్ర లేదు. చెరువుల్లో మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని చెరువు పరిసర ప్రాంతాల్లో కాసేపు సేద తీరితేనే రుసుము వసూలు చేస్తారు. అలాంటి పరిస్థితులు ఉన్నచోట పేదలు చెరువులను కబ్జా చేసి.. అక్రమ నిర్మాణాలు చేయడం అనేది అసంబద్ధ విషయం. చెరువుల సమీపంలో పేదలు నివసిస్తున్నది వాస్తవమే అయినప్పటికీ.. వాటిని కబ్జా చేసింది మాత్రం ముమ్మాటికి పేదలు కాదు. వారి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్నవారు. వారికి అధికారం ఉండడంతో అప్పటి రోజుల్లో మాయమాటలు చెప్పి ఆ చెరువు భూములను పేదలకు అమ్మారు. అది చెరువు స్థలమని తెలియక కొనుగోలు చేసి.. తమ స్థాయిలో ఇంటిని నిర్మించుకున్న పేదలు ప్రస్తుతం హైడ్రా చేతిలో బలి పశువులవుతున్నారు. వాస్తవానికి కబ్జా చేసింది రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్నవారు. అలాంటి వారిని ప్రభుత్వం శిక్షించాలి. హైడ్రా కూల్చివేతలు చేపట్టడం సరైన చర్య అయినప్పటికీ.. ఆ పేదలకు ఇలాంటి స్థలాలను అమ్మిన వారిపై హైడ్రా కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వారి వద్ద నుంచి పేదలకు పరిహారం ఇప్పించాల్సి ఉంటుంది.

లక్ష్యం పక్కదారి పడుతోంది

ఇదే సమయంలో హైడ్రా పాత నివాసాల పేరుతో వారికి క్లియరెన్స్ ఇచ్చేస్తే.. ప్రయోజనం లభించదు. కొత్తగా చేస్తున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని చెబుతున్న హైడ్రా.. పాతపాటి గురించి మాట్లాడటం లేదు. అంటే పాత నిర్మాణాలను అలానే వదిలిపెడుతుందా.. ఒకవేళ అలాంటి నిర్ణయం కనుక తీసుకుంటే హైడ్రా లక్ష్యం మొత్తం పక్కదారి పట్టినట్టే. ఒకవేళ ఇదే రేవంత్ రెడ్డి, రంగనాథ్ అంతిమ నిర్ణయం అయితే జన్వాడ ఫామ్ హౌస్ కు ఎటువంటి ఇబ్బంది ఉండదు. రేవంత్ రెడ్డి సోదరుడి ఇల్లు నేలమట్టం కాదు. హిమాయత్ సాగర్, గండిపేట చెరువు, అమీన్ పూర్ చెరువు పరిధిలోని నిర్మాణాలు దర్జాగా ఉంటాయి.. ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ లో నిర్మించిన పెద్ద పెద్ద భవనాలు నిక్షేపంగా ఉంటాయి.. అప్పుడు భారత రాష్ట్ర సమితి చేసిన ఆరోపణలు నిజమవుతాయి. ఇలాంటి సమయంలోనే రేవంత్ రెడ్డి, రంగనాథ్ బలంగా అడుగులు వేయాలి. లేకుంటే కమ్యూనిస్టు నారాయణ చెప్పినట్టు.. రేవంత్ రెడ్డి హైడ్రాకే బలి కాక తప్పదు. నిష్టూరంగా ఉన్నప్పటికీ అంతిమంగా ఇదే నిజమవుతుంది.