Venu Swamy : సెలెబ్రిటీల జాతకాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ చాలా కాలం నుండి సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న వ్యక్తి వేణు స్వామి. సమంత, నాగచైతన్య విడిపోతారంటూ గతంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన చెప్పినట్టుగానే వీళ్లిద్దరు పెళ్ళైన నాలుగేళ్లలోనే విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటి నుండి ఈయన సోషల్ మీడియా లో సెలెబ్రిటీల జాతకాలతో వీర విహారం చేశాడు. ప్రభాస్ కి ఇక జీవితంలో సూపర్ హిట్ రాదనీ, 2024 సార్వత్రిక ఎన్నికలలో మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అవుతాడని ఇలా పలు వ్యాఖ్యలు చేశాడు. ఇవి విఫలం అవ్వడంతో మళ్ళీ జాతకాలు చెప్పను అంటూ ఒక వీడియో ని విడుదల చేశాడు. ఈ వీడియో ని విడుదల చేసిన కొద్దినెలలకే ఆయన నాగ చైతన్య, శోభితలు విడిపోతారని వ్యాఖ్యానించాడు. ఈ మాటల తెలుగు సినీ పరిశ్రమ భగ్గుమంది. సోషల్ మీడియా లో నెటిజెన్స్ వేణు స్వామి పై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
శుభమా అంటూ పెళ్లి చేసుకున్న కొత్త జంట గురించి బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి సిగ్గు లేదా అంటూ వేణు స్వామిని తిట్టసాగారు. అంతే కాకుండా టాలీవుడ్ జర్నలిస్టుల సంఘం మహిళా కమీషన్ కి వేణు స్వామి పై ఫిర్యాదు కూడా చేశారు. దీంతో మహిళా కమీషన్ వేణు స్వామి కి కమీషన్ ఆఫీస్ కి వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది. వేణు స్వామి దీనిని వ్యతిరేకిస్తూ హై కోర్టులో పిటీషన్ వేసాడు. హైకోర్టు ఈ పిటీషన్ ని కొట్టివేస్తూ, వేణు స్వామిపై చర్యలు తీసుకునేందుకు కమీషన్ కి హక్కులు ఉన్నాయని తీర్పుని ఇచ్చింది. దీంతో వేణు స్వామి నేడు మహిళా కమీషన్ కి చేరుకొని, శోభిత – నాగ చైతన్య దంపతులపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాని చెప్పుకొచ్చాడు. మహిళా కమీషన్ మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని వేణు స్వామిని కఠినంగా హెచ్చరించి పంపింది.
మహిళా కమీషన్ ఉత్తర్వులను ఇన్ని రోజులు పట్టించుకోకుండా, రివర్స్ లో వాళ్ళు ఇచ్చిన నోటీసులపై పోరాడిన వేణు స్వామిలో అకస్మాత్తుగా ఇంత మార్పు ఎలా వచ్చిందంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనుమానిస్తున్నారు. కమీషన్ నోటీసులను లెక్క చేయకపోతే అరెస్ట్ చేస్తారు అనే భయం తోనే వేణు స్వామి తగ్గాడని అంటున్నారు విశ్లేషకులు. ఇదంతా పక్కన పెడితే కొద్దిరోజుల క్రితమే వేణు స్వామి సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ని సందర్శించి, అతని కుటుంబానికి మూడు లక్షల ఆర్ధిక సాయం అందించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా అల్లు అర్జున్ జాతకం ఏప్రిల్ వరకు బాగలేదని, ఆ తర్వాత నుండి మాత్రం అద్భుతంగా ఉంది అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు వేణు స్వామి. ఇంత జరిగినా కూడా ఈయన ఇలా బహిరంగంగా జాతకాలు చెప్పడం మానడం లేదని ఆ సమయంలో నెటిజెన్స్ ఈయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.