అన్యాయాలపై ప్రశ్నించిన బుడ్డోడు.. తెలంగాణలో వైరల్ 

వాన పడిందా.. వరద వచ్చిందా.. ఆ వరదలో పడవలు వేసుకుంటూ ఆడుకోవాల్సిన వయసు ఆ బాలుడిది. అసలే పేద కుటుంబం.. అందులోనూ రైతు బిడ్డడు. వయస్సు పదేళ్లు. ఈ బాలుడు ఏం చేశాడో తెలిస్తే అందరూ షాక్ అవుతారు. అధిక వర్షాలతో రైతులు పడుతున్న బాధలను వెలుగులోకి తీసుకొచ్చాడు. రైతులను ఎవరూ పట్టించుకోరా..? అంటూ ఏకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. తన తాత వేసిన పొలం వాన నీటితో మునిగింది. మెడదాకా వచ్చిన ఆ నీళ్లలోనే కూర్చొని.. దండం […]

Written By: NARESH, Updated On : September 21, 2020 8:48 pm

boy questioned telangana

Follow us on

వాన పడిందా.. వరద వచ్చిందా.. ఆ వరదలో పడవలు వేసుకుంటూ ఆడుకోవాల్సిన వయసు ఆ బాలుడిది. అసలే పేద కుటుంబం.. అందులోనూ రైతు బిడ్డడు. వయస్సు పదేళ్లు. ఈ బాలుడు ఏం చేశాడో తెలిస్తే అందరూ షాక్ అవుతారు. అధిక వర్షాలతో రైతులు పడుతున్న బాధలను వెలుగులోకి తీసుకొచ్చాడు. రైతులను ఎవరూ పట్టించుకోరా..? అంటూ ఏకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. తన తాత వేసిన పొలం వాన నీటితో మునిగింది. మెడదాకా వచ్చిన ఆ నీళ్లలోనే కూర్చొని.. దండం పెడుతూ రైతుల అవస్థలు వివరించాడు. చివరికి అతని ప్రయత్నం ఫలించింది. ఉన్నతాధికారులు దిగొచ్చారు. పదేళ్లలోనే ఇంతటి ధైర్యం చేసి మాట్లాడిన బాలుడికి అందరూ మెచ్చుకుంటున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అర్రూర్‌ గ్రామానికి చెందిన రైతు దొంతి అయిలయ్య ఆరెకరల్లో వరి సాగు చేశాడు. ఇందుకు రూ.1.60 లక్షలు ఖర్చు చేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు.. పొట్టదశలో ఉన్న పంట మొత్తం నీట మునిగింది. ఆ నీళ్లను బయటికి తోడేసే వీలు లేకుండా బోరు, మోటరు, స్టార్టర్‌ కూడా మునిగిపోయాయి. కిందికి వెళ్లే దారిలేక ఆ వరద నీరు పొలంలోనే రోజులపాటు నిలిచిపోయింది. పంటపోయి, అప్పులే మిగిలాయి. దీంతో అయిలయ్య ఆవేదనను చూడలేక బాలుడు వరుణ్‌ ఇలా వినూత్న ఆలోచన చేశాడు.

Also Read : కోవిడ్ నిధులపై బండి-కేటీఆర్ కొట్లాట..!

ఇటీవల కురిసిన భారీ వర్షాలు రైతులను భారీగా దెబ్బతిశాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కోట్లాది రూపాయల్లో రైతులు పెట్టుబడులు నష్టపోయారు. ఈ వర్షాలు వరుణ్‌ కుటుంబాన్ని కూడా ఎంతో దెబ్బతీశాయి. అర్రూర్‌‌ గ్రామంలోని కాండ్లబావికుంట ఎగువ భాగంలోని శిఖం పట్టాలో వీరి భూమి ఉంది. కుంట నిండితే అదనపు వాటర్‌‌ బయటకు వెళ్లేందుకు అక్కడ అలుగు నిర్మించలేదు. తూము వదలాలి. దీంతో కుంట నిండినప్పుడల్లా పొలం నీటి పాలవుతోంది. తాత ఇబ్బందులను అందరికీ తెలియజేయాలని వరుణ్‌ నీళ్లలో కూర్చొని మేనమామ సాయంతో వీడియో రూపొందించాడు. ‘మాకు డబ్బులొద్దు.. ఈ నీళ్లు బయటకు పోయేలా తూములు తెరవండి. ఈ సమస్యకు శాశ్త పరిష్కారం చూపించండి’ అంటూ అధికారులను వేడుకున్నాడు.

ఇంకా ఏమన్నాడంటే.. ‘టీవీ షోల్లో.. సినిమాల్లో చూపించినట్లుగా రైతులు ఉండరు. మా పొలం మునిగిపోయినందుకు నష్టపరిహారం అడగట్లేదు.. కాండ్లబావికుంట తూము సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ గారిని వేడుకుంటున్నాను. రైతు పండించిన అన్నమే తింటూ రైతుల కష్టాలు ఎందుకు పట్టించుకోరా..? కంపెనీలు చేసే వేల కోట్ల అప్పులు తీరుస్తున్న ప్రభుత్వం.. రైతుల సమస్యలను ఎందుకు పట్టించుకోదు?’ అంటూ ఒకటిన్నర నిమిషాల వీడియోను వరుణ్‌ రిలీజ్‌ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిచడమే కాకుండా అటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

ఈ వీడియో ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతలు మరింత హైలైట్‌ చేశారు. ‘ముఖ్యమంత్రి గారూ ఈ 10 ఏళ్ల పిల్లాడికి సమాధానం చెప్పడం హౌజ్‌ అరెస్ట్ చేసినంత తేలిక కాదు’ అంటూ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కాగా.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ కూడా స్పందించారు. వరుణ్ చెప్పిన రైతు సమస్యపై విచారణ జరపాలని సిబ్బందిని ఆదేశించగా.. యంత్రాంగం కదిలొచ్చి తూములోంచి నీళ్లు వెళ్లిపోయే ఏర్పాటు చేశారు. దీంతో వరుణ్ కుటుంబం ఇబ్బందులు తాత్కాలికంగా తొలగిపోయినట్లైంది.